రఘరామరాజుకు బీజేపీ చుక్కలు చూపించిందెందుకు?
అనుకున్నదొక్కటి.. అయినదtక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.. ఈ పాట రెబల్ స్టార్ రఘురామకృష్ణంరాజు బుర్ర చుట్టూ గిర్రుమని తిరుగుతుందట... ఎందుకో...?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: రఘురామకృష్ణంరాజు... రాష్ట్రంలో ఈ వ్యక్తి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గెలిచిన పార్టీకే ఎదురు తిరిగిన ఎంపీ... పార్టీ అధినేతనే టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తి... ఆ నోటి దురుసుతోనే జైలుకెళ్ళిన వ్యక్తి కూడా ఈయనే. వైరి వర్గాలతో చేతులు కలిపి సీట్ ఇచ్చి గెలిపించిన వైసీపీకే చుక్కలు చూపించిన వ్యక్తికి తాజాగా బిజెపి మొండిచేయి చూపింది. సీటు దక్కుతుందని ఆశించి భంగపడిన వ్యక్తి కూడా ఈయనే... సీటు నీదే అని ఊరించిన కమలం పార్టీ... చివరకు మొండి చేయి చూపించి మరో నేతకు ఆ సీటు ఖరారు చేసింది. భారతీయ జనతా పార్టీ నిన్న ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో ఈ విషయం తేటతెల్లమైంది. చేసేది ఏమీ లేక తెల్లబోవడం రఘురామరాజు(R.R.R) వంతైంది.
రాజకీయ నేపథ్యం...
రఘురామకృష్ణంరాజు 2012లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తనకు సీటు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. అదే ఏడాదిలో బిజెపిలో చేరారు. తర్వాత 2018లో బిజెపిని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు తిరిగి 2019లో మళ్లీ వైసీపీలో చేరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. సమీప టిడిపి అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుపై 31 వేల మెజారిటీతో గెలుపొందారు. రాజు వైసీపీ ఎంపీగా ఉంటూనే పార్టీని, అధినేత జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగానే విమర్శించారు. అప్పటి నుంచి పలు ఆరోపణలు చేస్తూ వైసీపీకి రెబల్‌గా తయారయ్యారు. తిరిగి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీటు కోసం పార్టీల చుట్టూ తిరిగారు. చివరకు బిజెపి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు.
ప్రగల్భాలకు పోయిన ట్రిపుల్ 'R'
'నరసాపురం ఎంపీగా నేను ఈసారి ఎన్నికల్లో పోటీచేయబోయేది గ్యారంటీ. మళ్లీ నేనే గెలుస్తా.. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననేది మాత్రం తర్వాత చెప్తాను. నేను మాత్రం కచ్చితంగా ఎన్డీయే (విపక్ష) కూటమి తరఫునే పోటీచేస్తున్నా.. టీడీపీ-బీజేపీ-జనసేనలో ఏ పార్టీ తరఫున అనేది తర్వాత చెప్తా' ఇటీవల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నోటి వెంట వచ్చిన డైలాగులు. కనీసం ఏ పార్టీ సభ్యత్వం తీసుకోకుండా.. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకోకుండా... ఎవరు సీటు ఇస్తే అటు దూకుదామా అని ఎదురుచూశారు. రఘురామరాజుకు పార్టీల నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు.
పాత మిత్రుడు బాబు కాదంటే... జనసేన పవన్ వద్దన్నారు... ఇక కమలం పార్టీ( భారతీయ జనతా పార్టీ) సినిమా చూపించింది. అది కూడా 70 ఎంఎంలో. కనీసం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోకుండా కూటమి నుంచి అదీ బిజెపి నుంచి పోటీ చేస్తున్నా అంటూ రాజు మితిమీరి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం కౌంటర్లు వెల్లెవెత్తున్నాయి. అసలు పార్టీల ప్రాధన్యాలను ఖాతరు చేయకుండా.. పార్టీల నాయకులతో తాను లోపాయికారిగా మెయింటైన్ చేసే సంబంధాలే పనిచేస్తాయని, తనకు టికెట్ వచ్చేలా చేస్తాయని భావించిన రఘురామకృష్ణ రాజుకు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి.
వివాదాలతో సావాసం...
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆది నుండి వివాదాలతోనే సావాసం చేశారు. పలు ఆరోపణలు, కేసులను ఎదుర్కొన్నారు. ఇండ్ భారత్ పవర్ జనకాం లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నాయన 2021లో సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేసింది. అదే ఏడాది మే 14న సిఐడి నమోదు చేసిన రాజ ద్రోహం కేసులో విచారణను ఎదుర్కొన్నారు. మతసామరస్యానికి భంగం, జగన్ ప్రభుత్వంపై దాడి నేపథ్యంలో ఈ కేసు నమోదయింది. అయినప్పటికీ రఘురామరాజు జగన్ ప్రభుత్వంపై దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.
అంతా అయిపోయింది...
టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించిన 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చోటు దక్కలేదు. నరసాపురం లోక్‌సభ స్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ కేటాయించారు. బిజెపి రఘురామకృష్ణ రాజు పేరును ఆది నుంచి పరిగణనలోకి తీసుకోలేదన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ జాబితాలో అనూహ్యంగా ముగ్గురు చోటు దక్కించుకోగా, టికెట్ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాసే మిగిలింది.
బిజెపి పోటీ చేస్తున్న ఆరు స్థానాల్లో.. రాజమండ్రి నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, తిరుపతి నుంచి (వైసీపీకి రాజీనామా చేసి కొత్తగా పార్టీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే) వరప్రసాద్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ ఖరారయ్యారు. తనకు మించి నరసాపురంలో పోటీ చేయగల వ్యక్తి ఎన్డీయే కూటమిలోని మూడు పార్టీల్లో ఎవ్వరికీ దొరకరు అన్నంతగా చెలరేగిన రఘురామకృష్ణ రాజుకు రిక్తహస్తం ఎదురైంది.
గొంతు మారింది...
' రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలుసు. ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. ఎన్నికల బరిలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లోనే ఉంటాను. జగన్‌కు తగిన గుణపాఠం చెబుతాను' అంటూ ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. గెలిచిన తర్వాత అయిదేళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గ ప్రజల మొహం చూడకపోవడం, గెలిపించిన వైసీపీకి వెన్నుపోటు పొడవడం కలిపి ఆయన మీద కూటమి పార్టీలకు నమ్మకాన్ని దూరం చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.