PULIVENDULA | కడప జెడ్పీపై నేతలకు జగన్ ఆదేశం ఏమిటి?
ఒక రోజు పర్యటనను జగన్ పొడిగించారు. నష్టపోయిన అరటి తోటల రైతులను పరామర్శించారు.;
Byline : The Federal
Update: 2025-03-24 06:09 GMT
పులివెందుల ప్రాంతంలో నష్టపోయిన అరటి తోటలను వైఎస్. జగన్ పరిశీలిస్తున్నారు.
మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ సొంతూరిలో రెండో రోజు పర్యటన వెనుక ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గాలి వాన దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలిస్తున్నారు. బాధిత రైతులను పరామర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతోంది. వాస్తవానికి ..
ఒక రోజు పర్యటన కోసం ఆదివారం ఆయన సొంతూరికి వచ్చారు. పులివెందుల పట్టణంలో పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖరరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి వైఎస్. జగన్ ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి పులివెందులకు చేరుకున్నారు. విజయశేఖరరెడ్డి నివాసాకి వెళ్లిన జగన్ నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆయన సాయంత్రం తిరిగి హెలికాప్టర్ లో బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంది.
రైతులకు పరామర్శ
పులివెందుల ప్రాంతంలో కూడా రెండు రోజుల కిందట అకాలవర్షం, గాలుల ధాటికి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కడప, అనంతపురం జిల్లాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో అరటి తోటలు, తమలపాకుల తోటలు నేలకూలాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోనే 2,400 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ రైతులను పరామర్శించడానికి జగన్ లింగాల మండలంలో తాతిరెడ్డిపల్లె, కొమన్నూతల, ఎగువపల్లెల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని పరామర్శించడానికి జగన్ పర్యటిస్తున్నారు. బాధిత రైతులను ఓదారుస్తున్న ఆయన, పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీతో పాటు, బీమా సదుపాయం వర్తింప చేయడం ద్వారా పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయిలోనే హాజరైన ఉద్యానవన శాఖ అధికారులకు జగన్ ఆదేశించారు.
జెడ్పీ సీటుపై నిర్దేశం
వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పర్యటనలో పారిశ్రామికవేత్త కుటుంబానికి పరామర్శించడం అనేది నిర్ణత కార్యక్రమం. అయితే, కడప జెడ్పీ చైర్మన్ ఎంపికలో వైసీపీ కీలక నేతలకు ప్రధాన బాధ్యతలు అప్పగించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కడప జిల్లా పరిషత్ (KADAP ZILAA PARISHAT) చైర్మన్ చైర్మన్ పదవి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ నేతలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఈ నెల 27వ తేదీ ఉపఎన్నిక జరగనుంది. నెలకిందటే జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు (ZPTC members) చేజారకుండా తీసుకోవాల్సిన చర్యలపై
జగన్ ప్రత్యేక సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో ఆ బాధ్యతలు వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పీ.రవీంద్రనాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. దీంతో జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించిన బ్రంహ్మంగారి మఠం (బి.మఠం) జెడ్పీటీసీ సభ్యుడు రామ గోవిందరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అయినా, జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టడంలో ఎలాంటి వైఫల్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ప్రత్యేక సూచనలు చేశారని సమాచారం. దీంతో వైసీపీ బి.ఫాం (YCP B.Pharm) పై గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను జగన్ సూచనతో కొందరిని బెంగళూరు, ఇంకొందరిని హైదరాబాద్ శిబిరాలకు తరలించినట్లు సమాచారం.