సీఎంకు ఇచ్చినంత సమయం జగన్‌కు ఇవ్వాలంటే కుదరదు
అసెంబ్లీకి సంబంధించిన హాజరు పట్టికలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.;
By : The Federal
Update: 2025-02-10 12:30 GMT
అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మైక్‌టైమ్ మీద అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. అసెంబ్లీలో సభా నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినంత సమయం, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇవ్వాలంటే ఎలా కుదురుతుందని ఆంధ్రప్రపదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాలని జగన్ చెప్పడం వింత వాదన అవుతుందన్నారు. చట్టాలు, రూల్స్ మార్చి జగన్‌మోహన్‌రెడ్డికి సమయం ఇవ్వలేం కదా? అని స్పీకర్ అన్నారు.
ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొత్త ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఆహ్వానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి రాకుండా తన ప్యాలెస్‌లో కూర్చుని జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడితే.. దానికి అసెంబ్లీలో ప్రభుత్వం, మంత్రులు సమాధానం చెప్పాలని జగన్‌తో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనడం వింత వాదనగా ఉందన్నారు. భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా? చట్టాలు, రూల్స్ మీద అవగాహన ఉండే జగన్‌మోహన్‌రెడ్డి అలా మాట్లాడుతున్నారా? అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఏ రూల్, ఏ చట్టం ప్రకారం సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయం, జగన్‌మోహన్‌రెడ్డికి ఇవ్వాలని ఆయన ప్రశ్శించారు.
జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రే కావచ్చు.. కానీ ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు.. పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేంత ఎమ్మెల్యేల సంఖ్యా బలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని, ఇది జగమెరిగిన సత్యమని అన్నారు. అయితే ఈ విషయం జగన్‌మోహన్‌రెడ్డికి తెలియక పోవడం బాధాకరమని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తొలుత చట్టాలు, రూల్స్ తెలుసుకోవాలన్నారు. చట్టాలు, రూల్స్ మార్చి జగన్‌కు, సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయం ఇవ్వలేమని అని వెల్లడించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తక్కిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని వారికి జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వాలన్నారు. వారి వారి అసెంబ్లీ నియోజక వర్గాల్లో సమస్యలను సభలో చెప్పుకొనే అవకాశం కల్పించాలి అని స్పీకర్ సూచించారు. సభకు వచ్చి సమస్యలపై జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కోరుతున్నట్లు చెప్పారు.
అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. ఒక వేళ అసెంబ్లీకి రాలేని పక్షంలో.. ఫలానా కారణాల వల్ల సభకు రాలేక పోతున్నాననే లేఖను స్పీకర్‌కు సంబంధిత సభ్యులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వ్యక్తిగతంగా స్పీకర్‌కు సభ్యులు లేఖలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీకి సంబంధించిన హాజరు పట్టికలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీలో తనకు తగినంత మైక్ టైమ్ ఇవ్వాలని, అలా ఇస్తే ప్రజల సమస్యలను వెల్లడించే అవకాశం ఉంటుందని.. ప్రతిపక్ష హోదా ఇచ్చి, ప్రతిపక్ష నేతకు తగినంత సమయం ఇస్తే అసెంబ్లీకి వెళ్లడంలో ఇబ్బంది ఏముంటుందని, కానీ కూటమి ప్రభుత్వం అలా ఇవ్వడం లేదని.. ఇలాంటి వాతావరణంలో అసెంబ్లీకి వెళ్లి ఏం లాభమని ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.