తెలంగాణ టిడిపి కోసం చంద్రబాబు తహతహ, కలసిరాని కాలం

తెలంగాణలోని ఎన్‌టీఆర్ భవన్‌ను ఏపీ సీఎం నారా చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Update: 2024-08-25 13:53 GMT

తెలంగాణలోని ఎన్‌టీఆర్ భవన్‌ను ఏపీ సీఎం నారా చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలోకి యువ రక్తం రావాలని కోరారు. యువతను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని అన్నారు. చంద్రబాబు నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా హాజరయ్యారు. చంద్రబాబుకు వారు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణలో పార్టీని మళ్ళీ నిలబెట్టాలని, ఆ దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ప్రారంభించాలని, ఇందుకు ప్రతి కార్యకర్తల కూడా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా పార్టీకి జవసత్వాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఎన్‌టీఆర్ భవన్‌లో నిర్వమించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. మీ అందరినీ కలవాలనిపించే ఇక్కడికి వచ్చానని అన్నారు. ‘‘తెలుగు ప్రజలు 45 ఏళ్లుగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. టీడీపీని బలోపేతం చేశారు. అందుకు తగ్గట్లే పార్టీ కూడా నిరంతరం ప్రజలకు సేవ చేస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించాం. హడ్‌హాక్ కమిటీలు రద్దు చేశాం. అతి త్వరలోనే కొత్త కమిటీలు వేస్తాం. ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తాం. పార్టీలో యువ రక్తానికి ప్రాధాన్యత ఇస్తాం. వారిని ప్రోత్సహిస్తాం. నాపైన రెండు బాధ్యతలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కూడా వాటిలో ఒకటి. అదే విధంగా ఐదేళ్లపాటు ఏపీ ప్రజలు అనుభవించిన రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్రంలో సుభిక్ష పాలన తీసుకురావడం మరొకటి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడకు వస్తా.. మీ అభిప్రాయాలు తీసుకుంటా.. మీ నిర్ణయాల మేరకే నేను కూడా నిర్ణయాలు తీసుకుంటా’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News