బొత్సా.. 3 రాజధానుల ముచ్చటెందుకు ఇప్పుడు?

వైసీపీకి నష్టం కలిగించినట్టు భావిస్తున్న3 రాజధానుల వ్యవహారాన్ని బొత్స సత్యనారాయణ మళ్లీ ఎందుకు తెరపైకి తీసుకువచ్చారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.;

Update: 2025-03-03 14:42 GMT
BOSTA SATYANARAYANA
వైసీపీకి తీవ్ర నష్టం కలిగించినట్టు భావిస్తున్న మూడు రాజధానుల వ్యవహారాన్ని ఆ పార్టీ నాయకుడు, శాసనమండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మళ్లీ ఎందుకు ప్రస్తావించారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సమయం, సందర్భం లేకుండా ఆయన ఆ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారనేది ఆ పార్టీ వారికి సైతం మింగుడు పడడం లేదు.
2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ సందర్భంగా మార్చి 3న రాష్ట్ర శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంలో శాసనమండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu), బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే, మంత్రి అయ్యావ్... ఇంకా ఏం లేదు అవ్వడానికి అని అచ్చెన్నాయుడును ఉద్దేశించి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ దశలో మూడు రాజధానుల ప్రస్తావన వచ్చింది. 
మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని.. వీటిపైనే ఎన్నికలకెళ్తామంటూ గత ఎన్నికల ముందు వైసీపీ ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు ఆ విషయంలో పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడం, ప్రతిపాదిత మూడు రాజధానుల ప్రాంతాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై వెనక్కి తగ్గింది. మూడు రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటివరకు గట్టిగా చెప్పిన ఆ పార్టీ నేతలు... ఇప్పడు వెనక్కి తగ్గారు. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
అప్పట్లో ఉన్న పరిస్ధితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స.. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి కీలకమైనది- మూడు రాజధానులు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే.. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని గతంలో భావించింది గానీ అది సాధ్యపడలేదు. వాస్తవ రూపాన్ని దాల్చలేదు.
ఓటమి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మాట్లాడిన తీరు చూస్తుంటే మూడు రాజధానుల విధానాన్ని వైసీపీ పునఃసమీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల విధానాన్ని తాము అనుసరించామని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు ఇదే అంశంపై తమ విధానం ఏమిటనేది ఇప్పటికప్పుడు చెప్పలేమని, పార్టీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పార్టీలో డిస్కస్ చేసి చెబుతామని వివరించారు. ఇప్పుడా విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరమేముందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News