హరే రామాకు బుదులు అల్లా జపించాం
కొండ ఎక్కలేమంటే చంద్రమౌళే ప్రోత్సహించారు. ఉగ్ర వాదులకు భయపడి హరే రామకు బదులు అల్లా.. అల్లా అని జపించాం. పహల్గాం ఘటనలో తప్పించుకున్న సుచిత్ర భయానక అనుభవాలు..;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-04-25 06:07 GMT
ఏటా ఏదో పర్యాటక ప్రాంతానికి వెళ్లడం ఆ స్నేహితులకు అలవాటు. అలా ఆ స్నేహితులు కశ్మీర్ పర్యటనకు వెళ్లాలని రెండేళ్ల నుంచి తహతహలాడారు. కానీ ఏవో కారణాలతో వాయిదా పడడంతో వెళ్లలేకపోయారు. రాబోయే రోజుల్లో కశ్మీర్ పర్యటన క్లిష్టతరమవుతుందని, ఈసారి ఎలాగైనా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఈనెల 18న కశ్మీర్ యాత్రకు బయల్దేరారు విశాఖకు చెందిన చంద్రమౌళి, అప్పన్న, శశిధర్ దంపతులు. పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పుల్లో చంద్రమౌళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడ పర్యాటకులను పిట్టల్లా కాల్చి పారేయడాన్ని కళ్లారా చూసిన వీరంతా ఇప్పటికీ భయంతో వణికిపోతున్నారు. తాము టెర్రరిస్టుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలను కన్నీటి సుడులతో చెబుతున్నారు.
నుదుట బొట్టుంటే చంపేస్తారని కడిగేశాః సుచిత్ర
పహల్గాం కొండపైకి అతికష్టమ్మీద చేరుకున్న మాకు ఓ హోటల్లో సేదతీరుతున్నాం. ఆ సమయంలో తుపాకీ పేలుళ్ల శబ్దాలు విని బయటకు వచ్చి చూసే సరికి చేతిలో గన్లతో సైనిక దుస్తుల్లో ఉన్న వ్యక్తులు అక్కడి వారిపై కాల్పులు జరుపుతున్నారు. కళ్లెదుట వారు పిట్టల్లా రాలిపోతున్నారు. భయంతో మేమంతా బాత్రూం వెనుక దాక్కుంటే మెయింటనెన్స్ చేసే అబ్బాయి అక్కడున్న ఫెన్సింగ్ కింద నుంచి దూరి పారిపోవడం చూసి ఆయన్నే అనుసరించాం. అ ఫెన్సింగ్ కింద నుంచి నేను పైకి ఎక్కలేకపోతే... మాతో ఉన్న చంద్రమౌళిగారే నాకు సహాయం చేశారు. ఆ తర్వాత ఆయన, మేము చెరోపక్క వెళ్లిపోయాం. ఆయన భార్య మౌళి గారు ఉండిపోయారని ఆందోళన చెందుతుంటే.. ఎలాగోలా ఆయన వచ్చేస్తారు.. అంటూ ఆమెను తీసుకొచ్చేశాం. అలా వచ్చేటప్పుడు హిందువుల్లా కనిపిస్తే కాల్చేస్తారన్న మా వారి సూచనతో ప్రవహిస్తున్న వాగులాంటి నదిలో నీళ్లతో బొట్టును కడిగేసుకున్నాం. అప్పటికే భయంతో హరేరామ, హరేకృష్ణా అంటూ జపం చేస్తున్న వారమంతా మానేసి అల్లా, అల్లా అనడం మొదలు పెట్టి కొండ దిగిపోయాం. కాల్పులు జరుగుతున్నప్పుడు నేను సమీపంలోనే ఉన్నాను. కానీ తలతిప్పే ధైర్యం చేయలేదు. ఎందుకంటే వారు ఎవర్ని కాల్చుతున్నారో, ఎందుకు కాల్చుతున్నారో తెలియలేదు. అప్పుడే మౌళి గార్ని కూడా కాల్చేసినట్లున్నారు. పడుకుండిపోయినట్లు ఉన్న ఆయన్ని చూసి...దాడులకు భయపడి ఆయన అలా ఉన్నారేమో అనుకున్నాం. ఈ భయంకర ఘటన జరిగిన తర్వాత బాడీలను గుర్తించాలని అధికారులు పిలిచారు. అందులో రెడ్ జాకెట్ వేసుకున్న మౌళి గారు ఉండకూడదని దేవుణ్ణి కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఆ రెడ్ జాకెట్ ఉన్న మౌళీగారే శవమై కనిపించడంతో కుప్పకూలిపోయాం అని శశిధర్ భార్య సుచిత్ర కన్నీటి పర్యంతమవుతూ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
టూర్ ప్లాన్ చేసింది చంద్రమౌళేః శశిధర్
‘ఫ్యామిలీతో కశ్మీర్ వెళ్లాలని మా స్నేహితులం ముగ్గురం రెండేళ్లుగా అనుకుంటున్నాం. అయితే వేర్వేరు కారణాలతో వెళ్లలేకపోయాం. ఈ ఏడాది ఎలాగైనా వెళ్దామని చంద్రమౌళి గారే ఈ టూర్ ప్లాన్ చేశారు. మా టూర్ లో నాలుగో రోజు శ్రీనగర్ నుంచి పహల్గాం చేరుకున్నాక కిలోమీటరున్నర కాలి నడకన కొండ ఎక్కలేక వెనక్కి వెళ్లిపోదామని మాలో కొందరన్నారు. కానీ చంద్రమౌళీ గారే ఎంకరేజ్ చేసి...ఇంత దూరం వచ్చాం కదా...కాస్త దూరం ఎక్కితే వెళ్లిపోవచ్చు అని అందరిని ప్రొత్సహించి కొండ ఎక్కించారు. కొండపైకి వెళ్లగానే ముందుగా టాయిలెట్స్ వెళ్లి...ఆ తర్వాత ఏదైనా తిందామనుకున్నాం. టాయిలెట్ కి వెళ్లి బయటకు వచ్చేసరికి మాకు ఏవో శబ్ధాలు. అంతలోనే.ఆడవాళ్ల ఏడుపులు వినిపించాయి. అటు వైపు చూస్తే ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నాడు. ఆయన మావైపు రావడం చూసి ప్రాణభయంతో బయటకు పరుగులు తీసి చెట్ల చాటుకు పోయాం. అప్పటికే చంద్రమౌళి గారిని కాల్చేసినట్టున్నారు. ఎంతో ఆనందంతో ఈ టూర్‌కి వెళ్లిన ఆరుగురిలో ఒకరి ప్రాణాలను అక్కడే వదిలేసి వచ్చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం’ అని శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా నుంచి కుమార్తెలు రాక..
టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన చంద్రమౌళి ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలుసుకుని అక్కడ నుంచి బయల్దేరిన వారు గురువారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. విశాఖ నగరంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఉంచిన తమ తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. శుక్రవారం ఉదయం చంద్రమౌళి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపనున్నారు.
పవన్ కల్యాణ్ పరామర్శ..
ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. అక్కడ నుంచి చంద్రమౌళి పార్థివదేహాన్ని ఉంచిన ఆస్పత్రికి వెళ్లి ఆయనకు నివాళలర్పించారు. అనంతరం చంద్రమౌళి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబీకులను ఓదార్చారు. గురువారం మధ్యాహ్నం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చంద్రమౌళి భౌతికకాయానికి నివాళుర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రూ.10 లక్షల చెక్కు అందజేత...
చంద్రమౌళి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందజేసింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి...చంద్రమౌళి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు.