సీఎం చంద్రబాబు ఎందుకు వెనక్కు తగ్గారు?

విశాఖపట్నం స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి టీ డీపీ వెనుకడుగు వేసింది. అందులో సీఎం చంద్రబాబు వ్యూహం ఏమిటీ?

Update: 2024-08-13 13:30 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. స్థానికేతురుడైన వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేయడం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రచించిన వ్యూహం సఫలీకృతం అయిందని చెప్పవచ్చు. మెజార్టీ లేకపోయినా ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత భావించారు. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేశారు. అయితే స్థానిక సంస్థల నుంచి ఎంపికైన వారి బలాబలాలను బట్టి చూస్తే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించే అవకాశం మెండుగా ఉంది. ఎదో ఒక విధంగా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో తొలుత పావులు కదిపిన సీఎం చంద్రబాబు అందుకు అనుగుణంగానే వైఎస్సార్‌సీపీ తరపున స్థానిక సంస్థల నుంచి ఎంపికైన ప్రజా ప్రతినిధులను తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వారిచ్చే నివేదిక ఆధారంగా అభ్యర్థిని రంగంలోకి దింపాలా వద్దా అనే ఆలోచన చేసినట్లు నిన్నటి వరకు కూటమి నేతలు చెబుతూ వచ్చారు. అధికారంలో ఉన్న తమకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు భావించారని ఆ పార్టీ నేతలు నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగిసిన మంగళవారం నాడు వెల్లడించారు.

బొత్స పోటీలో ఉండటం వల్లే..
ఇటు వైఎస్సార్‌సీపీలోనూ అటు కులం పరంగా బొత్స సత్యనారాయణకు బాగా పట్టుంది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు సైతం బొత్స సత్యనారాయణకు అనుకూలంగా ఉండటంతో చేసేది ఏమీలేక ఆఖరి నిమిషంలో పోటీకి దింపడానికి ఎన్డీఏ కూటమి, సీఎం చంద్రబాబు వెనుకడుగు వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉండటం వల్ల అధికార బలంతో తమ విజయాన్ని అడ్డుకునే అవకాశం ఉందని ముందుగానే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పసిగట్టారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ ముందుకెళ్లారు. అందులో భాగంగా
ఇటు కుల పరంగా అటు గట్టి నాయకుడు కావడంతో స్థానికేతురుడైనా సరే బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వంపై మొగ్గుచూపారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోటీలో బొత్స సత్యనారాయణ కాకుండా మరో వ్యక్తిని రంగంలోకి దింపి ఉంటే ఖచ్చితంగా కూటమి అభ్యర్థి రంగంలో ఉండేవారని టాక్‌ కూడా ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. దీనికి తోడు గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల నుంచి ఎంపికైన ప్రజా ప్రతినిధులతో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పిలిపించి మాట్లాడి పార్టీకి అండగా వుండాలని కోరడం కూడా కొంత వరకు కలిసొచ్చిందనే చర్చ కూడా ఉంది.
బలం లేకపోయినా అప్పట్లో బీటెక్‌ రవి విజయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా 2014 నుంచి 2019 టీడీపీ అధికారంలో స్థానిక సంస్థల కోటా కింద మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్‌ బీటెక్‌ రవిని ఆపార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ తరపున వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని ఆ పార్టీ తరపున పోటీలోకి దింపారు. అయితే అప్పట్లో స్థానిక సంస్థల నుంచి వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉండటంతో విజయం సునాయాసమేననని జగన్‌తో పాటు ఆ పార్టీ శ్రేణులు ఊహించారు. అయితే ఊహకు అందని విధంగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో అప్పట్లో సంచలనం రేగింది. ఇదే తరహాలోనే ప్రస్తుతం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ ఉన్నా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపితే తమకు విజయం కష్టమని వైఎస్సార్‌సీపీ నేతలు భావించారు. అయితే సామాజిక సమీకరణాల పరంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు టీడీపీలోనూ అనుకూలంగా ఉండటంతో పోటీకి వెనక్కు తగ్గారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.
Tags:    

Similar News