పొత్తుకు చంద్రబాబు ముందుకొస్తే మేం రెడీ
ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. జనసేన మా మిత్రపక్షమేనని బీజేపీ చెబుతున్నది. ఇంతకూ బీజేపీ వైఖరి ఏంటి..
Byline : The Federal
Update: 2024-01-04 15:07 GMT
సార్వత్రిక ఎన్నికలపై అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. పొత్తుల ఎత్తులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. జనసేన మా మిత్రపక్షమేనని బీజేపీ చెబుతున్నది. ఇంతకూ బీజేపీ వైఖరి ఏంటి..
టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు నాలుగడుగులు ముందుకు వేసింది జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్. ఆ తరువాత చంద్రబాబు పొత్తును ఖరారు చేసి పవన్ కళ్యాణ్ ద్వారానే పొత్తు పెట్టుకుంటున్నట్లు వెల్లడించేలా చేశారు. అందుకు కారణాలు ఉన్నాయి. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉండగా చంద్రబాబును కలిసిన పవన్‌కళ్యాణ్ జైలు వద్ద బయట విలేకరులతో మాట్లాడుతూ పొత్తు పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత పొత్తులకు వ్యతిరేక స్వరం వినిపించిన జనసేన నాయకులను సైతం పార్టీలో ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆదేశించి ఆశ్యర్య పరిచారు.
ఇప్పుడు బీజేపీ స్వరం ఏమంటున్నది..
‘పొత్తుల అంశంపై మేం ఒక్కరమే తీసుకునే నిర్ణయం కాదు. మాతో పొత్తు పెట్టుకోవాలనుకొనే వారు కూడా స్పందించాలి. పొత్తు కోరేవారు అధిష్ఠానంతో మాట్లాడాలి. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ బలహీనంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తులో కలిసి రావాలని జనసేన అధినేత పవన్ చెబితే సరిపోతుందా? పొత్తు కోరేవారు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుంది’ అని బిజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పేర్కొన్నారు. దీనిని బట్టి చంద్రబాబు అడిగితే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని అర్థమవుతున్నది.
విజయవాడ బీజేపీ కార్యాలయంలో రెండో రోజు పదాధికారులు, ముఖ్యనేతల సమావేశం గురువారం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మరికొందరు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి మాట్లాడారు. ‘జనసేన మా మిత్రపక్షమే. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు? మా పార్టీ బలోపేతం కోసం మేం పనిచేస్తాం. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించాం. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తాం. అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదే’ అని స్పష్టం చేశారు. సత్యకుమార్ మాట్లాడేటప్పుడు టీడీపీ మాతో మాట్లాడితే పొత్తు ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో ఇక తెలుగుదేశం పార్టీదే తుది నిర్ణయం. పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో భేటీ అయ్యారు.