బాబు సూపర్ సిక్స్‌లో బిజెపి ఎందుకు లేదు?
బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యాంటీలో బిజెపీ బొమ్మ లేదు. ఈ ష్యూరిటీలు కేవలం టీడీపీ, పవన్ కల్యాణ్‌లవేనా?;
By : The Federal
Update: 2024-03-30 11:29 GMT
(జి విజయ కుమార్)
బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాబు సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల మ్యానిఫెస్టో ఇటీవల రిలీజైంది. ఆ సూపర్ సిక్స్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు మాత్రమే ఉన్నారు. బిజెపీ మాత్రం కనపడటం లేదు. ఏమిటిది? ఎందుకిలా? ఇది ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కూటమి మేనిఫెస్టోనా?
సూపర్ సిక్స్‌లో ఏమున్నాయి
1 యువతకు 20లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి.
2. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15వేలు
3. ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20వేలు ఆర్థిక సాయం
4. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు
5. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఉచిత సాయం
6. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.
ఇవి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించిన సూపర్ సిక్స్‌లోని ఆరు గ్యారెంటీలు. ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పటికే బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ప్రజల వద్దకు వివిధ రకాల ప్రచార పత్రాలు వెళ్లాయి. ఇంకా కొన్ని విశేషాలేంటంటే మునిసిపాలిటీల్లో ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేస్తోన్న చెత్త పన్నును రద్దు చేస్తాం. పేద ప్రజల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లను పునర్దురిస్తాం. కొండ ప్రాంతాల్లో మంచి నీటి ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మిస్తాం. ఆధునీకరించిన మెట్లు, రెయిలింగ్ నిర్మాణాలు చేపడుతాం. పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాం. రోడ్ల మీదకు వర్షం నీరు, డ్రైనేజీ మురుగు నీరు రాకుండా నిర్మాణాలు చేపడుతాం. నగరాల్లో సర్వీసు రోడ్లను పూర్తి చేస్తాం. నియోజక వర్గాల్లో అన్ని చోట్ల సీసీ రోడ్లు వేయిస్తాం. పార్కులను సుందరంగా తయారు చేస్తాం. మత్తు పదార్థాలను తుద ముట్టిస్తాం. అంటూ ప్రచార పత్రాలను ప్రజలకు అందిస్తున్నారు. ఇటువంటి ప్రచారంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఈ రోజు వరకు తెలియదు. ఉంటే ఎందుకు ప్రచార పత్రాలను ఎన్డీఏ కూటమి కింద ప్రచురించ లేదు. ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న ఇది. దీనికి బిజెపీ వారే సమాధానం చెప్పాలి.
బిజెపీ విధానం వేరు
లౌకిక తత్వానికి వ్యతిరేకంగా ఉండే పార్టీ భారతీ జనతా పార్టీ(బిజెపీ). వాళ్లను లౌకికత్వం పేరుతో తమతో కలిసి మేనిఫెస్టో రూపొందించుకోమని అంటే ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం, జనసేన పార్టీలది. అందుకేనేమో చెబితే ఏమవుతుందో.. చెప్పక పోతే ఎలాగబ్బా అని ఆలోచించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఇలాగే ఉంటే ప్రచారంలో వెనుకబడి పోతాం. అవసరమైతే మరొక కరపత్రాన్ని రిలీజ్ చేద్దామని భావించినట్లున్నారు కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల వారు. అందుకే వారి పార్టీలకీ వారు ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మరి బిజెపి తమ పాలసీలకు అనుగుణంగా కేంద్రం రూపొందించిన మేనిఫెస్టోను ప్రత్యేకంగా ఇస్తుందా.. లేక తెలుగుదేశం జనసేన ఇప్పటికే ప్రచురించిన మేనిఫెస్టోను రివైజ్ చేసి ప్రచార రంగంలోకి దిగుతుందా అనే విషయం బిజెపి నుంచి ఇంకా స్పష్టత లేదు.