నీట మునిగిన అమరావతి, రాకపోకలు బంద్
హెల్ప్ లైన్ ఏర్పాటు-1070, 112, 18004250101, ఇవాళా వర్షాలున్నాయని హెచ్చరిక;
By : The Federal
Update: 2025-08-14 04:35 GMT
రాజధాని అమరావతి మరోసారి వరద నీటిలో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గుంటూరు వైపు నుంచి, సత్తెనపల్లి నుంచి రాజధాని అమరావతి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.
రాజధాని పరిసర ప్రాంతాల్లోని నీరుకొండ,నేలపాడు, హైకోర్టుకు వెళ్లే దారి, అధికారుల బంగ్లాలు నిర్మిస్తున్న ప్రాంతం, ఐకానిక్ టవర్లు, పెదపరిమి, వెలగపూడి లోతట్టు ప్రాంతాలు ప్రస్తుతం నీట మునిగి ఉన్నాయి.
రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి.
మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ముంపులో చిక్కుకున్నాయి.
అధికారులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇవాళా వర్షాలున్నాయి, జాగ్రత్త...
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ (ఆగస్టు 14న) భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద...
విజయవాడ సమీపంలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించ వద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం చేయవద్దని, అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయమని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.