‘అనంత’లో ఎవరి బలం ఎంత?

ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్న పోటీ జరగనున్న నియోజకవర్గాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడ ఆధిపత్యం కోసం రెండు పార్టీలు తెగ కష్టపడుతున్నాయి.

Update: 2024-04-28 01:58 GMT

బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో అనంతపురం ఒకటి. నూటికి 50 శాతం మంది బీసీలున్న జిల్లా అనంతపురం. ఎంత చరిత్ర ఉందో అంత వెనుకబడిన జిల్లాగానూ పేరుంది. దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలలో ఇదొకటి. ఒకప్పుడు రాయలేలిన అనంతరపురం జిల్లా రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైంది. ఈ జిల్లా ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్రపతిని, ఈ దేశం తాకట్టులో ఉందని అంకెలు సంకెలతో తేల్చి చెప్పిన మరో ప్రముఖ వామపక్ష నాయకుణ్ణి అందించింది.

స్వాతంత్ర్యం తర్వాత అన్ని ప్రాంతాల మాదిరే ఈ జిల్లా కాంగ్రెస్ పట్టులో కొంతకాలం, కమ్యూనిస్టుల ప్రభావంలో మరికొంత కాలం సాగింది. 1983లో తెలుగు జాతి ఆత్మగౌరవం పేరిట ఎన్టీరామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశంతో ఈ జిల్లాలో వారసత్వంగా వస్తున్న కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి పడింది. ఆధిపత్య కులాలను పక్కన బెట్టి బీసీలకు పెద్దపీట వేసింది. జిల్లాలో 50 శాతంగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకుంది.

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత బీసీ వర్గాల్లో ఎక్కువ మంది టీడీపీ వైపే ఉంటున్నారు. ఈ వర్గాల్లోనూ కురుబ, బోయ కులస్ధులదే పైచేయి. ఎన్నికలు ముగిసిన తర్వాత వారిచ్చిన హామీలు మరచిపోవడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా 14 స్థానాలకు గాను 12 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీసీలను దగ్గర చేర్చుకునేందుకు టీడీపీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీంతో వివిధ కారణాలతో టీడీపీని వీడిన వారిలో చాలా మంది తిరిగి టీడీపీలో చేరుతున్నారు. ఇదే అదునుగా భావించి ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నాయకులంతా కలిసికట్టుగా విజయం కోసం కృషి చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన 12 అసెంబ్లీ స్థానాలను తిరిగి ఈ ఎన్నికల్లో నిలబెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి...

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావం నుంచి మూడు సార్లు మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఎక్కువ మంది టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన 1983 ఎన్నికల్లో 12 స్థానాల్లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. అనంతరం 1989 ఎన్నికల్లో ఆ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది. దాంతో సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తులో భాగంగా 1994లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందారు.

పొత్తులో భాగంగా అనంతపురం నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున పోటీ చేసిన కె.రామకృష్ణతో పాటు 12 మంది టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న కదిరి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఎంఎస్ పార్థసారథితో పాటు మరో ఏడు స్థానాల్లో టీడీపీతో కలిపి మొత్తం 8 మంది గెలుపొందారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆరు, 2009లో ఆరు, 2014లో 12, 2019 ఎన్నికల్లో రెండు చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 1994 ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా ఈ సారి 2024లో ఆ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆ పార్టీ నేతల అంచనా. .

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర..

గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రజల గురించి పట్టించుకోకుండా స్వలాభం కోసమే ఐదేళ్లూ పని చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న ఒక మంత్రి, ఒక మాజీ మంత్రికి తప్పని పరిస్థితుల్లో టికెట్‌ ఇవ్వాల్సి రావడంతో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా ఉన్న ఉష శ్రీచరణ్‌ను ఈసారి ఆ పార్టీ పెనుకొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది.

అదేవిధంగా మాజీ మంత్రి, ప్రస్తుత పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణను ఈ సారి అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చారు. మడకశిర ఎమ్మెల్యే ఎం తిప్పేస్వామిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను తిరిగి గట్టెక్కిస్థాయని అభ్యర్థులు చెబుతున్నారు.

అంచనాలు తారుమారు..

ఈ ఎన్నికల్లో నాయకుల అంచనాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. విజయం కోసం ఇటు టీడీపీ అటు వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు డబ్బుతో పాటు ఇతర తాయిలాలు పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నుంచి మెట్టు గోవిందరెడ్డి పోటీలో ఉన్నారు. కాల్వ శ్రీనివాసులుకు మొదటి నుంచి స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాటం చేయడంలో ముందుంటారనే పేరు ఉంది.

మెట్టు గోవిందరెడ్డి పారిశ్రామికవేత్త కావడంతో ఎన్నికల సమయంలో మినహా మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉండరని స్థానికులు చెబుతున్నారు. ఈసారి కాల్వ శ్రీనివాసులు విజయం సాధించే అవకాశం ఉందని నియోజకవర్గానికి చెందిన అధిక శాతం మంది చెబుతున్నారు. ఉరవకొండ నుంచి టీడీపీ తరపున పయ్యావుల కేశవ్, వైఎస్సార్‌సీపీ తరపున వై విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య పోటా పోటీగా ఉంది. అయితే పయ్యావుల కేశవ్‌ ఎప్పుడూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే భావన ఉంది. ఆయన సోదరుడు నియోజకవర్గంలో పెత్తన చెలాయిస్తుంటారనే అపవాదు ఉంది.

