ప్రతి పేదవాడికీ ఇళ్ల పట్టా ఇస్తాం
టీడీపీకి కంచుకోటలైన కుప్పం, హిందూపూరంల మాదిరిగా మంగళగిరిని కూడా టీడీపీకి కంచుకోటలా మారుస్తానని మంత్రి లోకేష్ అన్నారు.;
అత్యధిక మెజారిటీతో గెలిపించిన మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం ప్రజల రుణం తీర్చుకుంటానని, అందులో భాగంగా బట్టలు పెట్టి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజక వర్గం పరిధిలోని ఉండవల్లిలో ‘మన ఇల్లు–మన లోకేష్ కార్యక్రమానికి గురువారం ఆయన శ్రీకారం చుట్టూరు. గోవిందు, సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇళ్ల పట్టాను మంత్రి లోకేష్ అందిజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే కూటమి ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని, దానిని నెరవేర్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను అధికారంలో లేనప్పుడే మంగళగిరి ప్రజలకు దాదాపు 26 సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో అమలు చేశానని చెప్పారు. దశల వారీగా ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. తొలి దశలో దాదాపు మూడు వేల పట్టాలు అందజేస్తామన్నారు.