నీ సొత్తు నికీచ్చాం తల్లీ, మా పిల్లల్ని కాపాడమ్మా..

దేవత సొమ్ము దొంగిలించి పిల్లల అనారోగ్యంతో తెలివిడి తెచ్చుకున్న మంచిదొంగలు..;

Update: 2025-09-05 10:27 GMT
Click the Play button to listen to article
ఇదేమీ-- సినిమా కథ కాదు.. హీరో కొడితేనో, హీరోయిన్ తిడితేనో ఆ దొంగకి బుద్ధి రాలేదు. అవసరం దొంగతనానికి పురి కొల్పితే.. నమ్మకం లేదా విశ్వాసం పశ్చాత్తాపానికి దారి చూపింది. దేవుడి సొమ్ము కాజేసి ఆ తర్వాత తెలివిడి తెచ్చుకుని గుట్టుచప్పుడు కాకుండా దేవుడి సొత్తును దేవుడి వద్దకే చేర్చిన ఓ మంచి దొంగ కథేంటో చూడండి. వినడానికి కాస్త నమ్మశక్యం కాకున్నా జరిగింది మాత్రం నిజం. దేవుడి సొమ్ము తిరిగొచ్చిన మాట కరెన్సీ నోట్లంత నిజం.

ఈ ఆసక్తికర సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. బుక్కరాయముద్రం చెరువు కట్ట మీద ముసలమ్మ దేవాలయం ఉంది. ఆ గుళ్లో ఓ హుండీ కూడా ఉంది. అమ్మవారిని సందర్శించుకున్న భక్తులు ముక్కులు తీర్చుకుంటూ తులమో ఫలమో ఆ హుండీలో వేసి భక్తిప్రపత్తులు చాటుకుంటుంటారు. ఓ నెల కిందట ఏమి జరిగిందంటే కొందరు దొంగలు ఆ హుండీపై కన్నేశారు. ఓ అర్థరాత్రి హుండీని ఎత్తుకెళ్లారు. పోలీసులు హడావిడి చేసినా ఫలితం లేకపోయింది. దొంగల ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
ఇంతలో ఓ వింత జరిగింది. ఆ దొంగలెవరో ఎత్తుకెళ్లిన హుండీనీ, అందులోని డబ్బును యధాతథంగా గుడిముందుంచి వెళ్లారు. అమ్మవారి హుండీ సొమ్ముతో పాటు ఓ లేఖను దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు.
ఆ లేఖలో ఏముందంటే.. హుండీని దొంగిలించుకు పోయిన తర్వాత మా పిల్లలు రోగాల బారిన పడ్డారు. ఎంతకీ తగ్గడం లేదు. ముసలమ్మ తల్లి శాపమే తగిలిందని భయపడ్డాం. తప్పు తెలుసుకున్నాం. నగదు ఇక్కడ ఉంచి పోతున్నాం. మిమ్మల్ని మన్నించండి అని అందులో ఉంది.
దొంగలు తిరిగి తెచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. మొత్తం నగదు రూ.1,86,486 ఉంది. అమ్మవారి మహత్యం వల్లే దోచుకెళ్లిన నగదును దొంగలు తిరిగి తెచ్చిపెట్టారని ఆలయ నిర్వాహకులు చెప్పారు. భక్తి, భుక్తి, చేతివాటం తెలిసిన ఈ దొంగలకు భయం కూడా వెంటాడడంతో అమ్మ వారి సొత్తు ఆమె వద్దకు చేరడం గమనార్హం.
Tags:    

Similar News