పద్మ అవార్డుపై బాలయ్య ఏమన్నారంటే..
బాలకృష్ణకు పద్మ పురస్కారం వరించడంతో ఆయన ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.;
By : The Federal
Update: 2025-01-26 12:47 GMT
కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం ప్రకటించడంతో బాలకృష్ణకు అభినందనల వెల్లువ ఓ ప్రవాహంలా మారింది. అటు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా భారత దేశ చిత్ర పరిశ్రమ పెద్దలు, ఇటు రాజకీయ రంగ నాయకులు అభినందనలతో బాలయ్యను ముంచెత్తుతున్నారు. దీంతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇటు నందమూరి అభిమానులు బాలకృష్ణకు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనకు పద్మభూషణ్ పురస్కారం వరించడంపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. పద్మభూషణ్ అవార్డు దక్కడంపై బాలయ్యం ఎలా స్పందరిస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీనిపై ఆయన ఆదివారం స్పందించారు. అటు కేంద్ర ప్రభుత్వంపైన, అటు సినీ ప్రముఖలు, తోటి నటీనటులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖల అందరిని కోట్ చేస్తూ స్పందించారు.
తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి తొలుత కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత పద్మ అవార్డు వరించిన సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తోడు నిలచి, భాగస్వాములై తన ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి రంగానికి, ఆ రంగంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి అంశంలో తనకు వెన్నంటి నిలిచిన తన కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి నందమూరి తారకరామారావును కూడా ఒక సారి గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ నుంచి నట వారసుడిగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసిన తనకు నేటి వరకు తన వెన్నంటి ఉండి, తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్న తన అభిమానులకు, నందమూరి అభిమానులకు, అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తనతో పాటు పద్మ పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు.