ఈవిఎంల ధ్వంసంలో ఎవరి పాత్ర ఎంత?

ఈవిఎంల ధ్వంసంలో పార్టీల పాత్ర ఎంత ఉందో పోలీసులు, ఎన్నికల సంఘం పాత్ర కూడా అంతే ఉందని చెప్పొచ్చు. సంఘటన జరిగిన వారం రోజల తర్వాత కేసులేమిటనేది ప్రశ్న.

Byline :  The Federal
Update: 2024-05-25 09:56 GMT

మే 13న ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలింగ్‌ స్టేషన్‌లలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను బయటకు ఎందుకు వెల్లడించలేదనేది తాజాగా చర్చనీయాంశంగా మారింది. జీరో వైలెన్స్‌ ప్రధాన లక్ష్యంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్లో నిక్షిప్తమైన హింసాత్మక ఘటనల వివరాలను వెలికి తీసి, ఆయా సంఘటనల వివరాలను, అటు మీడియాకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల కమిషన్‌ ఎందుకు వెల్లడించలేదనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

ఇప్పటికీ వివరాలు ఎందుకు వెల్లడించలేదు?
రాష్ట్రంలో ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఎలక్షన్‌ కమిషన్‌ సీపీ కెమేరాలను ఏర్పాటు చేసింది. పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, ఒక వేళ అవాంఛనీయ సంఘటల చోటు చేసుకుంటే వెంటనే స్పందించి, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి, ఓటర్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం వెబ్‌ క్యాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ సరళిని మోనటరింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది అధికారులు, సిబ్బందిని నిరంతరాయంగా మోనటరింగ్‌ చేయడం కోసం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ దృశ్యాలు వీరికి లైవ్‌లో తెలిసి పోతుంది. పోలింగ్‌ పూర్తి అయిన తర్వాత సీసీ కెమేరాల్లో రికార్డు అయిన వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. కానీ ఆ వివరాలను ప్రజలకు వెల్లడించ లేదు. అదే పలు అనుమానాలకు తావిచ్చినటై్టందనే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
ఎక్కడెక్కడ ఈవీఎంలు పగులగొట్టారు
రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల పోలింగ్‌ స్టేషన్‌లలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా పార్టీల నేతలు పోలీంగ్‌ స్టేషన్‌లలోకి వెళ్లి ఈవీఎంలతో పాటు వివిధ పరికరాలను ధ్వంసం చేశారు. మాచర్ల నియోజక వర్గంలోని కారంపూడి మండలంతో పాటు దుర్గి, మాచర్ల మండలాల్లో ఈవీఎంలు ధ్వసం అయ్యాయి. నేరుగా పార్టీల నాయకులు దౌర్జన్య కాండకు దిగారు. ఇందులో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నేరుగా వెళ్లి ఈవీఎంలను ముక్కలు చేస్తున్నా, పోలీసులు పట్డీ పట్టనట్లుగా వ్యవహరించారు. మాచర్ల నియోజక వర్గంలో 8 ఈవీఎంలతో పాటు, కడప జిల్లా కోడూరు నియోజక వర్గంలోని పుల్లంపేట మండలం, దలాయిపల్లె గ్రామంలో ఈవీఎంలు ధ్వసం చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లు వెంకటేశ్వరెడ్డి అలియాస్‌ రాజారెడ్డి ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రకారం జిల్లా దర్శి నియోజక వర్గ కేంద్రంలో 132 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వసం చేశారు. మూడు రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన వీసీ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదైంది.
