షర్మిలమ్మ వదిలిన 'బాణాలు' ఎవరికి గుచ్చుకునేను?

అధికార పార్టీకి వైయస్సార్ కుటుంబంలోని సభ్యులు కొందరు బాణాల్లా మారారు. వైఎస్. షర్మిల కోసం రంగంలోకి దిగిన వీరు ఎవరి పీఠాలు కదిలిస్తారో అనే చర్చ జరుగుతోంది.

Update: 2024-04-30 02:23 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: 2014 ఎన్నికల వేళ.. "నేను జగనన్న వదిలిన బాణాన్ని" సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్. షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. కుటుంబ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. సొంత అన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్. షర్మిల రెడ్డి ప్రత్యర్థిగా మారారు.

" నేను ఎవరూ వదిలిన బాణాన్ని కాదు. స్వేచ్ఛగా పనిచేస్తా" అని ఇటీవల విజయవాడలో ఆమె అన్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. కడప ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగారు. అది కూడా... స్వయానా బాబాయ్ కుమారుడైన వైఎస్. అవినాష్ రెడ్డి పైనే.. అంతటితో ఆగని ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అసెంబ్లీ స్థానాల్లో కూడా అభ్యర్థులను దించారు. ఈ వ్యవహారం కాస్త..

కడప జిల్లాలో కొందరు పీఠాలు కదిలే పరిస్థితి ఏర్పడింది. బహుముఖ పోటీ ఉంటుందని భావించిన అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చీలే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పోటీలో ఉన్న టిడిపి కూటమి అభ్యర్థుల అంచనాల కూడా తలకిందులయ్యే పరిస్థితి లేకపోలేదని భావిస్తున్నారు.

దూసుకుపోతున్న బాణాలు..

" నేను ఎవరు వదిలిన బాణం కాదు. స్వేచ్ఛగా పనిచేస్తా" అని ప్రకటించిన పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల రెడ్డి విల్లుగా మారారు. ఆమె అమ్ములపొద నుంచి కుటుంబ సభ్యులందరూ బాణాలుగా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన శరవేగంగా దూసుకుపోతున్నారు. కడప ఎంపీగా వైఎస్. షర్మిలారెడ్డి నామినేషన్ చేయడానికి పూర్వం బస్సు యాత్ర ద్వారా జిల్లాను చుట్టుముట్టి వచ్చారు. ఆమెకు దన్నుగా బాబాయ్, మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్. సునీతారెడ్డి అండగా నిలిచారు.

పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ ఎన్. తులసిరెడ్డి వెంట ఉండగా, పాత కాంగ్రెస్ వాదులను ఏకం చేయడంతో పాటు, వైయస్సార్ అభిమానుల మనస్సు చూడడానికి ముమ్మర పర్యటన సాగించారు. పీసీసీ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న షర్మిల స్టార్ క్యాంపైనర్‌గా రాష్ట్ర పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆమె లేని లోటు కనిపించకుండా, వైయస్సార్ కుటుంబంలోని వైఎస్. సునీతరెడ్డి, ఆమె తల్లి వైఎస్. సౌభాగ్యమ్మతోపాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్. సునీతరెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాలో దృష్టి నిలిపారు.

ఎవరికి వారు కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైయస్సార్ అభిమానులు, మద్దతుదారులను కూడగట్టడంతోపాటు తమ కుటుంబాన్ని ఆదరించే వారిని సమీకరించడంలో బిజీగా ఉన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ మాత్రం క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న ప్రదేశాలతో సహా చర్చల్లో ప్రత్యేక ప్రార్థనల ద్వారా పరిస్థితిని అనుకూలంగా మలచడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో...

టిడిపి పరోక్ష సహకారం.?

రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సిపితో టిడిపి కూటమి అమితుమీ తేల్చడానికి సిద్ధమైంది. దీంతో సొంత గడ్డ కడపలో దెబ్బతీసే లక్ష్యంగా ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కడప పార్లమెంటు స్థానం నుంచి రాజకీయాల్లో పోటీ చేసిన అనుభవం లేని సి. నారాయణ రెడ్డి కుమారుడు చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డిని నామమాత్రంగా పోటీకి నిలిచారనే భావన కల్పించారు. పరోక్షంగా ఇక్కడ పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిలా రెడ్డికి లాభం కలిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

కడప పార్లమెంటు నియోజకవర్గంలోని మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ కు దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్ సమకాలీన సహచరుడు, మాజీ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్. షర్మిలా రెడ్డికి పరిస్థితి కాస్త అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై సీనియర్ నేత నంద్యాల వరదరాజులరెడ్డి పోటీ చేయడం వల్ల ఈ కేంద్రం హాట్ సీట్‌గా మారింది.

