హింసకు బాధ్యులెవరు?

ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హింస జరిగింది. నిరోధించడంలో ఈసీ విఫలమైంది. పోలింగ్ బూత్ ల్లో జరగలేదని చేతులు దులుపుకుంది. పోలీసులు సైతం కొట్లాటల్లో గాయపడ్డారు.

Update: 2024-05-15 02:35 GMT

ఎన్నికల రోజు, మరుసటి రోజు జరిగిన హింసకు బాధ్యులెవరు? ఎందుకు హంస జరుగుతుంటే ఆపలేకపోయారు? పోలీసులు తగినంత మంది ఎందుకు లేరు? పోలింగ్‌ బూత్‌ల్లో ఒక్కో కానిస్టేబుల్‌ను మాత్రమే ఎందుకు పెట్టారు. తాడిపత్రిలో ఎస్పీని తరిమి కొట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? పలు చోట్ల ఎస్‌ఐలు, సీఐలు, పోలీసులకు ఎందుకు గాయాలయ్యాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

బందోబస్తులో ఈసీ విఫలం
రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో హింస ఎక్కువ జరిగింది. సమస్యాత్మక జిల్లాలు, మండలాల్లో పోలీసు బందోబస్తు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైంది. పోలింగ్‌ రోజు మధ్యాహ్నం నుంచి హింస చెలరేగింది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో పోలింగ్‌ బూతులో విధుల్లో ఉన్న మహిళ ఏజెంట్‌పై దాడి జరిగింది. గొడ్డలితో నరికారు. చావు నుంచి బయటపడింది. పలు చోట్ల ఇళ్లు, కార్లు,బైకులు తగులబెట్టారు. రాళ్లు రువ్వుకున్నారు. గొడ్డళ్లు, రాడ్లు చేతపట్టుకుని తిరుపతి మహిళా యూనిర్సిటీ ప్రాంగణంలో బీభత్సం సృష్టించారు. పలువురిపై దాడులు జరిగాయి. అయినా సాఫీగా ఎన్నికలు జరిగినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా చెప్పడం విశేషం. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌ల్లోకి కొందరు దుండగులు చొరబడి ఎన్నికల యంత్రాలను ధ్వంసం చేశారు. అయినా అక్కడ ఏమీ జరగనట్లు, యంత్రాల్లోని చిప్‌లు బాగానే ఉన్నందున రీపోలింగ్‌ అవసరం లేదని చెప్పడం, పోలింగ్‌ అధికారులను తెల్లవారు ఝాము వరకు ఎన్నికల విధుల్లోనే ఉండేలా చేయడం చూస్తే ఈసీ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయనని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.
పోలింగ్‌ బూత్‌లోపల గొడవలు జరిగితేనే ఎన్నికల కమిషన్‌కు బాధ్యత ఉన్నట్లు, లేకుంటే బాధ్యత లేనట్లు ఎన్నికల కమిషన్‌ వ్యవహరించింది. డిజిపిని, పలువురు ఎస్పీలు, డీఎస్‌పిలను మార్చడం తెలిసిన ఈసీ వారి ద్వారా సరైన సమయంలో సరైన విధంగా పనిచేయించుకోవడం చేతకాకపోవడం విశేషం.
పోలింగ్‌ ఏజెంట్స్‌లో నేరస్తులు
పోలింగ్‌ స్టేషన్స్‌లో ఏజెంట్లుగా నియమించే వారి నేరచరిత్రను పరిగణలోకి తీసుకోకపోవడం కూడా ఈ విధమైన హింసకు దారితీసింది. పోలింగ్‌ అనగానే రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌లు, ముందస్తు అరెస్ట్‌ల వంటివి జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటివేమీ జరగలేదు. దీంతో నేర స్వభావం ఉన్న వారు, గతంలో నేరాలకు పాల్పడిన వారు రెచ్చిపోయారు. వారిని అదుపు చేయడంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో విఫలమైంది. కేవలం ఏపీలో ఉన్న పోలీసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసులను పిలిపించారు. ఏపీఎస్‌పీ సిబ్బంది కూడా ఉన్నారు. అయినా హింస ఆగలేదు. ఎంతో మందికి తలలు పగిలాయి, కేతులు, కాళ్లు విరిగిన వారు ఉన్నారు. ముందస్తు బైండోవర్‌లు లేకపోవడం కూడా హింసకు ప్రత్యేక కారణమని చెప్పొచ్చు.
