ఆలపాటి అలక.. రాజీనామాకు రెడీనా!

టికెట్ లభించకపోవడంతో అధిష్టానంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలక. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో..

Update: 2024-03-23 07:06 GMT
Source: Twitter

సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్ర సన్నద్ధం అవుతోంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటిస్తే వైసీపీ తమ అసెంబ్లీ అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించింది. ఎన్నికల ముందు కూటమి కట్టిన టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పంచుకున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ 17 ఎంపీ, 144 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలోనే నిన్న 13 మంది ఎంపీ, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో పార్టీ మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మూడో జాబితా కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతికి దారితీసింది. వాటిలో తెనాలి కూడా ఒకటి. ఈ జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆయన చంద్రబాబు‌తో చర్చించినా లాభం లేకుండా పోయిందని సమాచారం.

టికెట్‌ను తనకు కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఇది తీరని అన్యాయమేనని, పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను పక్కన పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై చంద్రబాబు‌తో చర్చించగా ఈసారి ఎన్నికల్లో ఆలపాటికి అవకాశం లేదని తేల్చి చెప్పారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆలపాటి పార్టీ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేయగలరని, పార్టీలో సమన్వయం కొరవడకుండా చూసుకోగల నేత అని చంద్రబాబు చెప్పారట. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తానని ఆలపాటికి హామీ కూడా ఇచ్చారని విశ్వనీయత వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు పార్టీలో ఆందోళనలను చెలరేగకుండా, తిరుగుబాటులు జరగకుండా చూసుకోవాలని చెప్పారని, అందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.
నాయకత్వం నుంచి తప్పుకుంటా
చంద్రబాబు‌తో భేటీ అనంతరం ఆలపాటి మాట్లాడుతూ.. పార్టీ అనేది చెట్టు లాంటిందని, ఆ చెట్టు బాగుంటేనే మనమంతా ఆ చెట్టు నీడలో సేదతీరగలమని ప్రతి నేత గుర్తుంచుకోవాలని హితబోధ చేశారు. పార్టీ భవిష్యత్ కోసం అందరం కలిసి, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దామని, అలా చేయడంలో విఫలమైన పక్షంలో తాను నాయకత్వం నుంచి తప్పుకుంటానని ఆయన వివరించారు. సర్వే ఫలితాలు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ టికెట్ తనకు ఇవ్వకపోవడం దారుణమని, పెనమలూరు సీటు బొడెకు ఇవ్వడం న్యాయమని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజీనామా యోచనలో ఆలపాటి
చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఒక అవమానంగానే భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన పార్టీ వీడాలన్న యోచనలో ఉన్నారని, వివాదాలతో పార్టీని వీడి వివాదాస్పద నేత అన్న ముద్ర పడకూడదన్న ఉద్దేశంతోనే ఆయన సుతిమెత్తగా సైకిల్ దిగాలని అనుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎలాగైనా ఆలపాటిని పార్టీలో ఉండేలా చేయాలని, ఆయన రాజీనామా చేస్తే గుంటూరు పశ్చిమ , తెనాలి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ప్రతికూల ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు కీలక నేతలు అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, అందుకనే గెలిస్తే న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. మరి ఆలపాటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News