ఆ నియోజకవర్గంలో గెలుపు ఒక్కసారే...

ఆ నియోజకవర్గం నుంచి హేమాహేమీలు గెలిచారు… కానీ ఒక్కసారే… ఇప్పటివరకు రెండోసారి నిలిచి గెలిచిన దాఖలాలు లేవు... ఈసారైనా ఈ రికార్డు బ్రేక్ అవుతుందా....?;

Update: 2024-03-18 08:07 GMT
వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్


(తంగేటి నానాజీ,)


విశాఖపట్నం: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తుంటారు. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గ ఫలితాలపై ఆసక్తి నెలకొంటుంది. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. ఎంతటి వారైనాకానీ ఇక్కడ నుంచి ఒక్కసారే గెలుపొందారు. నాలుగున్నర దశాబ్దాల నుంచి ఈ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుకు భిన్నంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయా అన్న చర్చ ప్రస్తుతం విశాఖ జిల్లాలో జోరుగా సాగుతోంది. అందుకు కారణం ప్రధాన పోటీదారులీద్దరూ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి పోటీ పడుతున్న వారే... గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా చేసిన పంచకర్ల రమేష్ బాబు ఈసారి ఎన్నికల బరిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా దిగుతున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు అధికార వైసీపీ తరఫున మళ్లీ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా పెందుర్తి నియోజకవర్గంలో రెండోసారి గెలిచిన అభ్యర్థిగా చరిత్ర సృష్టిస్తారు.


ఆది నుంచి ఇదే వరస...


పెందుర్తి నియోజకవర్గం 1978లో ఏర్పడింది. నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా గుడివాడ అప్పన్న (ప్రస్తుత రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తాతయ్య) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తర్వాత 1981లో జరిగిన ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ద్రోణం రాజు సత్యనారాయణ ఎన్నిక కాగా...1983 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెతకంశెట్టి అప్పల నరసింహం, 1985లో టీడీపీ అభ్యర్థి ఆళ్ల రామచంద్రరావు, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గురునాధరావు, 1994లో సీపీఐ అభ్యర్థి మానం ఆంజనేయులు,1999లో ప్రస్తుత విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు) తెలుగుదేశం పార్టీ నుంచి, 2004లో కాంగ్రెస్ నుంచి తిప్పల గురుమూర్తి రెడ్డి.. పెందుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఏ ఒక్కరూ రెండోసారి గెలుపొందలేదు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన పెందుర్తి నియోజకవర్గానికి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ నుంచి, గత ఎన్నికల్లో వైసీపీ తరఫున అన్నం రెడ్డి, అదీప్ రాజు గెలుపొందారు. వీరిలో ఏ ఒక్కరూ రెండోసారి గెలిచింది లేదు.


 



చెరో ఐదుసార్లు...


పెందుర్తి నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదుసార్లు గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ నేరుగా నాలుగు సార్లు గెలుపొందగా... పీఆర్‌పీ నుంచి గెలుపొందిన అభ్యర్థి కాంగ్రెస్‌లో కలవడంతో ఐదు సార్లు అయింది. కాంగ్రెస్ నుంచి గుడివాడ అప్పన్న, ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాథరావు, తిప్పల గురుమూర్తి రెడ్డి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 2009లో గెలుపొందిన పీఆర్‌పీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు.. తమ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగారు. తెలుగుదేశం పార్టీ నుంచి పెతకంశెట్టి అప్పల నరసింహం, ఆళ్ల రామచంద్రరావు, పెతకంశెట్టి గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, సీపీఐ, టీడీపీ పొత్తులో భాగంగా మానం ఆంజనేయులు గెలుపొందారు. దీంతో పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి కూడా ఐదు సార్లు గెలుపొందింది.


వరమాల ఎవరిని వరిస్తుందో....


సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పెందుర్తి నియోజకవర్గంలో అధికార వైసీపీ తరఫున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ తన గెలుపు కోసం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. కార్యకర్తలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో భారీ ర్యాలీలు తీస్తున్నారు. అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు కూడా నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలతో పాటు దోస్త్ పార్టీల కార్యకర్తలను కూడా కలుపుకునే పనిలో పడ్డారు. అయితే ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలిచిన చరిత్ర లేకపోవడంతో... వీరిద్దరిలో ఎవరు రెండోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు ఎంతటివారినైనా ఒక్కసారే ఆదరించిన పెందుర్తి ఓటర్లు ఈసారి తీర్పు ఎలా ఇవ్వబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా ఎన్నికల తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.



Tags:    

Similar News