పవన్ కళ్యాణ్ మనసులో మాటేంటి?

పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? దేశ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? రాష్ట్రానికే పరిమితం కావాలనుకుంటున్నారా?

Update: 2024-03-23 12:59 GMT
పవన్ కళ్యాణ్, జెఎస్పి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది భిన్నమైన శైలి. మనసులో ఉన్నది ఏదీ స్పష్టంగా చెప్పలేరు. ప్రసంగాల్లో మాత్రం ఇరగదీసి మాట్లాడాలనుకుంటారు. ఒక్కో సారి తడబడతారు. రాసుకుని వచ్చిన ప్రసంగాన్ని చదవాలంటే కొంత కష్టంగానే ఉంటుంది. అయినా సినిమాల్లో డైలాగులు బట్టీ పట్టి చెప్పినట్లు చెప్పాలని ట్రై చేస్తారు. ఆ విషయాన్ని పక్కన బెడితే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని తన పార్టీ వారిని ఆదేశించారు. ఎన్నికలు ముగిసే వరకు పిఠాపురంలోనే బస చేస్తానని, అక్కడే బస ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై ఉండి అంత భయపడితే ఎలాగని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీల అధ్యక్షులు తాడేపల్లిలోనే ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించినా సాయంత్రానికి పార్టీ కార్యాలయానికి వచ్చేయొచ్చు. ఆ తరువాత ఇంటికి వెళ్లొచ్చు. పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయానికి వస్తుంది. పవన్ కళ్యాణ్ వద్దకు పార్టీ క్యాడర్ రావాలంటే మరో రోజు అదనంగా ఉండాల్సి ఉంటుంది. బస చేయడానికి పిఠాపురంలో పార్టీ నాయకులకు కూడా కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని మారుస్తానని చెప్పినట్లు పవన్ కూడా చేస్తున్నాడా? అనే సందేహాలు పలువురిని తొలుస్తున్నాయి.

ఎంపీ స్థానం వైపు చూసే అవకాశం ఉందా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీలో ఉంటారా? కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారా? ఇంకా స్పష్టం చేయలేదు. ఈనెల 19న మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పిఠాపురం జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ తరపున కాకినాడ ఎంపీ బరిలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్ నాకోసం ఎంతో త్యాగం చేశారు. అతనిని ఎంపీ బరిలో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఆ వెంటనే మాట్లాడుతూ ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేయాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబితే అప్పుడు కాకినాడ నుంచి నేను ఎంపీగా, పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారన్నారు. దీంతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. రాష్ట్రంలో ఉంటారా? కేంద్రానికి వెళతారా? అంటూ పలువురు సెటైర్స్ వేసుకుంటూ మాట్లాడుకోవడం విశేషం.

Tags:    

Similar News