ప్రధాని మోదీ ఏపీకి ఎందుకొచ్చినట్టు, ఏమిచ్చినట్టు?

రాజు గారు రానూ వచ్చారు, పోనూ పోయారన్నట్టుగా నరేంద్ర మోదీ పర్యటన సాగిందా అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర ప్రజలు

Update: 2024-03-18 10:51 GMT
చిలకలూరిపేట సభలో వేదికపై పవన్, చంద్రబాబు, మోదీ

పదేళ్ల తర్వాత ఈ ముగ్గురు నాయకులు ఒక వేదిక మీదకు వచ్చారు. 2014నాటి దృశ్యాన్ని తలపించారు, జనం కూడా బాగానే వచ్చారు. ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. కానీ పదేళ్ల తర్వాత చంద్రబాబుతో చేతులు కలిపిన నరేంద్ర మోదీ ఏపీకి ఎందుకు వచ్చినట్టు, ఏమి సందేశం ఇచ్చినట్టు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. వివిధ రాజకీయ పార్టీలు మోదీ తీరును తీవ్రంగానే తప్పుబట్టాయి. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని 2014లో చెప్పిన మోదీ 2024లోనైనా ఏ ఒక్కదానికైనా పరిష్కారం చూపలేదు, కనీసం మాట మాత్రంగానైనా ఎటువంటి హామీ ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్ చివరకు అమరావతి రాజధానికి సంబంధించిన విషయాన్ని కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. రాజు గారు రానూ వచ్చారు, పోనూ పోయారన్న సామెతగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి.

“చిలకలూరిపేట సభలో ప్రధాని వ్యాఖ్యలు వట్టిమాటల జడివాన తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేదు. వికసిత ఆంధ్రప్రదేశ్‌ డబ్బా కొట్టడం తప్ప ఇప్పటి వరకు ఏం చేశారో, వచ్చే ఐదేళ్ళలో ఏం చేస్తారో చెప్పలేదు. రాష్ట్రంలో సమస్యల గురించిగానీ, ప్రత్యేకహోదా గురించిగానీ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గురించిగానీ ఆఖరికి చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో ఉన్న అమరావతి గురించి కూడా ప్రస్తావించకపోవడం మోదీ విద్రోహాన్ని బట్టబయలు చేసింది” అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. నిజానికి చిలకలూరిపేట ప్రాంతం కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోకి తెవాలనుకున్నారు. అటువంటి చోట మీటింగ్ పెట్టినా ఏ హామీ ఇవ్వకుండానే మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టి మధ్యలో 4వందలకు పైగా సీట్లు ఎన్డీఏకి ఇవ్వండని తెలుగులోనే చెప్పి చివర్లో అందరికీ తెలుగు ఉపవచనాలు చెప్పిన మోదీ కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన పథకాల పట్టికను క్రమంతప్పకుండా క్షుణ్ణంగా చెప్పారు. సభ పెట్టిన పల్నాడు జిల్లాకు ఏమేమి ఇచ్చారో కూడా చెప్పారు తప్ప నిర్దిష్టమైన హామీలు ప్రకటించలేదు. పదే పదే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని చెప్పిన మోదీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది వైఎస్ జగన్ సర్కార్ అని తెలియక చెప్పారనుకోలేం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే అది డబుల్‌ ఇంజన్‌ సర్కార్ అనుకున్నారేమోనని చమత్కార భాణాలు వేసిన వారు లేకపోలేదు. తెలుగుదేశంతో జతకడుతూనే జగన్‌ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనక పోవడం కూడా విమర్శలకు దారి తీసింది. 11 విద్యా సంస్థలు ఇచ్చానని చెప్పిన మోదీకి వాటి ప్రహరీ గోడలు కూడా పూర్తికాలేదనే విషయం తెలియదా? అని వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మరో అడుగుముందుకు వేసి “మోదీ ఏపీ ప్రజల్ని మోసం చేసేందుకే వచ్చారని, టీడీపీ, జనసేన ఏర్పాటు చేసిన సభలో బీజేపీ పథకాలను ఏకరవుపెట్టిపోయారని” ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. పోర్టులు, బ్లూ ఎకానమీ అంటే ఆంధ్ర వనరుల్ని అదానీకి అప్పనంగా కట్టబెట్టడమేనా? అని ప్రశ్నించారు షర్మిల. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో 1.20 కోట్ల మందికి ఆరోగ్యం అందించామని చెప్పడం పచ్చి భూటకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రజల ఆరోగ్యం డేటాతో ఫార్మ కంపెనీలను ఉద్దరించడానికే ఆయుష్మాన్‌ భారత్‌ను తెచ్చారన్నది నగ్న సత్యం అన్నారు రామకృష్ణ.’’!?

మోదీకి ఆ భజనేంటీ చంద్రబాబు...

ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధాని మోదీని విశ్వగురు అని, అభివృద్ధికి నమూనా అని, అవినీతిని రూపమాపడంలో ఆయన దిట్టని ఈ నాయకులిద్దరూ ప్రశంసించిన తీరుపైనా మాటల తూటాలు పేలాయి. ‘బాబూ, పవన్‌ మోదీని పొగడడానికే సరిపోయింది. మోదీ మరలా ప్రధాని అయితే ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో, ఏం కావాలో చెప్పలేకపోయారు. రాష్ట్రాభివృద్ధిని నాశనం చేసిన మోదీ విజనే తన విజన్‌ అని చెప్పడం ద్వారా చంద్రబాబుకు ప్రత్యేక విజన్‌ లేదని స్పష్టమైంది. ఎన్‌టిఆర్‌ను పొగిడితే చప్పట్లు కొట్టి పొంగిపోయారు. ఎన్‌టిఆర్‌ బాబ్రీ మసీదు కూలగొట్టడాన్ని వ్యతిరేకించారు. ఫెడరలిజాన్ని కాపాడడం కోసం నిలబడ్డారు. ఇవన్నీ మరచిపోయి లౌకికతత్వ పునాదినే పెకిలించే మోదీ సరసన చేరడం సిగ్గుచేటు’ అన్నారు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు. ఇదే చంద్రబాబు నాయుడు 2019లో నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. మోదీని ఈ రాష్ట్రంలో పర్యటించనీయబోనంటూ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి నిరసన ప్రదర్శనలు చేసిన చంద్రబాబు తిరిగి అదే మోదీతో వేదికను పంచుకోవడం, మోదీని పొగడ్తలతో ముంచెత్తడం రాష్ట్ర ప్రజల్ని సైతం విస్మయపరిచింది. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవంటే ఇదేనేమో అని చర్చించుకునేలా చేసింది. మోదీ విమర్శలన్నీ ఇండియా బ్లాకు మీదనే ఎక్కుపెట్టారు. బిజెపి, టిడిపి జనసేన పొత్తు వినాశకరమైందని, ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం చేసే పొత్తు ఇదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలు మోదీ చేసిన అన్యాయాన్ని మరచిపోరని, ప్రశ్నిస్తారని, బిజెపితో వినాశకరమైన పొత్తు టిడిపి శ్రేణులు ప్రశ్నించాలని కోరారు వి.శ్రీనివాసరావు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వమని మోదీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు మాత్రం మోదీ మైకులే కాదు, మీటింగ్ ఫెయిలైందని మండిపడ్డారు. కాంగ్రెస్, వైసీపీ రెండూ ఒక ఒరలోని పార్టీలేనన్న మోదీ అదెలాగో చెప్పలేదు. రాష్ట్రానికి ఏమి చేస్తామో చెప్పకనే వెనుదిరిగిన తీరు రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా నిరాశపరిచిందనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News