చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెండు గంటలపాటు ఏమి చర్చించారు...

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సుమారు రెండు గంటలు పైన చర్చించారు. ఏ అంశాలు వారిద్దరు చర్చించారనేది చర్చగా మారింది.

Update: 2024-12-03 04:33 GMT

కూటమి ప్రభుత్వంలో సఖ్యత ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా లోపల మాత్రం సఖ్యత అంతంత మాత్రమేననే ప్రచారం సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు కూడా అది నిజమేమో అనే అనుమాన్ని కూడా కలిగిస్తోంది. కాకినాడ పోర్టు వ్యవహారం బాబు, పవన్ మధ్య ఎక్కువ సమయం చర్చకు వచ్చినట్లు సమాచారం. పోర్టు నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన వారు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే విషయం చర్చించినట్లు తెలిసింది. అరబిందో వారు బలవంతంగా వాటా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సోమవారం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతుండగానే కాకినాడ ఇన్ ఫ్రా స్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కెవి రావు ఎపి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి తనను బెదిరించి అరబిందో వారు వాటా తీసుకున్నారని ఫిర్యాదు సారాంశం. పవన్ కళ్యాణ్ కు ముందుగానే కాకినాడ పోర్టులో జరుగుతున్న వ్యవహారలన్నీ తెలుసునని, అవన్నీ తెలుసుకున్న తరువాతనే పోర్టుకు పోర్టుకు వెళ్లి కలెక్టర్ సీజ్ చేసిన సరుకు వద్దకు వెళ్లి పరిశీలిలంచి సీన్ క్రియేట్ చేశారనే చర్చ కూడా ప్రజల్లో ఉంది.

కాకినాడ వ్యవహారంపై చర్చ సందర్భంగా వైఎస్సార్ సీపీని ఇరికించేందుకు ఇదో మంచి అవకాశమని, అందువల్ల దీనిని వదలొద్దనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కేవీ రావు ఫిర్యాదుతో మరింత బలం పెరిగిందనే చర్చ కూడా వారిద్దరి మధ్య వచ్చినట్లు సమాచారం. వేల కోట్లకు సంబంధించిన వ్యవహారం కావడం వల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకుండా ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ సమాచారం. కాకినాడ పోర్టు నుంచి దొంగరవాణా అరికట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉండాలని అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటేనే తప్ప ఇక్కడి నుంచి దొంగ రవాణా తగ్గే అవకాశం లేదని వారు భావించారు. పైగా మన వద్ద కూడా ఐదు చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టుల నుంచి నేరుగా ఎటువంటి చెకింగ్ లేకుండా వాహనాలు లోపలికి ఎలా పోతున్నాయనే చర్చ కూడా వారి మధ్య వచ్చింది. ఆ చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిలో కీలక మైన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవడంపైనా చర్చ సాగింది.

మీరు చెయ్యాలనుకున్నది నాకు ముందుగా సమాచారం ఇచ్చి చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవన్ కళ్యాన్ వద్ద వ్యక్తం చేశారని సమాచారం. నిజానికి ఆ విధంగా చేసి ఉంటే కూటమిలో సమస్యలు తలెత్తే అవకాశం లేదు. అలా కాకుండా తాను ఏమనుకున్నారో ఆ విషయాలు నేరుగా వ్యక్తీకరించడంతో సమస్యలు వస్తున్నాయనేభావన ప్రజలకు రాకుండా చేయాలంటే సమస్యను ముందుగా తన దృష్టికి తీసుకు రావాలని పవన్ తో సీఎం చెప్పినట్లు సమాచారం. శాంతి భద్రతలు లోపించాయని, అందుకే సోషల్ మీడియాలో ఇష్టానుసారం వైఎస్సార్సీపీ వారు రెచ్చి పోతున్నారని ఉప ముఖ్యమంత్రి గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాపై ఆ తరువాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి కేసుల పరంపర కొనసాగించడం తెలిసిందే. ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఒకరిచేత చెప్పించుకోవాల్సిన అవసరం రాకూడదు. ముందుగానే సమస్యపై చర్చించి అవసరమైతే ఇద్దరం మీడియా ముందుకు వెళ్లి ఏమి చేయబోతున్నామో వివరిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా సీఎం నుంచి వ్యక్తమైనట్లు సమాచారం.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూటమి ప్రభుత్వంలో సఖ్యత లేదనే సంకేతాలు ప్రజలకు ఇచ్చినట్లు అవుతోందని సీఎం అభిప్రాయ పడ్డట్లు సమాచారం. ఇక రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. రాజీనామా చేసిన ముగ్గురు వ్యక్తులు కూడా బీసీలు కావడం వల్ల తిరిగి బీసీలకే ఇవ్వడం మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న చర్చలపై కూడా వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఇదీ కారణంగా వారు భావిస్తే బీసీలు తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కువ మంది ఉన్నందున మూడో సీటు కూడా తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం ఏమి తీసుకున్నారనే ఇంకా బయటకు రాలేదు. రాజ్యసభ సభ్యుల నామినేషన్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది. రాజ్యసభపై నాగబాబు పెట్టకున్న ఆశ నిరాశగానే మిగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఏ అంశమైనా వివాదాస్పదం కాకుండా ముందుకు వెళ్లేందుకు ఇరువురి వద్ద చర్చలు ఎక్కువ సమయం జరిగినట్లు సమాచారం. వివాదాస్పదమైతే కూటమి మధ్య స్పర్థలు ఉన్నాయని ప్రజలు భావిస్తారని, కష్టపడి రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నందున కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకుకున్న తరువాతనే అడుగు ముందుకు వేద్దామనే అంశాలు ఎక్కవగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News