ఈ నియోజకవర్గంలో కూడా కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి కూటమి పార్టీ నుంచి పరోక్ష సహకారం అందే వాతావరణ కనిపిస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైయస్సార్ కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డిపై బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దివంగత వైఎస్ఆర్ కు ఆత్మీయ సన్నిహితుడు. అందువల్ల ఇక్కడ కూడా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్. షర్మిలా రెడ్డికి పరోక్ష సహకారం ఉంటుందని భావిస్తున్నారు.

వైయస్సార్ కుటుంబీకులే.. ప్రత్యర్థులుగా

పురిటిగడ్డ పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబానికి తిరుగులేదు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్. షర్మిలరెడ్డి స్వయానా అన్న సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరో సోదరుడు బాబాయ్ కుమారుడు వైఎస్. అవినాష్ రెడ్డితో ఎంపీ అభ్యర్థిగా ఢీకొంటున్నారు. ఆమె సోదరి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్. సునీతా రెడ్డి ప్రచారంలో ఉన్నారు. తాజాగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్. భారతి రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. ఒకే కుటుంబంలోని వారంతా ప్రత్యర్థులుగా మారి పులివెందులలో పోటాపోటీ ప్రచారాలతో సాగుతుండడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి రాకుండా వైయస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేఖలతో విమర్శనాస్త్రాలు సంధిస్తూ, సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డినీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కడప అసెంబ్లీ స్థానంలో..

కడప అసెంబ్లీ స్థానం నుంచి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పోటీలో ఉన్నారు. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా ఆర్. మాధవీరెడ్డి ప్రత్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానం నుంచి ముస్లిం మైనారిటీ నాయకుడు అఫ్జల్ ఖాన్ ను పోటీకి దించింది. కడప అసెంబ్లీ స్థానంలో ముస్లింలు ఎక్కువగా ఉండడం వల్ల, ఆ ఓట్లు కొల్లగొట్టవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ అభిమతంగా కనిపిస్తుంది. దీంతో అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్థి అంజాద్ బాషాపై అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని టిడిపి అభ్యర్థి ఆర్. మాధవీరెడ్డి ఆలోచనలకు గండి పడే ప్రమాదం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో అత్యధిక ముస్లిం ఓటర్ల జనాభా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ షేక్. అల్లాబక్ష్‌ను పోటీకి దింపింది. ఇక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ రెడ్డి తిరుగుబాటు చేసి అధికార వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఇది కాస్త వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి లాభిస్తుందని భావించారు. అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లబక్ష్‌ను తెరమీదకు తీసుకురావడం ద్వారా అధికార, ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ, టిడిపికి అనుకూలంగా ఉన్న ముస్లిం ఓట్లకు గాలం వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు ప్రధానంగా బిజెపి ప్రభుత్వంతో ముస్లింలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎరగా చూపించి, కమలనాధుల వెంట ఉన్న టిడిపి రక్షణ కల్పించలేదని విషయాన్ని వివరించడం ద్వారా పరిస్థితిని కాస్త అయినా చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

బద్వేలు ఎస్పి రిజర్వుడ్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పోటీ చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టిడిపి నేత రోశయ్యకు బిజెపి కండువా వేసి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయాలని గతంలో ప్రయత్నించిన బ్యాంకు మాజీ అధికారి ఎన్.డి. విజయజ్యోతిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి అధికార వైఎస్ఆర్సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే.. విపక్ష టిడిపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల ఓట్ల తేలికకు, అలాగే అంచనాలు తారుమారు చేసేందుకు ఆస్కారం ఏర్పడిందని భావిస్తున్నారు.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపారు. అయితే, వారి ప్రభావం నామమాత్రంగానే ఉంటుందనేది పరిశీలకుల అంచనా. పీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్. షర్మిలా రెడ్డి కొందరు కుటుంబ సభ్యుల సహకారంతో యుద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ అభ్యర్థికి మూడింది.. ఎవరి అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉందనేది పోలింగ్ తర్వాత తేలనున్నది.

Tags:    

Similar News