నాటి 'స్వరూపా’నందం ఆవిరి ?

ఏపీలో జగన్ ప్రభుత్వ పతనం తర్వాత ఉనికి కోల్పోయిన స్వామి. ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన శారదా పీఠం. నేడు అటు వైపు కన్నెత్తి చూసే వాడే కరువు.

Update: 2024-10-23 02:00 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహా సరస్వతి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. దాదాపు పదేళ్ల ముందు వరకు ఓ సాదా సీదా పీఠం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు (కేసీఆర్)కు దగ్గరవడంతో ఈ స్వామికి ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగింది. కొన్నాళ్లకు ఆయన ముఖ్యమంత్రి కావడం, విశాఖ శారదా పీఠాన్ని సందర్శిస్తుండడంతో ఈ పీఠానికి, స్వరూపానందేంద్రుడికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కేసీఆర్ సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ లో ఆ పదవిని ఆశిస్తున్న వైఎస్ జగన్మోహనరెడ్డికి కూడా కేసీఆర్నే అనుసరించారు. జగన్ కూడా శారదా పీఠం బాట పట్టారు. కొన్నాళ్లకూ ఆయనా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నా, ఆయనతో రాజశ్యామల యాగం చేయించుకున్నా సీఎం పీఠం

ఖాయమన్న ప్రచారం బాగా ఊపందుకుంది. అంతేకాదు.. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వరూపానందుడికి శిష్యులుగా మారడంతో ఇక వారి వెంట ఉండే వంది మాగదులూ స్వామి దర్శనం, ఆశీస్సుల కోసం క్యూ కట్టేవారు. ఏటా శారదా పీఠం వార్షికోత్సవానికి రాజశ్యామల యాగం నిర్వహించడం, దానికి ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అత్యున్నతాధికారులు, ఇతర అతిరథ మహారథులు హాజరు కావడం ఆనవాయితీ అయిపోయింది. దీంతో ఈ స్వరూపానందేంద్ర సరస్వతి పేరు సరిహద్దులు దాటి మరీ మారుమోగిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ స్వామి హవాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎవరికి ఏ పని కావాలన్నా, పదవి కావాలన్నా, బదిలీలు జరగాలన్నా, ఎన్నికల్లో సీటు కావాలన్నా స్వామీజీ చెబితే అయిపోతుందన్న ప్రచారం జోరందుకుంది. మరోవైపు స్వామీజీ దివ్యాశీస్సుల కోసం మరెందరో పడిగాపులు కాసే వారు.

 

నాడు కళకళ.. నేడు వెలవెల..

గడచిన ఐదేళ్లలో శారదా పీఠం భక్తులకంటే రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారుల రాకపోకలతో రద్దీగా ఉండేది. ఈ పీఠం భక్తులకంటే వీరితోనే కళకళలాడుతుండేది. కానీ వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. స్వామీజీ జాతకమూ మారిపోయింది. నిత్యం వీఐపీలు, వీవీఐపీలతో సందడిగా ఉండే ఈ పీఠం కొన్నాళ్లుగా వెలవెలబోతోంది. పీఠంలోకి వచ్చే వారే కరువయ్యారు. ఇప్పుడక్కడ ఎలాంటి సందడీ కనిపించడం లేదు. వీఐపీల జాడే కానరావడం లేదు. గతంలో స్వామీజీ లేకపోయినా హంగామా ఉండేది. ఇప్పుడు స్వామీజీ ఉన్నా అటువైపు తొంగిచూసే వారే లేరు.

ముద్దులు.. సాష్టాంగ నమస్కారాలు..

ఇక నాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వామీజీ ఆశీస్సుల కోసం ఒకడుగు దిగి వచ్చే వారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా స్వామీజీ ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారమే చేసి వార్తల్లోకి ఎక్కారు. స్వతహాగా క్రైస్తవుడైన వైఎస్ జగన్ స్వామీజీ దగ్గరకొచ్చే సరికి పూజల్లో పాల్గొని స్వామి భక్తిని చాటుకునే వారు. ఒకసారి పీఠానికొచ్చిన జగన్ ను స్వరూపానందేంద్ర సరస్వతి ఒకడుగు ముందుకేసి ఏకంగా ముద్దుల్లో ముంచెత్తారు. ఆపై ఆయన పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యారు కూడా.

