దర్శిలో టీడీపీ ఎత్తుగడ ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శిలో గొట్టిపాటి లక్ష్మిని అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నియమించడంలో లోగుట్టు ఏమిటి? ఆమె ఈ నియోజకవర్గానికి ఎలా పరిచయం?

Update: 2024-03-30 07:40 GMT
LAKSHMI TDP DARSI CANDIDATE

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపికపై ఎత్తుగడ ఏమిటనేది చర్చనియాంశంగా మారింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన గొట్టిపాటి లక్ష్మిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడి నుంచి రెండే రెండు సార్లు హేమాహేమీలైన రావిపాటి మహానంద, కాటూరి నారాయణస్వామిలు గెలిచారు. 1967లో రావిపాటి మహానంద స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1983 టీడీపీ ఉధృతిలో కాటూరి నారాయణస్వామి గెలిచారు. వీరు తప్ప 1952 నుంచి ఇంతవరకు కమ్మ సామాజికవర్గం వారు ఇక్కడ గెలవలేదు. రెడ్డి, కాపు వర్గాల మధ్యనే పోటీ ఉంది. 2014లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్దా రాఘవరావు గెలిచారు. ఆయన గ్రానైట్‌ వ్యాపారి కావడం, పైగా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వల్ల ఆయనకు ఉన్న మంచిపేరుతో గెలుపు సాధ్యమైంది. చీమకుర్తిలో ఆయన నిర్మించిన దేవాలయం కూడా పలువురి ప్రశంశలు అందుకుంది.

బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఒకసారి, ఆయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి ఒకసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్‌ మొదటిసారి గెలిచారు. ఈయన ఒంగోలులో ఇంజనీరింగ్‌ విద్యా సంస్థ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.

ఏమిటి ఈక్వేషన్‌?

మార్టూరు నుంచి గొట్టిపాటి ఫ్యామిలీ తెలియని వారు ప్రకాశం జిల్లాలో లేరని చెప్పొచ్చు. ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చొరవ తీసుకుని చంద్రబాబును ఒప్పించి గొట్టిపాటి లక్ష్మికి సీటు ఇప్పించినట్లు సమాచారం. రవికుమార్‌ పెద్దనాన్న కొడుకు గొట్టపాటి నరసింహారావు కుమార్తె గొట్టిపాటి లక్ష్మి. రవితో ఉన్న బంధుత్వం వల్ల నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా సీటు ఇప్పించాలని చాలా కాలంగా పట్టుబట్టి ఉన్నారు. నర్సరావుపేటలోని డాక్టర్‌ కడియాల వెంకటేశ్వరావు కోడలు కావడంతో ఎలాగైనా సీటు సంపాదిస్తే గెలుపు ఖాయమనే పట్టుదలతో ఉన్నప్పటికీ నర్సరావుపేట సీటు దక్కలేదు. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నందున దర్శి సీటు ఇప్పించినా పోటీ చేస్తామని చెప్పడంతో రవికుమార్‌ పట్టుపట్టి లక్ష్మికి సీటు ఇప్పించారు.

ఏమిటి స్ట్రాటజి..

గొట్టపాటి హనుమంతరావు గురించి తెలియని వారు ఉండరు. కాంగ్రెస్‌ పార్టీలో బలమైన లీడరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా పనిచేశారు. హనుమంతరావు అనారోగ్యంతో చనిపోవడంతో ఆ స్థానంలో నర్సయ్యను రాజకీయాల్లోకి బంధువులు తీసుకొచ్చారు. తండ్రి మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు గొట్టపాటి నరసింహారావుకు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వడంతో గెలిచారు. ఆతరువాత 99లో రెండో సారి గెలిచారు. అనంతర పరిణామాల్లో బాబాయి కొడుకైన గొట్టిపాటి రవికుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి రెండు సార్లు గెలిచారు. ఆ తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒకసారి గెలిచారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2019లో కూడా గెలుపు సాధించారు. అంటే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదోసారి అద్దంకి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.

గొట్టిపాటి రవికుమార్‌ అన్న గొట్టిపాటి నర్సయ్య ఉన్నప్పుడు 1994లో దర్శి ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరాములు గెలిచారు. అనంతరం ఆయన చనిపోయారు. ఆ సమయంలో శ్రీరాములు కుమారుడు పాపారావు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఇప్పించడంలోనూ, గెలిపించడంలోనూ నర్సయ్య కీలకపాత్ర పోషించారు. దీనిని ఇప్పుడు ఉపయోగించుకోవాలని గొట్టిపాటి కుటుంబం నిర్ణయించింది. పాపారావు తప్పకుండా తమ కుటుంబానికి సానుకూలంగా ఉంటారని, ఎన్‌డీఏ కూటమి తరపున సీటు ఇవ్వడం వల్ల బలిజలు అనుకూలంగా వుండే అవకాశం ఉన్నందున పోటీ చేస్తే గెలుపు ఖాయమనే నిర్ణయానికి వచ్చారు.

ఆశలు పాపారావుపైనే

దర్శిలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి పెద్ద దిక్కు నారపుశెట్టి పాపారావు. మాజీ ఎమ్మెల్యే కావడం వల్ల ఆయనకంటూ కొద్దిపాటి వర్గం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు కూడా ఉంది. గొట్టిపాటి నరసయ్య బతికుండగా పాపారావు దర్శి నుంచి పోటీ చేసినప్పుడు ఆయనను గెలిపించడంలో కీలక పాత్ర పోషించినందున ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఎన్నికల రంగంలోకి లక్ష్మీ దిగారు. లక్ష్మీ సోదరుడు గొట్టిపాటి భరత్‌ 2014 ఎన్నికల్లో పర్చూరు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు కాస్తా దూరంగానే ఉంటున్నారు. అద్ధంకిలో తమ బాబాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందున వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయాలకు భరత్‌ దూరంగా ఉన్నారనే టాక్‌ కూడా ఉంది. ఇప్పుడు భరత్‌ సోదరి లక్ష్మీకి రవికుమార్‌ టికెట్‌ ఇప్పించినందున ఇక గెలిపించకోవడం తన వంతుగా భరత్‌ కూడా భావించే అవకాశం ఉంది.

ఒక వైపు గ్రానైట్‌ వ్యాపారి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మరో వైపు వైద్య రంగంలో నరసరావుపేటలో మంచి పేరు సంపాదించుకున్న లక్ష్మీ దర్శిలో రంగంలోకి దిగారు. ఇరువురు ధనవంతులే. ఖర్చు పెట్టడంలో ఒకరికొకరు తీసిపోరు. ప్రస్తుతం దర్శిలో నడుస్తున్న టాక్‌ను పరిశీలిస్తే రెండు పార్టీలకు ఓటర్లు దాదాపు సమానంగానే ఉన్నారని, ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టగలిగితే వారికే విన్నింగ్‌ చాన్స్‌ ఉంటుందని ఓటర్లు అంటున్నారు.

Tags:    

Similar News