ఎన్‌టీఆర్ జిల్లాలో ఏమి జరుగుతోంది?
జిల్లాలో రెండు ఎస్సీ సీట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మార్చాలంటున్నారు. ఒక చోట టిక్కెట్ ఇవ్వలేదు. మరోచోట సందిగ్ధంలో పెట్టారు.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-01-12 15:56 GMT
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్..
ఓడి పోలేదోయ్..
సుడిలో దూకి ఎదురీదక..
మునకే సుఖమనుకోవోయ్..
అన్నారు గొప్ప కవి సముద్రాల. ఈ పాట 1953లో తీసిన దేవదాసు చిత్రంలో ఘంటసాల పాడారు. ఆయన పాటను ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ఒక్కసారిగా పార్టీలు మారిన వారు మునుగుతారా? ఎదురీదుతారా? సొంతపార్టీలో ఉండీ సీటు రాని వారి పరిస్థితి ఏమిటి? ఎన్టీఆర్ జిల్లాలో ఏమి జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సందడి రోజురోజుకు ఎక్కువవుతోంది. సీట్లు రాని కొందరు నాయకులు సొంత పార్టీని వదిలి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. విచిత్రమేమిటంటే సుడిలో దూకి ఎదురీదేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇవ్వాలో పార్టీ. రేపో పార్టీ. నామినేషన్‌లు వేసే వరకు ఎవరు ఏపార్టీలో ఉంటారో స్పష్టం చేయడం కష్టమే. నామినేషన్‌ల చివరి క్షణం వరకు ఎవరికి ఏపార్టీ టిక్కెట్ ఇస్తుందో ఊహించడం కూడా కష్టమే.
కృష్ణా జిల్లా రాజకీయాలు వారం రోజులుగా శరవేగంగా మారుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌సీపీని ఒక కుదుపు కుదుపుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిసాయి. ఇప్పుడు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఏడు నియోజకవర్గాలు ఎన్‌టీఆర్ జిల్లాలో, ఏడు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. విజయవాడ నుంచి పశ్చిమ ప్రాంతం ఎన్‌టీర్ జిల్లాగా, తూర్పు ప్రాంతం కృష్ణా జిల్లాగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. మిగిలిన ఆరుగురూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే. వీరిలో నలుగురి పరిస్థితి అయోమయంగా ఉంది. టిక్కెట్లు వస్తాయోలేదోననే అనుమానంలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టిక్కెట్ లేదని తేలిపోయింది. పడమట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సెంట్రల్ ఇన్‌చార్జ్‌గా నియమించి పడమట నియోజకవర్గానికి ముస్లిమ్ సామాజిక వర్గానికి చెందిన షేక్ ఆసీఫ్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారు. దీంతో విష్ణు పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. విష్ణుకు సీటు లేదనగానే ఆయన అనుచరులు ఒక రోజంతా ఆందోళనకు దిగారు.
విష్ణు ఆలోచన ఏమిటి?
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు భవిష్యత్ ఆలోచన ఏమిటనేది సందిగ్ధంగా ఉంది. ఈయన కూడా పార్టీ మారతారా? పార్టీలోనే ఉంటారా అనే అంశంపై నగరంలో పలు రకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా విష్ణు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
మైలవరం వైఎస్సార్‌సీపీ సీటెవరికి?
మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. ఈయనకు సీటు దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో కొందరి తీరు బాగోలేదని కృçష్ణప్రసాద్ ఇటీవల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పార్టీ ముఖ్యులను కలిసి తన టిక్కెట్ విషయం తేల్చాలని కోరారు. అందుకు వారి నుంచి నెగటివ్ సమాధానం వచ్చింది.
మైలవరం నియోజకవర్గ ఓటర్లు కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. 1955 నుంచి కమ్మ సామాజికవర్గం నుంచి పోటీ చేసిన వారు మాత్రమే గెలుపొందుతూ వచ్చారు. వడ్డె శోభనాద్రీశ్వరరావు, వసంత నాగేశ్వరావు వంటి వారు ఇక్కడి నుంచే గెలిచి మంత్రులుగా పనిచేశారు. స్వర్గీయ సినీహీరో కృష్ణ కజిన్ బ్రదర్ జాష్టి రమేష్‌బాబు కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014లో బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌కు ప్రయోగాత్మకంగా సీటు ఇచ్చి వైఎస్సార్‌సీపీ నాలుక కరుచుకుంది. ప్రస్తుతం కృష్ణప్రసాద్ కాకుండా ఆ నియోజకవర్గంలో ఆ స్థాయి లీడర్‌ను తీసుకొచ్చే పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ లేదని అక్కడి వారు చెబుతున్నారు. వేరే నియోజకవర్గం నుంచి రావాల్సిందేనని పార్టీ వారు అంటున్నారు. ‘బయట ఊరి నేస్తం కంటే ఉన్న ఊరి గుండగొయ్య మేలు’ అనే సామెతను అక్కడి వారు చెప్పడం విశేషం.
మొండితోకకు మొండి చెయ్యేనా?
నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావుకు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన తమ్ముడు అరుణ్‌కుమార్‌కు ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ ఇచ్చింది. అన్నాదమ్ములిద్దరికీ పదవి వద్దనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం జగన్‌మోహన్‌రావుకు టిక్కెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది.
క్యాడర్‌లో కనిపించని ఉత్సాహం
ఎన్‌టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వైఎస్సార్‌సీపీలో చేరడం, వెంటనే ఆయనకే వైఎస్సార్‌సీసీ ఎంపీ టిక్కెట్ కేటాయిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రకటన చేయడం ఒక సంచలనం. మొదటి నుంచీ వైఎస్సార్‌సీపీతో నాని టచ్‌లో ఉన్నాడని టీడీపీ ఆరోపణను ఇది బలపరుస్తున్నది. పార్టీలో ఎంతో కాలంగా ఉన్నవారికి దిక్కులేకుండా పోయింది. బయట నుంచి వచ్చిన మరుక్షణమే పార్టీ టిక్కెట్ ఇచ్చిందంటే వైఎస్సార్‌సీపీలో ఏమి జరుగుతుందనే అలజడి పార్టీ నేతల్లో ఉంది. కేశినేనిని పార్టీలోకి తీసుకోవడం వల్ల కొత్త ఉత్సాహమేమీ వైఎస్సార్‌సీపీలో కనిపించలేదు. నాని పార్టీలో చేరిన మరుసటి రోజు తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన భార్య సుధారాణి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో అక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొక్కిలిగడ్డ రక్షణనిధికి టిక్కెట్ దక్కే అవకాశం లేదని తేలిపోయింది. తాను తిరిగి వైఎస్సార్‌సీపీని విజయవాడ నగరంలో గెలిపిస్తానని ఎంపీ కేశినేని నానీ చెబుతున్నారు. ఏమైనా ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు రంజుగా ముందుకు సాగుతున్నాయి.