అన్నం కుండ మన ఆంధ్ర ప్రదేశ్..
ఆంధ్రప్రదేశ్‌ను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అనేవారు. ఇప్పుడు మన దేశ రైస్ బౌల్‌గా ఏ రాష్ట్రం ఉందో తెలుసా..
Update: 2024-04-15 04:00 GMT
ఒక్క రాష్ట్రం దేశం మొత్తానికి అన్నం పెట్టగలదా? అది అసలు సాధ్యమయ్యే పనేనా? అంటే సాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలం పాటు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే అన్నం పెట్టింది. భారతదేశంలో పండే వరి సాగులో అధిక శాతం ఆంధ్రప్రదేశ్ అందించేది. ఆంధ్రప్రదేశ్‌లో పండే పంటల్లో 77శాతం వరి పంటలే ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని ఇంగ్లీషు వారు భారతదేశ ధాన్య భాండాగారం..‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. ఇప్పటికి కూడా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో వరిని సాగు చేసే రాష్ట్రాల్లో ఆంధ్ర టాప్‌లో ఉంటుంది. 140 కోట్ల మందిలో ఆంధ్రప్రదేశ్ కనీసం 70కోట్ల మందికి అన్నం పెడుతుందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
ఆంధ్రలో వరిసాగు
ఆంధ్రలో కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర, పెన్నా, తుంగభద్ర వంటి మరెన్నో నదులు పారుతూ రాష్ట్రంలోని నేలను అత్యంత సారవంతంగా మారుస్తున్నాయి. దానికి తోడు వ్యవసాయానికి అనుకూలించే వాతావరణం కూడా ఆంధ్రలో వరి సాగుకు ఊతమిస్తోంది. పంచభూతాలు అందిస్తున్న సహకారంతో ఆంధ్రలో వ్యవసాయం అద్భుతంగా ఉంది. ఆంధ్రలో ఎక్కువగా వరి సాగు జరిగేది. అత్యధికంగా వరి సాగు చేయడంతో దేశం మొత్తానికి ఆంధ్ర ఒక్కటే బియ్యాన్ని సరఫరా చేసేది. ఆయా రాష్ట్రాల్లో అత్యల్ప వరిసాగు కావడమే ఈ ఎగుమతులకు ప్రధాన కారణం. తాజా సమాచారం ప్రకారం.. ‘‘భారత్.. 18 మిలియన్ టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసింది. వీటిలో 7 మిలియన్ టన్నుల బియ్యం, 8 మిలియన్ టన్నుల బాయిల్డ్ బియ్యం, 3 మిలియన్ టన్నుల నూకలు(బ్రోకెన్ రైస్) ఉన్నాయి. వీటిలో నుంచి బాయిల్డ్ రైస్‌లో 20-30శాతం, 1 మిలియన్ టన్నుల నూకలు ఆంధ్ర నుంచి ఎగుమతి అయ్యాయి’’అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం తగ్గుతున్నట్లు సమాచారం.
ఇప్పుడు ఆంధ్ర వరి పరిస్థితి ఏంటి..
భారతదేశ ధాన్య భాండాగార గా వెలిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం దేశంలో అత్యధిక వరిని సాగు చేసే రాష్ట్రంగా లేదు. ప్రస్తుతం భారత్‌దేశంలో అత్యధిక వరిని సాగు చేస్తున్న రాష్ట్రం.. పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో సుమారు ఏడాదికి 146.05 లక్షల టన్నుల వరి సాగు జరుగుతోంది. అంటే హెక్టార్ పొలానికి 2600 కిలోల బియ్యం దిగుబడి వస్తుంది. రెండో స్థానంలో ఏడాదికి 140.22 లక్షల టన్నుల వరి సాగుతో ఉత్తర్‌ప్రదేశ్ నిలిచింది. ఏడాదికి 128.95 లక్షల టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. మన తర్వాత 105.42 లక్షల టన్నుల వరి సాగుతో పంజాబ్ నాలుగో స్థానంలో, 74.58 లక్షల టన్నుల సాగుతో తమిళనాడు ఐదో స్థానంలో ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరోసారి భారతదేశ ధాన్య భాండాగారంగా మారుతుందేమో చూడాలి. అయితే ఆ సత్తా ఆంధ్రకు ఇప్పటికీ ఉందని రైతులు, అధికారులు కూడా విశ్వసిస్తున్నారు. మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా అడుగులు వేస్తాయేమో చూడాలి.