అయితే ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి స్వల్ప మెజార్టీలో విజయం సాధించే అవకాశాలు ఉన్నా, ఆయన సోదరుడు మధుసూధనరెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు. ఈయన కనీసం మూడు నాలుగు వేల ఓట్లు చీల్చితే ఫలితం టీడీపీ వైపే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గుంతకల్లు నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరామ్, వైఎస్సార్‌సీపీ నుంచి వై.వెంకట్రామిరెడ్డి పోటీ పడుతున్నారు.

ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఆశించినా టికెట్‌ రాకపోవడంతో ప్రస్తుతం ఆయన అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో కొంతవరకు టీడీపీకి ఎదురుదెబ్బ పడే అవకాశం ఉంది. దీంతో వెంకటరామిరెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా తక్కువ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయి. తాడిపత్రి నుంచి టీడీపీ తరపున జేసీ అస్మిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇరుపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం సాగుతోంది. ఎవరు గెలిచినా ఐదు వేలకు మించి మెజార్టీ వచ్చే అవకాశం లేదని నియోజకవర్గానికి చెందిన ప్రజలు చెబుతున్నారు.

శింగనమల నుంచి టీడీపీ తరపున బండారు శ్రావణి శ్రీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఎం.వీరాంజనేయులు పోటీ పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సామాన్య కార్యకర్త కావడం, నియోజకవర్గానికి చెందిన నాయకులు పెద్దగా తెలియకపోవడం మైనస్‌. ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఆయన విజయం కోసం కృషి చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి విజయం కోసం వర్గాలు వీడి నాయకులంతా కలిసికట్టుగా పని చేస్తుండటంతో విజయం టీడీపీకి వరిస్తుందని పబ్లిక్‌ టాక్‌.

అనంతపురం అర్బన్‌ నుంచి టీడీపీ తరపున దగ్గుపాటి వెంటేశ్వర ప్రసాద్, వైఎస్సార్‌సీపీ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు. వెంకటేశ్వర ప్రసాద్‌ నియోజకవర్గానికి కొత్త కావడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సహకరించక పోవడం మైనస్‌. అనంత వెంకట్రామిరెడ్డి సౌమ్యుడనే పేరుంది. ప్రజలకు అందుబాటులో ఉంటారు. దీంతో ఆయన విజయం ఖాయం అని ఇటు కొందరు టీడీపీ నేతలు సైతం చెబుతున్నారు.

కళ్యాణదుర్గం నుంచి టీడీపీ నుంచి అమిలినేని సురేంద్రబాబు, వైఎస్సార్‌సీపీ నుంచి తలారి రంగయ్య పోటీలో ఉన్నారు. ఇద్దరూ నియోజకవర్గానికి కొత్త. కుల ఓట్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాప్తాడు నుంచి టీడీపీ తరపున పరిటాల సునీత, వైఎస్సార్‌సీపీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది. దీనికి తోడు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నా నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో విజయం టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల మాట.

మడకశిర నుంచి టీడీపీ తరపున ఎంఎస్‌ రాజు (టీడీపీ), వైఎస్సార్‌సీపీ నుంచి ఈర లక్కప్ప, కాంగ్రెస్‌ నుంచి సుధాకర్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా తొలుత మాజీ ఎమ్మెల్యే కుమారుడు సునీల్‌కుమార్‌ పేరు ప్రకటించినా కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన స్థానంలో స్థానికేతరుడైన ఎంఎస్‌ రాజుకు టికెట్‌ ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఈరన్న టీడీపీని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ముగ్గురి మధ్య నున్వా నేనా అనే రీతిలో పోటీ ఉంది.

హిందూపురం నుంచి టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ నుంచి తిప్పేగౌడ నారాయణ్‌ దీపిక పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి స్థానికేతురాలు కావడం, టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా విజయం సాధిస్తూ వచ్చారు. ఈ సారి కూడా టీడీపీ విజయం ఖాయం అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. పెనుకొండ నుంచి టీడీపీ తరపున ఎస్‌. సవిత, వైఎస్సార్‌సీపీ నుంచి మంత్రి ఉష శ్రీచరణ్‌ పోటీలో ఉన్నారు. ఇద్దరూ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే. నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లు ఆ కులానికి చెందిన వారే ఉన్నారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యల కోసం పోరాడుతూ వస్తున్న ఎస్‌.సవిత విజయం తథ్యమని చెబుతున్నారు.

పుట్టపర్తి నుంచి టీడీపీ తరపున పల్లె సింధూరారెడ్డి, వైఎస్సార్‌సీపీ తరపున దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సింధూరారెడ్డి విజయానికి ఆమె మామ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఇక్కడ టీడీపీ విజయానికి అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ధర్మవరం నుంచి టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి వై.సత్యకుమార్, వైఎస్సార్‌సీపీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు.

నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యేగా వెంకట్రామిరెడ్డి సఫలీకృతుడయ్యాడు. నియోజకవర్గానికి కొత్తగా పరిచయమైన సత్యకుమార్‌ ప్రచారంలోనూ కొంత వెనుకంజలోనే ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీకే కొంతవరకు విజయావకాశాలు ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కదిరి నుంచి టీడీపీ తరపున కందికుంట వెంకటప్రసాద్, వైఎస్సార్‌సీపీ నుంచి మక్బూల్‌ అహ్మద్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్న కారణంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయానికి కొంత ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే టీడీపీ ఆధారపడుతోంది

Tags:    

Similar News