చిత్తూరు జిల్లాలో బీజేపీకి ఒక్క సీటూ ఎందుకివ్వలేదు?

జిల్లాలో అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పూర్వ వైభవం కోసం టీడీపీ కూటమి, పట్టు నిలుపుకునేందుకు వేఎస్‌ఆర్‌సీపీ పోరాటం ప్రారంభమైంది.

Update: 2024-03-16 08:34 GMT


(ఎస్. ఎస్. వి. భాస్కర్ రావ్)



తిరుపతి: చిత్తూరు జిల్లాలో బ్యాలెట్ పోరుకు అభ్యర్థులు సంసిద్ధం అయ్యారు. జిల్లాలోని 14 నియోజకవర్గాలకు వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు ఖరారు అయ్యారు. నాలుగు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు అసంతృప్తితో బుసలు కొడుతున్నారు. అందులో ప్రధానంగా తిరుపతి నియోజకవర్గం ఉంది.


బీజేపీకి మూసుకున్న తలుపులు


మూడు పార్టీల కూటమిలో ఉన్న బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం లేకుండా తలుపులు మూసుకుపోయాయి. తంబళ్లపల్లె నుంచి పోటీ చేయాలని ఆశించిన బీజేపీ సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డికి చుక్కెదురైందని చెప్పవచ్చు. ఏదన్నా అద్భుతం జరిగితే మినహా అవకాశం లేదని అంతా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులో చావు దెబ్బ తగిలింది. 14 నియోజకవర్గాల్లో కుప్పం మినహా, 13 స్థానాలతో పాటు చిత్తూరు, తిరుపతి పార్లమెంటు సీట్లలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇందులో చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచి ప్రత్యర్థిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకోవడంలో సఫలమయ్యారు.


గత ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించిన సానుభూతితోపాటు నవరత్న పథకాలతో లాభించింది. జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నా.. అధిక స్థానాలను కోల్పోయిన పరిస్థితిని చంద్రబాబు సమీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో బలమైన, సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించాలని అంచనా వేస్తున్నారు. ఆ పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయడానికి మొదటి జాబితాలోనే చంద్రబాబు తన పేరు ప్రకటించుకున్నారు. ఈయనపై వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కృష్ణ రాఘవ చైతన్య భరత్‌ పోటీ చేస్తున్నారు. భరత్ బరువు బాధ్యతలన్నింటినీ యథావిధిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు.



చిత్తూరులో కలిసొచ్చిన వేళ


చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ నాయుడును కొత్తగా తెరమీదకి తీసుకువచ్చారు. ఆయాచితంగా ఈయనకు అదృష్టం కలిసి వచ్చిందని భావిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్ర రెడ్డి ( సీకే బాబు ), టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మద్దతుగా నిలిచారు. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి తిరుగుబాటు చేసి జనసేనలో చేరిపోయారు. ఆయన మద్దతు కూడా ఇప్పుడు టీడీపీకి కలిసి వచ్చింది.



 


పూతల ' పట్టు ఎవరిదో..'



ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా దళిత జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ రంగంలోకి దిగారు. యథావిధిగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీ సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2014లో వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేసిన ఈయనకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పనితీరు బాగా లేదని మళ్లీ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్‌ను తెరమీదకు తీసుకువచ్చారు.


పలమనేరులో..


పలమనేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఎన్ అమర్‌నాథరెడ్డి.. టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడ మళ్లీ తలపడుతున్నారు.


పుంగనూరులో.. ముగ్గురు చంద్రులు..



పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా చల్ల రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కూడా పోటీ చేస్తానంటున్నారు. గడచిన కొన్నేళ్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రామచంద్ర యాదవ్ ఒంటరి పోరు సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్ర యాదవ్ 15వేల ఓట్లు సాధించారు.


మదనపల్లెలో రసవత్తరం


చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా ( జహా )ను అందరూ ఊహించినట్లుగానే రంగంలోకి దించారు. గతంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి జగన్ తమ అభ్యర్థిని మార్చే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్‌కు పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఒక నాయకుడి పోటు ఉండే అవకాశం బాగానే ఉందన్న అభిప్రాయాలను ఆ ప్రాంత నాయకులు వ్యక్తం చేస్తున్నారు.




అసమ్మతి.. అసంతృప్తులు


శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈయనపై వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తలపడనున్నారు. శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆశ పడి భంగపడిన బలిజ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, జనసేన పార్టీ నాయకురాలు వినూత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై దాసర్లపల్లి జైచంద్రారెడ్డిని ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ ఎమ్మెల్యే జీ శంకర్ వర్గం కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంది. తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని ఆశించిన బీజేపీకి చుక్కెదురైంది. దీనివల్ల ఇక్కడే బీజేపీ సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డికి పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. ఏదన్నా అద్భుతం జరిగితే మినహా అవకాశం లేదని అక్కడి వారు అంటున్నారు.


తిరుపతిలో.. ' ఆరని' మంటలు


తిరుపతి శాసనసభ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ నాయకులు పట్టు పట్టి సాధించుకున్నారు. స్థానిక నాయకులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను జనసేన చీఫ్ పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరని శ్రీనివాసులుకు టికెట్ దక్కని స్థితిలో వైఎస్ఆర్‌సీపీపై తిరుగుబాటు చేసి జనసేనలో చేరిన ఆయనకు తిరుపతిలో అవకాశం కల్పించారు. శుక్రవారం నుంచి ఆయన ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దీనిపై టీడీపీ, జనసేన నాయకులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ రెడ్డి ప్రచారంలో చురుగ్గా ఉన్నారు


చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రభుత్వ విప్, సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వెళ్లారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తుండగా ఆయనపై గత ఎన్నికల్లో పోటీ పడి ఓడిన వెంకట మణి ప్రసాద్ ( పులివర్తి నాని) మరోసారి టీడీపీ నుంచి అదృష్టం పరీక్షించుకోనున్నారు. సత్యవేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుగుబాటు చేసి, టీడీపీలోకి వెళ్లి టికెట్ దక్కించుకున్నారు. ఈయనపై మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ తనయుడిని వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. డిప్యూటీ సీఎం కే నారాయణ స్వామిని తప్పించి, ఆయన కుమార్తె కృపారాణికి వైఎస్ఆర్‌సీపీ అవకాశం కల్పించింది.




 

ఇక్కడ కుటుంబాల మధ్య పోరాటం


దశాబ్దాల కాలంగా పీలేరు నియోజకవర్గంలో పార్టీ కంటే నల్లారి- చింతల కుటుంబాల మధ్య పోరాటమే ఉంటుంది. పీలేరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి మళ్లీ ఇక్కడి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చిత్తూరు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ ఎంపీ ఎన్ రెడ్డప్ప మళ్లీ పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి దుగ్గిమల్ల ప్రసాదరావును పోటీకి నిలుపుతున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. వారింకా ఏమి తేల్చుకోలేదు.

రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మళ్లీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తారని భావిస్తున్నారు. టీడీపీ కూటమి ఇంకా ఈ స్థానంపై ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. రాయచోటికి చెందిన మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడు కుమారుడు సుగవాసి బాల సుబ్రహ్మణ్యం పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయలసీమలోని మిగతా జిల్లాలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో అన్ని పార్టీలకు అభ్యర్థులు ఖరారు అయిపోయారు. ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈసారి ఏ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుంది అనేది తేలేది పోలింగ్ తర్వాతే.

Tags:    

Similar News