కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం: మంత్రి సత్యకుమార్ యాదవ్

రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో గత ప్రభుత్వం చెలగాటం ఆడిందని, వైద్యారోగ్య శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని నూతన మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు.

Update: 2024-06-16 13:10 GMT

ఆంధ్రప్రదేశ్‌ను క్యాన్సర్ రహితంగా చేయటమే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆ విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చడానికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిమ్స్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు కావాల్సిన అన్ని వసతులను అందించడంతో పాటు, ఇప్పుడు ఉన్న వసతులను, సేవలను మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. కావాల్సినంత మంది సిబ్బందిని కూడా సమకూరుస్తామని, ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించామని ఆయన వివరించారు. ఈరోజు ఉదయం ఆయన రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తాను చేపట్టనున్న చర్యలపై మాట్లాడారు.

తొలి సంతకం దానిపైనే

‘‘రాష్ట్ర ప్రజల్లో అత్యధికంగా క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారు. ప్రతి ఏడాది సగటున 48 వేల మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్‌ల నివారణ కోసం చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగా క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంతో పాటు క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి ముందస్తు వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం. అందుకోసం దాదాపు 5 కోట్ల 30 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. దానిపైనే నా తొలి సంతకం చేశాను’’ అని వెల్లడించారు.

ఇంటింటి సర్వే పక్కా

‘‘రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధితో బాధిపడుతున్న, క్యాన్సర్ వచ్చి తొలి దశలో ఉన్న వారిని ముందుగా గుర్తించి వైద్యం అందిచడానికి చర్యలు చేపట్టాం. అందుకోసం ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ఇందుకోసం సిబ్బందికి కావాల్సిన శిక్షణను ఏఎన్ఎం, ఆశా వర్కర్‌లు ఇతర అంబాసిడర్లకు హోమీ బాబా క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఇప్పించనున్నాం. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.600 కోట్లను వెచ్చించడం జరిగింది. అదే విధంగా 18 సంవత్సరాల లోపు విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని 18 సంవత్సరాలలోపు విద్యార్థులు అందరికీ స్క్రీనింగ్ చేసే ఫైల్‌పై మరో సంతకం చేశాను’’ అని పేర్కొన్నారు.

మార్పు కోసం ప్రత్యేక కేంద్రాలు

‘‘రాష్ట్రంలోని యువత పెద్దఎత్తున గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు అయినట్లు ప్రతి రోజూ వార్తలు వస్తున్నాయి. వీటిపైనా దృష్టి సారిస్తున్నాం. వీటికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి డీఅడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అత్యంత ప్రధానమైన ఆరోగ్య శాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల ఆరోగ్యలను అసలు పట్టించుకోలేదు. ఆఖరికి నేషనల్ హెల్త్ మిషన్‌తో పాటు పలు కేంద్ర పథకాల కోసం వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారు. ఈ విషయంలో కోర్టులు మొట్టికాయలు మొట్టినా, కేంద్రం పెనాల్టీ వేసినా గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య దోరణిలో వ్యవహరించిందన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా నీరుగార్చే విధంగా అమలు పర్చారన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోకుండా అనుబంధ ఆసుపత్రులను అభివృద్ది చేయకుండా, మౌలిక వసతలు కల్పించకుండా తొందరపాటు చర్యగా రాష్ట్రంలో వైద్య కళాశాలను మంజూరు చేశారు’’ అని మండిపడ్డారు సత్యకుమార్.

జవాబుదారీ తనంతో పనిచేస్తాం

‘‘ఈ ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా జవాబుదారీ తనంతో పనిచేసే ప్రభుత్వాలు వచ్చాయి. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయి. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ శక్తి వంచన లేకుండా కృష్టి చేసే ప్రభుత్వాలు ఇవి. ఈ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కడం ఖాయం. ఈ అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలి’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News