 

రాకపోకలకు గ్రీన్ ఛానెల్

వైసీపీ ప్రభుత్వంలో స్వరూపానందేంద్రకు ప్రతిష్ట, ప్రాధాన్యత పెరిగాక కేబినెట్ హోదానిచ్చారు. 2+2 సెక్యూరిటీ, ప్రోటోకాల్తో భద్రతను కల్పించారు. శారదా పీఠం వద్ద పోలీస్ ఔటో పోస్టును ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షించే వారు. ఈ స్వామీజీ పీఠం నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్లినా, అక్కడ నుంచి పీఠానికి వచ్చినా అత్యంత అరుదైన గ్రీన్ఛానల్ను ఏర్పాటు చేసేవారు. సాదర స్వాగతాలు నిత్యకృత్యమయ్యాయి.

ఎన్నికల ఫలితాలొచ్చాక..

జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సమర్థుడైన పాలకుడని, ఆయన, పవన్ కల్యాణ్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వారికి తన ఆశీస్సులుంటాయని మీడియా సమావేశం పెట్టి మరీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రకటించారు. జూన్ 21న చాతుర్మాస దీక్ష కోసమని ఉత్తరాదికి వెళ్లిపోయారు. మూడు నెలల అనంతరం గత నెల 28న పీఠానికి తిరిగొచ్చారు. అంతకుముందు క్షణం తీరిక లేకుండా ఉండే స్వామీజీ ఇప్పుడు పీఠం పట్టునే ఉంటున్నారు. కాగా హిందూ ధర్మ పరిరక్షణ కోసమే తన తపన అంటూ తరచూ చెప్పుకునే ఈ స్వామీ తిరుపతి లడ్డూ విషయంలో తలెత్తిన పెను దుమారంపై మౌనం దాల్చారు. లడ్డూలో కల్తీ నెయ్యి అపచారమని గాని, లేదా నెయ్యి కల్తీ జరగలేదని గాని ఏమీ మాట్లాడలేదు. దీంతో ఆయన విమర్శల పాలయ్యారు.

 

పుట్టిన రోజు కాశీలోనా?

స్వరూపానందేంద్ర సరస్వతి ఏటా నాగుల చవితి రోజున తన పుట్టిన రోజును విశాఖ శారదా పీఠంలోనే జరుపుకుంటారు. ఈ ఏడాది బర్త్ డేను హైదరాబాద్ పీఠంలో జరుపుకుంటానని గత సంవత్సరం ప్రకటించారు. మారిన పరిస్థితుల్లో తన పుట్టినరోజు వేడుకలను ఇటు విశాఖ, అటు హైదరాబాద్ పీఠాల్లో కాకుండా కాశీలో జరుపుకోనున్నట్టు చెబుతున్నారు. కాశీలో కార్తీకం పేరిట నవంబరు 3,4,5 తేదీల్లో రుద్రాభిషేకం, సుందరకాండ పారాయణం, చండీయాగం, వేద పారాయణం, శివపార్వతుల కల్యాణం, శ్రీరామపట్టాభిషేకం, వంటివి నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

15 ఎకరాల కేటాయింపు రద్దు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో శారదా పీఠానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాల భూమిని కేటాయించారు. ఎకరం రూ.కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.15 లక్షల నామమాత్రపు ధరకే కట్టబెట్టారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూటమి సర్కారు ఇటీవలే ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై కూడా స్వామీజీ స్పందించలేదు. తాజాగా మంగళవారం శారదా పీఠం గెడ్డ స్థలాన్ని ఆక్రమించి గోశాల నిర్మాణం చేపట్టిందని, గెడ్డ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ పెందుర్తి తహసీల్దారు, పోలీసులకు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు చేశారు. ఇలా నిన్న మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మహా సరస్వతి నేడు సవాలక్ష చిక్కుల్లో చిక్కుకోవడం అంతా కాల మహిమ.. అంటూ చర్చించుకుంటున్నారు. 

Tags:    

Similar News