పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారకులు ఎవరు?
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వల్లనే పెన్షన్ లు ఆలస్యమవుతున్నాయా? ప్రభుత్వానికి పంపిణీ చేసే సమర్థత లేదా? ఈ వ్యవహారం ఏ సంకేతాలు ఇస్తోంది.
సామాజిక పింఛన్ దారులకు సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే పదిరోజులు పట్టచ్చొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనడం ఏమిటి? ఇంతకు ముందు వాలంటీర్ల ద్వా ఒకటీ లేదా రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేవారు. ఆ వ్యవస్థ లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎన్నికల కమిషన్ సూచించింది. అయినా పంపిణీకి ఇన్ని రోజులు పడుతుందంటే ప్రభుత్వం రాజకీయమైనా చేయాలి, అసమర్థులమని చెప్పుకోవాలి.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ ద్వరా కోర్టులో కేసు వేయడం వల్ల ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచిందనేది పలువురి వాదన. వాస్తవానికి సోమవారం ఉదయం నుంచి సామాజిక పింఛన్ ల పంపిణీ జరగాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులతో అందించేందుకు ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది.
మూడు నెలల పాటు ఈ ప్రక్రియ సాగాలి
సామాజిక పింఛన్లు అందించే కార్యక్రమం ఎన్నికలు పూర్తయ్యే వరకు అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన పింఛన్ లు గ్రామ సచివాలయాల సిబ్బంది పంపిణీ చేయాల్సి ఉంటుంది. పింఛన్ మొత్తాన్ని సచివాలయ ఉద్యోలు నేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వడం సాధ్యం కాకపోవొచ్చు. అందువల్ల పింఛన్ దారులను సచివాలయం వద్దకు వచ్చి తీసుకుపోవాల్సిందిగా కోరారు. చాలా మంది నడవలేని వారు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. వాలంటీర్లు 50 నుంచి 70 కుటుంబాలకు ఒకరు చొప్పున ఉండటం, ఏ ఇంట్లో ఎవరు లబ్ధిదారులో ముందుగానే తెలిసి ఉండటం వల్ల ఇప్పటి వరకు పంపిణీ ఈజీ అయింది. వీరిని పక్కన బెట్టడం వల్ల పంపిణీ అంత ఈజీ కాదని అర్థమైంది.
సచివాలయాల వద్ద పంపిణీ
ఏప్రిల్, మే, జూన్ నెలలకు పింఛనుదారులకు సామాజిక భద్రత పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) సీఈఓ మురళీధర్‌రెడ్డి ఆదివారం సర్క్యులర్ జారీచేశారు. లబ్ధిదారుల ఆధార్ అథెంటికేషన్ (బయోమెట్రిక్/ఐరిస్/ఆధార్ ఫేస్) ద్వారా సచివాలయ ఉద్యోగులు వారికి పింఛను మొత్తాన్ని అందిస్తారని తెలిపారు. ఇవి విఫలమైతే రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టం (ఆర్‌బీఐఎస్) ద్వారా అందిస్తామన్నారు. ఏ సచివాలయం పరిధిలో ఎంతమంది లబ్ధిదారులున్నారు? వారికి పంపిణీ చేయాల్సిన మొత్తం ఎంతనే వివరాలతో కూడిన అథెంటికేషన్ లెటర్‌ను పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ, విద్యాసహాయకులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులు, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అందిస్తారు. వీటిని ఎన్నికల అధికారులకు కూడా నివేదిస్తారు. సచివాలయ ఉద్యోగులు ఈ ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లి బ్యాంకుల నుంచి నగదు తీసుకోవాలి. పంపిణీ బాధ్యతను సంక్షేమ, విద్యాసహాయకులు, వార్డు అడ్మిన్ కార్యదర్శి పర్యవేక్షిస్తారు.
చంద్రబాబు లేఖ
వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చినందున వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. ఎలాంటి జాప్యానికీ తావులేకుండా నగదు రూపంలోనే పింఛను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనాకు ఆదివారం ఆయన లేఖ రాశారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పింఛను పంపిణీలో వినియోగించాలి. ఈ మేరకు పింఛను నగదును బ్యాంకుల నుంచి గ్రామాలకు తీసుకువెళ్లేందుకు సచివాలయ సిబ్బందికి అనుమతి ఇవ్వాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
అయితే ఇప్పటివరకు పింఛన్ల పంపిణీకి కావాల్సిన మొత్తాన్ని సంబంధిత శాఖ వద్ద ఉంచలేదనే వార్తలు వస్తున్నాయి. కావున వెంటనే నిధులు సమకూర్చండి. గతంలో మాదిరిగానే ఒకటో తేదీ నుంచి అయిదో తేదీ మధ్య పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, నిధుల్ని సమకూర్చడం, అందుకు కావాల్సిన పాలనాపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని చంద్రబాబు లేఖలో కోరారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్‌రెడ్డికి చంద్రబాబు మరో లేఖ రాశారు.
ప్రభుత్వం అసమర్థత
పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం తన అసమర్థత నిరూపించుకుందని, దీనిని కూడా రాజకీయానికి వాడుకుందని ఏపీసీసీ అధ్యుక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె సోమవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి పింఛన్ల విషమై మాట్లాడారు. పంపిణీకి పది రోజులు పట్టే అవకాశం ఉందని జవహర్ రెడ్డి చెప్పడంతో ఆమె మండిపడ్డారు. కావాలని రాజకీయం చేసి ముసలివారికి, దివ్యాంగుకు, ఇతరులకు అందాల్సిన పింఛన్లు ఆలస్యం చేస్తే చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వాలంటీర్లను తప్పించడం నిబంధనల ప్రకారమే..
వాలంటీర్లు పింఛన్ల పంపిణీ సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారిని పంపిణీకి దూరంగా ఉంచడం మంచిదేననే వాదన కూడా ఉంది. రాజకీయ పరిశీలకులు ఆలోచన మేరకు ఎన్నికలకు ముందు ఇటువంటి చర్యలు సాధారణమేనని అంటున్నారు. దీనిని ఏ పార్టీ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది వారి మాట. వాలంటీర్ల వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలమైందేనని, అందువల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనేది రాజకీయ పార్టీల్లోని కొందరు ముఖ్యుల మాట. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున కొందరు వాలంటీర్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి.