RRR CASE|రఘురామ కృష్ణ రాజును గుండెలపై తన్నిందెవరు?
సీఐడీ మాజీ బాస్ విజయ్ పాల్ అంత దుర్మార్గంగా వ్యవహరించారా? పార్లమెంటు సభ్యుడని కూడా చూడకుండా గుండెలపై కాలితో తన్నాడా?
By : The Federal
Update: 2024-11-28 02:49 GMT
సీఐడీ మాజీ బాస్ విజయ్ పాల్ అంత దుర్మార్గంగా వ్యవహరించారా? పార్లమెంటు సభ్యుడని కూడా చూడకుండా గుండెలపై కాలితో తన్నాడా? ఛాతీపై కూర్చుని ఊపిరాడకుండా చేయాలనుకున్నారా? ఇలా సవాలక్ష ప్రశ్నలు, సందేహాలు ముసురుకున్నాయి. విజయ్ పాల్ అరెస్ట్ తో ట్రిపుల్ ఆర్ కేసు (RRR CASE) పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా విజయ్ పాల్ ను విచారించినపుడు కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన RRR CASE ఇప్పుడు గుంటూరు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది.
మాజీ ఎంపీ కె.రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. ఆయనకు ఊపిరాడకుండా చేసి ప్రాణం తీయాలన్నట్టుగా వైసీపీ హయాంలోని పోలీసు అధికారులు వ్యవహరించారని ప్రస్తుత పోలీసు అధికారులు ఆరోపించారు. రఘురామకృష్ణ రాజ కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చొని పిడిగుద్దులతో చంపేందుకు యత్నించారని ప్రధానంగా ఆరోపించారు. కస్టడీలో ఆయన్ను తీవ్రంగా కొట్టినట్లుగా గుర్తించారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న రావెల విజయ్‌పాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు నవంబర్ 27 బుధవారం గుంటూరులోని ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రిపోర్టు సమర్పించారు.
రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..
‘రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన వారిలో ప్రధాన వ్యక్తి విజయ్‌పాలే. ఆయన్ను కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించాలి. దీని వెనకున్న భారీ కుట్రను ఛేదించాలి. మాస్టర్ మైండ్‌ను వెలికితీయాలి. ఆయన సాక్షుల్ని ప్రభావితం, ఆధారాల్ని ధ్వంసం చేసే అవకాశముంది’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
రఘురామకృష్ణరాజును 2021 మే 14న మధ్యాహ్నం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. రాత్రి 8.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయన శరీరంపై అప్పటికి ఎలాంటి గాయాలు లేవు. రఘురామకృష్ణరాజు మెట్లు ఎక్కి సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలోని మొదటి అంతస్తుకు వెళ్లారు. ఆ రాత్రంతా ఆయన్ను అక్కడే గదిలో నిర్బంధించారు. రాత్రి 10.30- 11 గంటల మధ్య ముఖానికి రుమాళ్లు కట్టుకున్న నలుగురు పోలీసులు నంబరు ప్లేట్లు లేని కారులో వచ్చారు.
రఘురామకృష్ణరాజు ఉన్న గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విజయ్‌పాల్‌తో పాటు మరికొందరు ఉన్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల సిబ్బందిని విజయ్‌పాల్ కిందకు పంపించేశారు. బయటి నుంచి వచ్చిన నలుగురు లోపలికి వెళ్లిన తర్వాత రాత్రి 11.30 గంటల దాకా హింసించినట్టు ప్రస్తుత రిమాండ్ రిపోర్టులో రాశారు. రాజు ఉన్న గది నుంచి ఏడుపులు వినిపించాయని సీసీ కెమెరాల సిబ్బంది చెప్పినట్టు అందులో రాసి ఉంి. ఈ మేరకు వారు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టి చంపాలని చూసినట్టు రఘరామకృష్ణ రాజు ఆనాడే ఆరోపించినా ఎవరూ పట్టించుకోలేదు. సీసీ కెమెరాల వ్యవహారాలను చూస్తున్న సిబ్బందిని విజయ్‌పాల్ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి బెదిరించారు. సీఐడీ విభాగం అధిపతి పీవీ సునీల్‌కుమార్ ముందే ఇదంతా జరిగినా ఆయన ఆపే ప్రయత్నం చేయలేదు.
‘రఘురామకృష్ణరాజును కొట్టిన విషయం ఎవరైనా బయటకు చెప్పినా, ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో వెల్లడించినా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సునీల్‌కుమార్ కూడా వారిని బెదిరించారు.
RRRను ఆవేళ ఎందుకు అరెస్ట్ చేశారంటే..
2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణ రాజు వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై 2021 మే 14న ఉదయం 9 గంటలకు సీఐడీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది. కానీ ఆయన్ను అరెస్టు చేసేందుకు ఉదయం 7 గంటలకే విజయ్‌పాల్ నేతృత్వంలోని సీఐడీ బృందాలు హైదరాబాద్‌కు రుకున్నాయని, కేసు రిజిస్టర్ కాక మునుపే పోలీసులు హైదరాబాద్ చేరి రఘురామ కృష్ణ రాజును అరెస్ట్ చేయాలనుకోవడం వెనుక కుట్ర ఉందని ప్రస్తుత విజయపాల్ రిమాండ్ రిపోర్టులో రాశారు.
నాటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. 2021 మే 13న ఆయన నివేదిక సమర్పించారు. 14వ తేదీన ఆయన సంతకం చేసినట్టు ఉంది.
రఘురామకృష్ణరాజు నేర అంగీకార పత్రం (Confection statement) మధ్యవర్తుల సమక్షంలో రూపొందించలేదు. అన్ని ముందే రాసి, మధ్యవర్తులుగా ఇద్దరు వీఆర్వోల నుంచి సంతకాలు మాత్రమే తీసుకున్నారు. తాము వాటిపై సంతకాలు చేసిన సమయంలో అక్కడ విజయ్‌పాల్ కానీ, రఘురామ కానీ లేరంటూ ఆ వీఆర్వోలు తాజాగా వాంగ్మూలమిచ్చారు.
పీఎస్ఆర్ కూడా ఉన్నారా?
గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో తనను నిర్బంధించిన రోజు రాత్రి 11.30 గంటలకు అక్కడికి అప్పటి సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు వచ్చినట్లు రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘నన్ను కదలనీయకుండా నా కాళ్లను తాళ్లతో కట్టేశారు. రబ్బరు బెల్టులు, లాఠీలు, ఇతర ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. దాదాపు అరగంటపాటు ఐదుసార్లు నన్ను చిత్రహింసలకు గురిచేశారు. నీళ్లు తాగటానికి, మందులు వేసుకోవటానికి కూడా అవకాశమివ్వలేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తావా? అంటూ నన్ను దుర్భాషలాడారు. చంపేస్తామని బెదిరించారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న నా గుండెలపై కూర్చొని నన్ను చంపేసి, గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించాలనుకున్నారు. నా ఫోన్ తీసుకున్నారు. దాని పాస్‌వర్డ్ చెప్పేవరకూ కొడుతూనే ఉన్నారు. మంచంపైన పడుకోబెట్టి కొట్టటంతో మంచం విరిగిపోయింది. మర్నాడు నన్ను గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్ అక్కడికి వచ్చి గాయాలున్నట్లుగా నివేదిక ఇవ్వొద్దని ఆసుపత్రి వైద్యుల్ని బెదిరించారు’ అని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు.
గాయలు బయటపడకుండా రాశారు..
రఘురామకృష్ణరాజును కోర్టులో హాజరుపరచటానికి ముందు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బేతం రాజేంద్రను సీఐడీ కార్యాలయానికి పిలిపించారు. విజయ్‌పాల్‌తో పాటు, గుంటూరు జీజీహెచ్ అప్పటి సూపరింటిండెంట్ డాక్టర్ ప్రభావతి... రాజేంద్రపై ఒత్తిడి తీసుకొచ్చి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌పై సంతకం చేయించుకున్నారు. తద్వారా గాయాల వివరాలు బయటపడకుండా చేయాలనుకున్నారు.
జీజీహెచ్‌లో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయన రెండు పాదాలు కమిలిపోయి ఉన్నట్లు కేస్ షీట్‌లో రాశారు. మెడికల్ బోర్డు మాత్రం ఆ వాస్తవాలన్నింటినీ కప్పిపుచ్చుతూ రఘురామ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, బయటకు కనిపించే గాయాలేవీ లేవని, కొట్టటం వల్ల ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని నివేదిక సమర్పించింది.
రఘురామకు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో జైల్లోకి ప్రవేశించే ముందు అక్కడి వైద్యాధికారి రఘురామయ్య పరీక్షించి ఆయన కాలి కింద చర్మం గీసుకుపోయి ఉందని, గాయాలైనట్లు గుర్తించారు. సికింద్రాబాద్ సైనికాసుపత్రి కూడా రఘురామకు గాయాలున్నాయని తేల్చింది.
సికింద్రాబాద్‌లోని సైనికాసుపత్రి అందించిన వైద్య నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు.. రఘురామకృష్ణరాజుకు సీఐడీ కస్టడీలో ఇల్‌ట్రీట్‌మెంట్ జరిగిందని అభిప్రాయపడింది.
మొరాయిస్తున్న విజయ్ పాల్..
పోలీసు నిఘా విభాగం మాజీ అధికారి విజయ్‌పాల్ మాత్రం తాను మొదట్లో ఏమి చెప్పారో ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మరచిపోయా అనే మూడు మాటలే ఆయన నోటి నుంచి వస్తున్నట్టు తెలిసింది. దర్యాప్తు సంస్థను పక్కదారి పట్టించేలా సమాధానాలిచ్చినట్టు విచారణ అధికారులు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్. ఆయన్ను విజయ్ పాల్ నడిపించేవారని టీడీపీ నాయకులు ఆరోపించేవారు. పదవీవిరమణ చేసిన తర్వాత కూడా ఆయన తన పదవిలో కొనసాగారు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారి (ఐఓ)గా వ్యవహరించారు. రఘురామను విచారించే సమయంలో కేవలం ఇన్‌స్పెక్టర్ గా ఉన్న విజయ్‌పాల్ ఆ తర్వాత అదనపు ఎస్పీ అయ్యారు.
విజయ్‌పాల్ అంటే సామాన్యులకే కాక పోలీసుబాసులకు సైతం చెమట్లు పట్టేవి. రఘురామ ఫిర్యాదు మేరకు ఆయనకు తొలుత నోటీసులిచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారు. దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఏఆర్ దామోదర్‌ను ఐఓగా నియమించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన ఇద్దరు న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ తన తరఫున వాదనలు వినిపించారు. పదవీవిరమణ చేసిన ఓ పోలీసు అధికారి.. అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవడం సాధ్యమేనా? అనే విమర్శలూ ఉన్నాయి.
విజయ్‌పాల్ ఎంత దురుసుగా ప్రవర్తించేవారో అప్పట్లో సీఐడీలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు. ఆయన్ను ఎవరైనా కలవాలంటే మూడు, నాలుగు అంచెల్లో అనుమతి పొందాల్సిందే. మాట మహాకఠినంగా, దురుసుగా ఉండేది. ఏదైనా కేసుల్లో ఎవర్నైనా అరెస్టు చేసి.. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టేటపుడు మీడియా వాళ్లు కవరేజికి వెళ్తే.. ‘‘మీరెవర్రా ఇక్కడికి రావడానికి? ఇక్కడ మీకేం పని?’’ అంటూ అత్యంత దురుసుగా మాట్లాడేవారు.