పెద్ద రెడ్లంతా ఏమయ్యారు?

పెద్ద రెడ్లు ఏమయ్యారు? ఎందుకు వీరి స్వరం వినిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై ఈగ వాలకుండా మాట్లాడిన వీరు ఇప్పుడు మౌనం వహించడం వెనుక ఏముంది?

Update: 2024-08-05 12:47 GMT

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ఏలిన పెద్ద రెడ్ల స్వరం ఇప్పుడు వినిపించడం లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే రెడ్ల పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మోళ్ల పార్టీ అని రాష్ట్రంలో ఒక ప్రచారం. అందుకు తగినట్లుగానే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలోనూ ఆ తేడా కనిపిస్తుంది. వైఎస్సార్‌సీపీలో బీసీలకు కూడా అనుకున్న స్థాయిలో స్థానం కల్పించారు. పెద్దరెడ్లు ప్రస్తుతం నోరు మెదపకపోవడం, హత్యలు వంటి సంఘటనలు జరిగినప్పుడు జగన్‌ మాత్రమే నోరు విప్పడం, అక్కడికి వెళ్లి వారిని పరామర్శించే కార్యక్రమాన్న చేపట్టడం చూస్తుంటే పెద్దరెడ్లు ముఖం చాటేశారా? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. జగన్‌ను 2024 ఎన్నికల్లో రాయలసీమ రెడ్లు కూడా తిరస్కరించారు. అందువల్ల చాలా మంది పెద్ద రెడ్లు మాట్లాడలేకపోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

