ఆనంద్ మహీంద్రా చంద్రబాబును ఏమన్నారంటే
పారిస్‌లో అరకు కాఫీ స్టాల్ గురించి ప్రస్తావించారు. ఇది వరకే ప్రధాని మోదీ కూడా అరకు కాఫీ తాగాలని ఉందని ట్వీట్ చేశారు.;
By : The Federal
Update: 2025-03-31 07:51 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర మెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు, ఆయన కష్టపడుతున్న తీరును, ప్రజల కోసం చంద్రబాబు పని చేస్తున్న విధానం అద్భుతం అంటూ ఆనంద్ మహీంద్ర ఓ రేంజిలో పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరును తీసుకొస్తుందని, అరకు కాఫీల కేఫ్‌లు విస్తరిస్తున్న తీరును చూసి చంద్రబాబు నాయుడు సంతోషడుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ రాజధాని, ప్రపంచంలోనే ప్రముఖ నగరమైన పారిస్‌లో అరకు కాఫీ స్టాల్ మీద కూడా ఆనంద్ మహీంద్ర స్పందిచారు.
ప్రపంచ నగరమైన పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్‌ల మీద అరకు ప్రాంతానికి చెందిన గిరిజనుల జీవనశైలి, ఆ జీవనశైలికి సబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. పారిస్‌లోని కాఫీ ప్యాకేజీంగ్‌లను ఆంధ్రప్రదేశ్ అరకు ప్రాంతానికి చెందిన గిరిజనుల వేషధారణ, భారత దేశంలోని వైవిధ్యమైన రంగుల స్పూర్తితో ఆ ఫొటోలు, వీడియోలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్రాండ్ మారిన అరకు కాఫీ గురించి ఆనంద్ మహింద్రా ఇది వరకే సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. మార్చి 29న ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. పారిస్‌లో మా రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ ఓ వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. అరకు కాఫీని మెచ్చుకుంటూ ఆనంద్ మహీంద్ర పెట్టిన పోస్టు మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేరడం, వరల్డ్‌వైడ్‌గా అరకు కాఫీకి గుర్తింపు లభించడం స్పూర్తిదాయకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్ర పెట్టిన తొలి పోస్టుకు స్పందించి రిప్లై ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు రెండో సారి ఆనంద్ మహీంద్ర పెట్టిన పోస్టు మీద ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
అరకు కాఫీ ఢిల్లీ పార్లమెంట్‌కు కూడా చేరింది. ఇటీవలె పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా అనుమతులిచ్చారు. స్పీకర్ ఆదేశాలతో లోక్ సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్‌సింగ్ అరోరా ఉ్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు లోక్ సభ, రాజ్య సభ క్యాంటీన్ల ప్రాంతాల్లో రెండు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పియూష్ గోయల్‌లు ఈ స్టాల్స్‌ను ప్రారంభించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అరకు కాఫీ మీద స్పందించారు. మీతో మరో సారి అరుకు కాఫీని తాగాలనుకుంటున్నాను అంటూ అరకు కాఫీ మీద ప్రధాని మోదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇది వరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరు కలిసి అరకు కాఫీ తాగిన ఫొటోను షేర్ చేశారు. 2016లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో అరకు కాఫీ తాగారు. దీని మీద సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ గిరిజన సోదరీ సోదరమణులు ప్రేమతో, అంత్యంత శ్రద్దాశక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారు. అరకు కాఫీ సుస్థిరత, గిరిజన సాధికారత, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల హద్దుల్లేని శక్తి సామర్థ్యాలకు అరకు కాఫీ నిదర్శనం. 2016 మనం అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసినందుకు, అచ్చంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు ధ్యాంక్యూ ప్రధాని నరేంద్ర మోదీ గారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు పీఎం మోదీ ట్వీట్‌కు బదులిచ్చారు.