దగ్గుబాటి వ్యూహం ఏంటి?

కొడుకు రాజకీయ భవిష్యత్‌ కోసం ఏపార్టీని ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచనలో దగ్గుబాటి ఉన్నారు. టీడీపీ సీటు సంపాదించడమే మంచిదనే ఆలోచన దగ్గుబాటి హితేశ్‌ చేస్తున్నారు.

Update: 2023-12-26 10:50 GMT
Dr. Daggubati Venkateswararao

వైఎస్సార్‌సీపీపై వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటి?

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు రాజకీయ వ్యూహం ఏంటనేది పలువురిలో చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో పర్చూరు నియోకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇందుకు ఆయనపై ఆయనకు ఉన్న ఓవర్‌కాన్ఫిరెన్స్‌ కారణమని అప్పటిలో పలువురు వ్యాఖ్యానించారు. ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. నిజానికి అప్పటి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఆయన ఎవరికి ఏమి చెప్పినా శాసనంలాగా అమలు జరిగేది. ఆ తరువాత చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీర్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి తన కుమారుడు దగ్గుబాటి హితేశ్‌ చెంచురామ్‌ను దించడం ద్వారా ప్రజల మధ్యలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఎన్నికల సమయంలో తెరపైకి ఎందుకొచ్చినట్లు
మూడు నెలల్లో ఎన్నికలు ఏపీలో రానున్నాయి. గత ఎన్నికల్లో తన కుమారుడికి టెక్నికల్‌ కారణాల వల్ల వైఎస్సార్‌సీపీ సీటు దక్కలేదు. అందుకే తానే పర్చూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనైనా కుమారునికి సీటు ఇప్పించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగుతారోనని పలువురు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నాలుగున్న ఏళ్లుగా ఏమీ మాట్లాడని దగ్గుబాటి వెంకటేశ్వరావు ఉన్నట్లుండి సోమవారం క్రిస్మస్‌ రోజున నోరు విప్పారు. తాను గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి ఓడిపోవడం మంచిదైందని, లేకుంటే రోడ్లు కూడా వెయ్యలేదని జనం నిలదీసేవారంటూ వ్యాఖ్యానించారు. అంటే వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది.
లోకేష్‌తో టచ్‌లో హితేష్‌
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో దగ్గుబాటి హితేశ్‌ చెంచురామ్‌ ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నారని దగ్గుబాటి సన్నిహితులు చెబుతున్నారు. ఇరువురూ బంధువులు కావడం వల్ల ఎప్పటికైనా కలిసి పనిచేయాల్సిన వారమేననే ఆలోచనలో వారు ఉన్నారు. అందుకే పర్చూరు టీడీపీ టిక్కెట్‌ను హితేశ్‌ అడుగుతున్నారు. టీడీపీ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే. లోకేశ్‌ ఓకే అన్నా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇవ్వాల్సి ఉంటుంది. తోడల్లుడి కొడుకు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబశివరావుకు నియోజకవర్గలలో మంచి పట్టు ఉంది. అక్కడి జనం కూడా సాంబశివరావును ఆదరిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరావును సాంబశివరావు ఓడించారు. ఏలూరిని కాదని హితేశ్‌కు టిక్కెట్‌ ఇస్తారా? అనే చర్చ కూడా ఉంది. ఇప్పటికే లోకేష్‌ ఏలూరి సాంబశివరావుతో మాట్లాడి మీకు ఎమ్మెల్సీ ఇస్తామని, పార్టీలో మంచి ప్రయారిటీ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఇదే జరిగితే దగ్గుబాటి కుటుంబానికి తిరుగులేకుండా ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పురందేశ్వరి ఏమంటారో..
ఇప్పటి వరకు కొడుకు, భర్త రాజకీయ భవిషత్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎటువంటి కామెంట్‌ చేయలేదు. బీజేపీలో గెలుపు అవకాశం లేనందున టీడీపీ నుంచి కుమారుడు పోటీలో ఉండటమే మంచిదనే భావన ఆమె మనసులో ఉన్నట్లు పలువురు బంధువర్గం చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని పురందేశ్వరి పళ్లెత్తు మాట కూడా అనటం లేదు. ఏపీలో బీజేపీ పవన్‌కళ్యాణ్‌తో కలిసి పయనిస్తున్నందున టీడీపీతో కూడా దోస్తీగానే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకుల రాజకీయ భవిష్యత్‌పై వారు ఏ నిర్ణయం తీసుకున్నా వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనున్నారు పురందేశ్వరి. పురందేశ్వరి కూడా కొడుకు హితేశ్‌కు టీడీపీ నుంచి టిక్కెట్‌ తీసుకునే విషయంలో అవసరమైన సహకారం అందించే అవకాశం ఉంది. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఎలా వ్యవహరిస్తే రాజకీయాల్లో ముందువరుసలోకి వస్తారో వారికి బాగా తెలుసు. ఎందుకంటే పురందేశ్వరి రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ఒక వెలుగు వెలిగారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. సోనియాగాంధీ ఆమెను మెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత ప్లేట్‌ ఫిరాయించి సోనియాతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో జత కట్టారు.
ఎందుకీ గోడమీది పిల్లివాటం..
దగ్గుబాటి వెంకటేశ్వరావు గతంలో స్ట్రైట్‌గా రాజకీయాలు చేసేవారనే పేరు ఉంది. ఇప్పుడు మాత్రం గోడమీది పిల్లి వాటంగా వ్యవహరిస్తున్నారు. అటు భార్య పురందేశ్వరి మనసు నొచ్చుకోకుండా, ఇటు కుమారునికి కావాల్సిన అసెంబ్లీ సీటు సంపాదించేపనిలో నిమగ్నమయ్యారు. ఏపార్టీనీ తాను పైన వేసుకోవడం లేదని జనానికి హింట్‌ ఇస్తున్నారు. అటు వైఎస్సార్‌సీపీకి కానీ, ఇటు టీడీపీకి కానీ నేను చేరువ కాలేదనే సంకేతాలు ఓటర్లకు ఇస్తున్నారు. ఎవరు తమను ఇష్టపడి దగ్గరకు తీసుకుంటారో వారి తరపున ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఖచ్చితంగా గోడమీది పిల్లివాటం అనే అంటారనేది పరిశీలకుల వాదన.
Tags:    

Similar News