మాట్లాడే గొంతులు కాపులు, ఎస్సీలవే...
తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిలో కాపులు, ఎస్సీలే ఉన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను (కాపు), మాజీ మంత్రులు అంబటి రాంబాబు (కాపు), పేర్ని వెంకట్రామయ్య (నాని) (కాపు), ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ), ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్‌ (ఎస్సీ) ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఎక్కువయ్యాయని, వైఎస్సార్‌సీపీ వారిపై దాడులు పెరిగాయని, చెయ్యని తప్పులకు కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చారు. వీరు తప్ప వేరే వారు ఎక్కడా వటట్లాడిన దాఖలాలు లేవు. మాజీ మంత్రి కొడాలి నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ (కమ్మ)లు తమను తాము కాపాడుకునేందుకు టీడీపీకి, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు. అంతే తప్ప ఇంకెవరూ మాట్లాడటం లేదు.
వీరి గొంతులు ఏమయ్యాయి...
ఉదయం లేచింది మొదలు గుక్కతిప్పుకోకుండా మాట్లాడే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గొంతు మూతపడింది. రోజుకు కనీసం పది సార్లు ట్విటర్‌లో పోస్టులు పెట్టేవారు. అవి కూడా తగ్గించారు. తనపై వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విశాఖపట్నంలో మాట్లాడారు. ఆ తరువాత ఆయన గొంతు వినిపించలేదు. నాటి ముఖ్యమంత్రికి ప్రత్యేక గొంతుకై నిత్యం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు. విశాఖపట్నం ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ జగన్‌కు రాజకీయ సలహా దారుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎందుకు గొంతెత్తడం లేదు. నాటి ప్రభుత్వంలో నెంబర్‌ టూగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం నోరు మెదపకపోవడం వెనుక కారణం ఏమిటనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వీరిని జగన్‌ మాట్లాడొద్దని చెప్పారా? వారంతకు వారే నోరెత్తడం లేదా? అనేది కూడా చర్చకు దారితీసింది. మాజీ మంత్రి రోజా రెడ్డి కూడా చెన్నైలో మకాం వేశారు. నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ కనిపించడమే మానేశారు. ఇక ఉత్తరాంధ్ర గొంతుకలైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు కూడా గొంతు విప్పడం లేదు. జగన్‌ ప్రభుత్వంలో ఎంతో మంది సలహాదారులు రెడ్లు ఉన్నారు. వారు కూడా నోరు మెదపడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ను బాగా ఉపయోగించుకున్నారని, ఇప్పుడు ఆయనెవరో అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ప్రత్యేక సలహాదారుగా ఉన్న సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ కళ్లాం కూడా కిమ్మనడం లేదు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ గొంతుకై మీడియాతో మాట్లాడటంలో ముందున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెంకటరమణను నియమిస్తున్నారని తెలియగానే అప్పటి సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను అజయ్‌ కళ్లాం జగన్‌ సూచన మేరకు చదివి వినిపించి పలువురిని ఆశ్చర్య పరిచారు. వీరంతా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారనేది పలువురిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.
రెడ్లను జగన్‌ దూరం పెట్టారా?
రెడ్లు ఎవ్వరూ మాట్లాడవద్దని మాజీ సీఎం జగన్‌ దూరంగా పెట్టారా? లేకుంటే ఎందుకు వారు మాట్లాడటం లేదు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదైన కేసుల్లో ఇప్పుడు కొంత మందిని నిందితులుగా చేరుస్తున్నారు. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు, కులం బ్రాండ్‌ నుంచి తప్పించుకునేందుకు వీరిని దూరంగా జగన్‌ ఉండమన్నారా? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.
ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో జగన్‌ దిట్ట అని రాజకీయ నాయకుల్లో ఉన్న అనుమానం. స్ట్రాటజిస్టులను నమ్ముకుని ప్రస్తుత నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. అందువల్ల రెడ్లను మాట్లాడొద్దని స్ట్రాటజిస్టులు ఏమైనా సూచించారా అనే అనుమానాలు కూడా రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులు కాబట్టా...?
పెద్ద రెడ్లు అందరూ రాష్ట్రంలో పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారే. తమ వ్యాపారాలు కాపాడుకోవాలంటే కాస్త తగ్గి ఉండటం మంచిదనే భావనలో వీరు ఉన్నారనే అనుమానాలు కూడా పలువురిలో వ్యక్తమవుతున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో రెడ్లు రాయలసీమలోనే కాదు. గుంటూరు జిల్లాలో కూడా ఓట్లు వేయలేదని ఒక గ్రామాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. తాడేపల్లిలో భాగమైన కుంచనపల్లిలో 80శాతం రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 220 కోట్ల మెజారిటీ వచ్చింది. 2024 ఎన్నికల్లో అదే కుంచనపల్లి నుంచి టీడీపీకి వచ్చిన మెజారిటీ 440 ఓట్లు. అంటే రెడ్డి ఓటర్లు జగన్‌ను తిరస్కరించారు. నాయకులుగా ఉన్న వారు అధికారం కోసం తిరస్కరించలేకపోయారు. ఓడిపోవడంతో గప్‌చుప్‌గా ఉండటం మంచిదని భావించి నోరు మెదపడం లేదని రాజMీ య మేధావులు చెప్పడం విశేషం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలతో పాటు మిగిలిన కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. వ్యాపారులు కాబట్టి ఏది మాట్లాడితే ఏ సమస్య వస్తుందోనన్న అనుమానాలతో మాట్లాడటం లేదని కొందరు చెప్పడం విశేషం. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా పలు వ్యాపారాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ పెద్దరెడ్డి పెద్ద కాంట్రాక్టర్‌. విదేశాల్లో సైతం కాంట్రాక్ట్‌లు తీసుకుని చేస్తున్నారు. ఈ గొడవలన్నీ ఎందుకనుకుంటే కొంత కాలం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబుకు, రామచంద్రారెడ్డికి రాజకీయంగా విరోధం ఉన్నందున ఆయన నేరుగా చంద్రబాబుపై ఇప్పుడున్న పరిస్థితుల్లో విమర్శల వర్షం కురిపించే అవకాశం లేదు.
ఒక విధంగా వైవీ సుబ్బారెడ్డిపై చంద్రబాబు అంత దూకుడుగా వెళ్లే అవకాశం లేదు. ఆయన పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత అంశాలపై ఎప్పుడూ మాట్లాడలేదు. వైవీపై అవినీతి ఆరోపణలు కూడా రాలేదు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న అవినీతిని నిలుపు చేయడంలో కొంతమేర సక్సెస్‌ అయ్యారని పార్టీలోని పలువురు చెప్పడం విశేషం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విజయసాయిరెడ్డి చేసిన తప్పిదాలు సరిదిద్దటంలో వైవీ చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించలేదు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ కావడం వల్ల పార్టీ నాయకులపై వచ్చే విమర్శల విషయంలో జగన్‌ సూచనలు తీసుకుని మాత్రమే మాట్లాడతారని వైఎస్సార్‌సీపీలోని ముఖ్యనాయకులు చెబుతున్నారు.
Tags:    

Similar News