ఏజెంట్ల కిడ్నాప్‌తో మొదలైన ఎన్నికలు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం టి చదుం మండలం ఎర్రాటివారిపల్లె గ్రామంలో ముగ్గురు పోలింగ్‌ ఏజెంట్లు కిడ్నాప్‌ అయినట్లు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు అందింది. వెంటనే వేట ప్రారంబించిన పోలీసులు ముగ్గురు ఏజెంట్లను మదనపల్లి–పీలేరు మధ్య గుర్తించి పోలీసు వాహనంలో తీసుకొచ్చారు. ఎర్రాటివారిపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడి నుంచి మొదలైన హింసాత్మక సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డాక్టర్‌ మూలె సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
తిరుపతిలో బీభత్సం
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకరవర్గ కేంద్రంలో ఒక ఇంటిని టీడీపీ వారు కాల్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతిలోని మహిళా యూనిర్సిటీ స్ట్రాంగ్‌ రూముల వద్ద పరిశీలనకు రాగా రాడ్లు, కత్తులు, కర్రలతో యూనిర్సిటీలో వైఎస్సార్‌సీపీ రౌడీమూకలు అభ్యర్థిని కొట్టడంతో పాటు భయానక వాతారణం సృష్టించారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో షాడోపార్టీలను పెట్టి బందోబస్తు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌ ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు రక్షణ లేకుండా చేసింది. పులివర్తినాని, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వర్గాల వారు తలపడటం పలువురిని ఆశ్చర్య పరిచింది. గాయాలైన వారు ఆస్పత్రుల్లో చేరారు.
రాళ్ల వర్షం
తాడిపత్రిలో రాళ్లు రువ్వుకోవడంతో పాటు పోలీసులను సైతం రాళ్లతో తరిమి కొట్టారు. ఎప్పీని కూడా రాళ్లతో కొట్టడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ఒక వీధిలో రెండు వర్గాల వారు మొహరించి రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో కొట్టుకోవడం రణరంగాన్ని తలపించింది. అక్కడే ఉన్న జెసి ప్రభాకర్‌రెడ్డి మాటలు రెచ్చగొట్టే విధంగా ఉండటంతో ఆయన అనుచరులు పూర్తిగా రెచ్చిపోయారు. పెద్దారెడ్డి వర్గం కూడా మరింత రెచ్చిపోయింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు టీడీపీ పోలింగ్‌ ఏజెంట్స్‌ను బయటకు లాగటంతో వచ్చిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఇళ్లపై కూడా దాడులు చేసుకున్నారు. ఒకరిని ఒకరు చంపుకునేందుకు తీవ్రస్థాయిలో యత్నాలు జరిగాయి. మదనపల్లి, లైల్వేకోడూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో గొడవలు జరిగాయి. ఈ నియోజకవర్గాల్లో దొంగ ఓటర్లను పోలీసులు పట్టుకుని చర్యలు తీసుకున్నారు. కమలాపురం నియోజకవర్గంలోనూ దాడులు జరిగాయి.
మాచర్ల నియోజకవర్గంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం కారంపూడిలో జరిగిన దాడిలో కారు కాలిపోయింది. అక్కడి టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. చింతపల్లిపాడు, పేట సన్నెగుండ్ల గ్రామాల్లో దాడులు జరిగాయి. నర్సరావుపేట, సత్తెనపల్లి, గన్నవరం నియోజకవర్గాల్లోనూ రెండు వర్గాల వారు దాడులకు పాల్పడ్డారు.
గొడవలు జరిగిన ప్రతి చోటా చాలా మందికి రక్తగాయాలయ్యాయి. ఆస్పత్రుల్లో చేరారు. చాలా వరకు ఈ వ్యవహారాలను ఈసీ సీరియస్‌గా తీసుకోలేదు. తమకు ఫిర్యాదులు రాలేదని చేతులు దులుపుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.హింసకు బాధ్యులెవరు?
Tags:    

Similar News