ఈవీఎంలను ధ్వసం చేసిన కేసుల్లో 13వ తేదీన ఏ ఒక్క చోటా కేసు నమోదు కాకపోవడం ఆశ్చర్యాన్నిక కలిగిస్తోంది. మాచర్ల నియోజక వర్గం పాల్వాయి రైల్వే గేట్‌ పోలింగ్‌ స్టేషన్‌లోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దూసుకొని వెళ్లి ఈవీఎంను నేలకేసి పగుల కొట్టిన వీడియో 15వ తేదీ బయటకు రావడంతో ఈవీఎంల ధ్వంసం చేసిన అన్ని చోట్లా హడావుడిగా కేసులు నమోదు చేశారు. 13వ తేదీతో 15వ తేదీన కేసులు నమోదు చేయడం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద కనీసం ఇద్దరికి తగ్గకుండా పోలీసులు ఉంటారు. పైగా పర్యవేక్షణ కోసం సిఐ స్థాయి అధికారి ఉంటారు. ఆ సిఐ తన పరిధిలోని పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఎప్పుడు నిఘా ఉంచుతారు. పోలింగ్‌ స్టేషన్‌లో సంఘటన జరిగిన విషయాన్ని సెక్యురిటీ సిబ్బంది అధికారులకు వివరించలేదా? తెలిపినా అధికారులు పట్టించుకోలేదా? పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు కాబట్టి డీజీపీ సైతం పట్టీ పట్టనట్లు వ్యవహరించారా? ఎన్నికల కమిషనర్‌ డీజీపీ రిపోర్టు వరకే పరిమితమయ్యారా? అనేవి ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలు.
ఎమ్మెల్యే వీడియో బయటకు రావడానికి కారకులెవరు?
10 చోట్ల ఈవీఎంలు ధ్వసం జరిగితే మూడో రోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశారు. దీంతో ఇది దావానలంలా దేశమంతా వ్యాపించింది. ఎన్నికలు జరిగి 13 రోజులు పూర్తి అయింది. ఇంత వరకు ఈవీఎంలను ధ్వసం చేసిన అంశంలో ఎంత మందిపై కేసులు నమోదు చేశారు, ఎంత మందిని అరెస్టు చేశారు, వారిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత మంది, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎంత మంది అనే వివరాలను ఆయా జిల్లాల ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, డీజీపీ కానీ, ఎన్నికల కమిషనర్‌ కానీ ప్రకటించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తప్పు జరిగినప్పుడు రీపోలింగ్‌ ఎందుకు పెట్ట కూడదు?
ఈవీఎంలు ధ్వసం అయ్యాయంటేనే ఆ పోలింగ్‌ బూత్‌లో ఏదో మతలబు జరిగిందనేది వాస్తవం. రిగ్గింగు జరిగి ఉండొచ్చు, అధికారులతో కొంత మంది నాయకులు కొల్యూడై తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకొని ఉండొచ్చు, అక్కడ ఏదో ఒక పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టే ఈవీఎంల ధ్వంసం జరిగింది. ఈవీఎంలను పగులగొట్టే వరకు జరిగిన పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, ఈవీఎంలో ఉన్న చిప్‌లు సురక్షితంగా ఉన్నందు వల్ల పగిలిపోయిన మిషన్‌ల స్థానంలో ప్రత్యామ్నాయంగా నిల్వ ఉంచిన మిషన్‌లను తెలిపించి రెండు, మూడు గంటల ఆలస్యంగా పోలింగ్‌ నిర్వహించామని ఎలక్షన్‌ కమిషనర్‌ చెప్పి చేతులు దులుపుకున్నారు.
వ్యవస్థలు లొంగిపోయాయి
ఈ ఎన్నికల్లో వ్యవస్థలు లొంగిపోయాయి. చట్టాలు పెద్దలకు ఒక విధంగా, సామాన్యులకు ఒక విధంగా ఉపయోగ పడుతున్నాయి. వీడియోలు బయటకు వచ్చే వరకు పోలీసులు కేసులు పెట్టలేదంటే వ్యవస్థలు ఎలా పనిచేశాయో చెప్పొచ్చు. ఎన్నికలకు వారం రోజుల ముందు డిజిపిని మార్చారు. మరి చీఫ్‌ సెక్రటరీని ఎందుకు మార్చలేదు. మార్చకపోవడం వల్ల కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఉండొచ్చని పొలిటికల్‌ అనలిస్ట్‌ టి లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆయన కోరారు.
Tags:    

Similar News