ఖతర్‌లో కష్టాలు.. మరో యువకుడికి లోకేష్ అభయం
ఖతర్‌లో చిక్కుకుపోయానంటూ మరో యువకుడి వీడియో వైరల్. వెంటనే స్పందించి సహాయం చేస్తామన్న నారా లోకేష్.
ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. కానీ ఏజెన్సీల మాయమాటలు విని మోసపోతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. ఇటీవలే శివ అనే వ్యక్తి తనకు జరిగిన మోసం గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆంధ్రకు చెందిన తనను ఏజెన్సీలు మోసం చేసి అరబ్ దేశాల్లో ఏడారి లాంటి ప్రాంతంలో ఉంచారని, తాను అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీడియోలో వివరించారు. వెంటనే స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్.. శివకు సహాయం చేశారు. ఏపీ ప్రభుత్వం చొరవతో ఆయనను తాజాగా భారత్‌కు చేర్చడమే కాకుండా స్వగ్రామానికి కూడా పంపడం జరిగింది. శివ.. తన ఇంటికి చేర్చే వరకు నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని మరువక ముందే అరబ్ దేశాల్లో అవస్థలు పడుతున్న మరో యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కూడా నారా లోకేష్ స్పందించారు. అతడికి కూడా అండగా ఉంటామంటూ అభయమిచ్చారు. భయపడొద్దని.. అతనికి తాను సహాయం చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు లోకేష్.
Veerendra, we will bring you back home safely! Don't worry! https://t.co/GKk9j4n64R
— Lokesh Nara (@naralokesh) July 19, 2024
అసలు సంగతేంటి..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సరేళ్ల వీరేంద్రకుమార్.. ఖతర్ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నయంటూ ఏజెన్సీ చెప్పిన మాటలు నమ్మి ఖతర్ వెళ్లాడు. రూ.70 వేలు ఏజెన్సీకి చెల్లించడంతో వీలా లభించింది. దాంతో ఈ నెల 10న వీరేంద్ర.. ఖతర్ చేరుకున్నాడు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ఏజెన్సీ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలుసుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. మరుసటి రోజు 11న వీరేంద్రను తీసుకెళ్లి ఎడారి వంటి ప్రాంతంలో వదిలేశారు. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని అతడు తన ఫోన్‌లో వీడియో తీసి ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసుకున్నారు.
తన ఆరోగ్య పరిస్థతి బాగాలేదని, కనీసం తాగడానికి నీళ్లు కూడా తనకు అక్కడ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటెలు ఉండే గుడారాల మధ్య తనను వదిలేశారని, అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని, ఎడారి లాంటి ఈ ప్రాంతంలో వాతావరణం కూడా ఏమాత్రం బాగోలేదని చెప్పుకొచ్చారు. ఖతర్ అని చెప్పి సౌదీ తీసుకొచ్చారని, నాలుగు రోజులు సౌదీలోనే ఉంచి ఆ తర్వాత ఎడారి లాంటి ప్రాంతంలో వదిలేశారని చెప్పారు. తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ముక్కు నుంచి రక్తం కూడా వస్తుందని, ఇక్కడే ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే పదిరోజుల్లోనే చనిపోతానని.. తనకు ఎవరైనా సహాయం చేయాలని కోరాడు వీరేంద్ర. అతడి స్నేహితుల ద్వారా వీరేంద్ర వీడియో ఏపీ మంత్రి నారా లోకేష్‌కు చేరింది. ఈ వీడియో చూసిన లోకేష్.. భయపడాల్సిన అవసరం లేదని, అతనిని తాము తిరిగి ఇంటికి తీసుకొస్తామని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. దీంతో వీరేంద్ర కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. మరి వీరేంద్రను ఎన్ని రోజుల్లో తిరిగి తీసుకొస్తారో చూడాలి.