ఇప్పటి ఆంధ్రప్రదేశ్ స్వరూపం ఎలా ఉందంటే..

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వరూపం ఎలా మారిందో తెలుసా.. రాష్ట్రంలో వచ్చిన మార్పులు, కూర్పులు ఇవే..

Update: 2024-04-15 08:50 GMT
Source: Twitter

2014 జూన్ 2.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలింది. పార్లమెంటు ఆమోదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్తా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలున్న విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీకృష్ణ కమిషన్ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

2024 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా వినియోగించుకునే సౌలభ్యం ఉన్నా రెండేళ్లలోనే రాజధానిని తరలించడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాత్కాలిక సచివాలయాన్ని, తాత్కాలిక అసెంబ్లీని, తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసి అమరావతి ప్రాంతం నుంచే పాలన సాగించారు. రాజధానికి శంకుస్థాపన జరిగినా అది గాడిన పడలేదు. ఇంతలో 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టారు.

మూడు రాజధానులను ప్రకటించారు. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా, విశాఖపట్నాన్ని పాలనాపరమైన రాజధాని, కర్నూలును న్యాయపరమైన రాజధానిగా ప్రకటించారు. అప్పటివరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, నరసాపురం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ జిల్లాలు అమలులోకి వచ్చాయి.

ఏపీలోని జిల్లాలు – వాటి ముఖ్య కేంద్రాలు ఇలా..

శ్రీకాకుళం – శ్రీకాకుళం

విజయనగరం – విజయనగరం

మన్యం జిల్లా – పార్వతీపురం

అల్లూరి సీతారామరాజు – పాడేరు

విశాఖపట్టణం – విశాఖపట్టణం

అనకాపల్లి – అనకాపల్లి

తూర్పుగోదావరి – కాకినాడ

కోనసీమ – అమలాపురం

రాజమహేంద్రవరం – రాజమహేంద్రవరం

నరసాపురం – భీమవరం

పశ్చిమ గోదావరి – ఏలూరు

కృష్ణా – మచిలీపట్నం

ఎన్‌టీఆర్ జిల్లా – విజయవాడ

గుంటూరు – గుంటూరు

బాపట్ల – బాపట్ల

పల్నాడు – నరసరావుపేట

ప్రకాశం – ఒంగోలు

ఎస్‌పీఎస్ నెల్లూరు – నెల్లూరు

కర్నూలు – కర్నూలు

నంద్యాల – నంద్యాల

అనంతపురం – అనంతపురం

శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి

వైఎస్సార్ కడప – కడప

అన్నమయ్య జిల్లా – రాయచోటి

చిత్తూరు – చిత్తూరు

శ్రీ బాలాజీ జిల్లా – తిరుపతి

జిల్లా అనే పదం ఎక్కడిది..

జిల్లా అని తెలుగులో, డిస్ట్రిక్ట్ అని ఇంగ్లీషులో పలికే ఈ పదానికి పరిపాలనకు అనుగుణంగా నిర్దేశించిన ప్రాదేశిక భూభాగం అని అర్థం. జిల్లా అనే పదం పర్షియన్, ఉర్దూ భాషల నుంచి వచ్చింది. దాని అర్థం విభజన అని. జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటయ్యాయి. జిల్లాలను తిరిగి మండలాలు, గ్రామాలు, వార్డులుగా విభజించారు. జిల్లాల విభజన తర్వాత- విస్తీర్ణం ప్రకారం చూస్తే 14,322 చ.కి.మీ. విస్తీర్ణంతో ఏపీలో పెద్ద జిల్లాగా ప్రకాశం, 928 చ.కి.మీ. విస్తీర్ణంతో విశాఖపట్టణం అతిచిన్న జిల్లాగా అవతరించాయి.

జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల జనాభాతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. జిల్లాల విభజన తర్వాత- విశాఖపట్నం జిల్లా జనాభా 18.13 ల‌క్ష‌లు. ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేదు. విశాఖపట్నం జిల్లాలోని నగర ప్రాంతాన్ని విశాఖపట్నం జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా విభజించారు. రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా జనాభా 9.54 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమైన వాస్తవాలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార భాష తెలుగు. రాష్ట్ర వైశాల్యం 1,60,205 చదరపు కిలోమీటర్లు. జనాభా 4 కోట్ల 93 లక్షల 86 వేల 799. 13 జిల్లాలు. తీరప్రాంతం 972 కి.మీ.

ఏపీలో ఏ కులం పెద్దది?

కులాల పరంగా చూసినప్పుడు కాపులు (ఉపకులాలు సహా) జనాభా పరంగా ఎక్కువ. కాపులను కొన్ని ప్రాంతాల్లో నాయుళ్లు, తెలగాలు, బలిజలు, తూర్పు కాపులు, ఒంటర్లుగా పిలుస్తుంటారు. తూర్పు కాపులు బీసీలలో ఉన్నందున వాళ్లు కాపుల కిందకు రారని చెబుతున్నా వాళ్లని కూడా కాపుల కోటాలోనే వేస్తుంటారు. గోదావరి-కృష్ణా డెల్టా ప్రాంతంలో ప్రధాన కేంద్రీకరణతో ఇవి ప్రధానంగా కోస్తా ఆంధ్రలో ఉన్నాయి.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పేదరికం రేటు 2015-16లో 11.77%. అయితే 2023 నాటికి బాగా తగ్గిందని లెక్కలు చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. 2023లో పేదరికం రేటు 4.2% తగ్గింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాయని ప్రభుత్వ వాదన. ఆంధ్రప్రదేశ్ కళలు, హ్యాండీక్రాఫ్ట్స్‌కి మారుపేరు. కలంకారి, సాంప్రదాయ వస్త్ర కళారూపం, ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. దాని క్లిష్టమైన చేతితో చిత్రించిన డిజైన్లకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం సున్నితమైన కొండపల్లి బొమ్మలు, బంజారా ఎంబ్రాయిడరీ, బిద్రివేర్, మెటల్ వర్క్ క్రాఫ్ట్ ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది.

రాష్ట్రం 48 ఖనిజాలకు నిధిగా ఉంది. ప్రత్యేకంగా బంగారం, డైమండ్, బాక్సైట్, బీచ్ ఇసుక, సున్నపురాయి, బొగ్గు, చమురు, సహజ వాయువు, మాంగనీస్, డోలమైట్, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, విలువైన, సెమీ విలువైన రాళ్లు, క్లేస్, కాల్సైట్, స్టీటైట్, ఐరన్ ఓర్, బేస్ మెటల్స్, బారైట్స్, యురేనియం, గ్రానైట్, లైమ్‌స్టోన్ స్లాబ్‌లు, మార్బుల్స్ వంటివి ఉన్నాయి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 మే 13న వీటికి ఎన్నికలు జరగబోతున్నాయి.

Tags:    

Similar News