పోలవరం ఎందుకిలా అయింది..

ఆధునిక యుగం. పదేళ్లుగా ఒక ఆనకట్ట కట్టడానికి ఇంజనీర్లు, పాలకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పుడు ‘బట్రెస్’ డ్యామ్ కట్టాలట. అదేంటో తెలుసా?;

Update: 2025-02-04 12:38 GMT

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు వరంగా ప్రజలు భావిస్తున్నారు. పాలకులు మాత్రం తమకు సంపాదన వస్తువుగా మార్చుకున్నారనే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. పదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు బేస్ మెట్ వేయడం పాలకులకు చేతకాలేదు. దేశంలోనే అత్యున్నత పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని పాలకులు గొప్పలు చెబుతున్నారు. రెండు ప్రభుత్వాలు మారాయి. గోదావరిపై ఆనకట్టకు బేస్ మెట్ వేయడం ఇంత వరకు చేతకాలేదు. దేశంలో ఇంజనీర్లు చాలరని విదేశాల నుంచి ఇంజనీర్లను పిలిపించి ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలపై ప్రతిపాదనలు తయారు చేసే పనిలో ఉన్నారు.

ఆనకట్ట నిర్మించాలంటే నేరుగా వచ్చే నీటిని పక్కకు మళ్లించి ఆనకట్ట నిర్మించాలనుకునే ప్రాంతంలో ముందుగా పునాదులు తవ్వి బేస్ మెట్ వేస్తారు. దీనిని ప్రభుత్వం తమ భాషలో ‘డయా ఫ్రం వాల్’ గా చెబుతోంది. ఎవ్వరికీ అర్థం కాని బాషలో చెబితే అది ఎంతో గొప్ప పని అని, దానిని చెయ్యటం ఈ దేశ ఇంజనీర్లకు చేతకాదని, అందువల్లే విదేశీ ఇంజనీర్లు వచ్చి పనులు పర్యవేక్షణ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి డయా ఫ్రం వాల్ నిర్మించి వేల మంది విద్యార్థులు, ప్రజలకు చూపించి నిర్మాణం అంటే ఇలా ఉంటుందని పాలకులు తెలియజెప్పారు. ప్రజలు వచ్చి చూసేటప్పుడు కొంత మంది పాలకుల గొప్పతనాన్ని పొగుడుతూ పాటలు కూడా పాడారు.

ఏ నది పైనైనా ఆనకట్ట కట్టాలంటే పై భాగాన నీటిని పక్కకు మళ్లించాలి. ఆ మల్లించిన నీటిని తిరిగి డ్యామ్ నిర్మాణం జరిగే కింది భాగానికి వచ్చేలా చేస్తారు. అంటే సాఫీగా పారుతున్న నీటిని పక్కకు మళ్లించే నిర్మాణాన్ని ప్రభుత్వ ఇంజనీర్లు ‘కాపర్ డ్యామ్’ అంటున్నారు. నిజానికి దీనిని నీటి మళ్లింపు కట్ట అనొచ్చు. ఈ కట్టను డ్యామ్ బేస్మెట్ నిర్మించే వరకు పై భాగం నుంచి నీరు బేస్ మెట్ వైపు రాకుండా ఎటువంటి లీకులు లేకుండా చూసుకోవాలి. లీసుకులు లేకుండా నీటి మళ్లింపు కట్ట కట్టడం పదేళ్లుగా వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇంజనీర్లకు చేతకాలేదు.

సిమెంట్ లేని రోజుల్లో కేవలం సున్నం కలిపిన రాయితో నిర్మించిన నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. నేడు ఇంజనీరింగ్ లో వచ్చిన సమూల మార్పుల కారణంగా తయారైన ఉక్కు, సిమెంట్ వంటి పదార్థాల ద్వారా ఎంత గొప్ప నీటి ప్రవాహాన్నైనా అడ్డుకుని కట్టలు కడుతున్నారు. ఇంతెందుకు సముద్రం లోపలి భాగంలో తవ్వకాలు జరిపి గ్యాస్ నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాలు బయటకు తీస్తున్నారు. ఇటువంటి ఆధునిక యుగంలో ఉన్న ఇంజనీర్లకు పోలవరం ప్రాజెక్టు కోసం ఆనకట్ట కట్టడం లెక్కలోదే కాదు. అయినా ఎందుకు ఇలా జరుగుతున్నదో నేటికీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సోమవారం ఇంజనీర్లతో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి మల్లింపు కట్ట (కాపర్ డ్యామ్) ను ఆనుకుని మరో కట్ట నిర్మించాలనే ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఉన్న ఎగువ కాపర్ డ్యామ్ పొడవు 2,458 మీటర్లు. ఇదే పొడవున ‘బట్రెస్’ కాపర్ డ్యామ్ నిర్మిస్తారు. అంటే ఏమిటో తెలుసా... ప్రస్తుతం డ్యామ్ నిర్మించే పైభాగంలో నిర్మించిన నీటి మళ్లింపు కట్ట పక్కనే మరో కట్ట నిర్మించడం. ఎందుకు రెండో కట్ట నిర్మించాలనుకుంటున్నారో తెలుసా...

ప్రస్తుతం ఉన్న కట్ట నుంచి నీరు లీకవుతోంది. ఇది ఆగటం లేదని, అందువల్ల రెండో కట్ట కడితే లీకులను నివారించ వచ్చని ఇంజనీర్లు సెలవిచ్చారట. దీంతో ఆ రెండో కట్ట నిర్మానాణికి ప్రతిపాదనలు తయారు చేసి ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలు వచ్చే వరకు కేంద్ర జలవనరుల సంఘం ఎదురు చూస్తుందని వెల్లడించింది. త్వరగా పంపిస్తే పరిశీలించి ఆమోదిస్తామని చెప్పింది. ఇదండీ అసలు విషయం. రెండో సారి విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ, దాని మిత్ర పక్షాలు సాధించిన విజయం. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఇప్పటికే ఏడు నెలలు దాటింది. అయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇంకా కాగితాల్లోనే ఉన్నాయి. ఏడడుగులు కూడా నిర్మాణం జరగలేదని ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.

త్వరిత గతిన రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వారు ఇంజనీర్ల సాహసాలు, ప్రభుత్వ ఫీట్లను చూసి ఆశ్చర్య పోతున్నారు. పదేళ్లుగా వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్లి ఇప్పుడు తిరిగి ఆనట్టన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారంటే పాలకుల గొప్పతనం ఏమిటో ఎవరికైనా అర్థమవుతుంది. ఇక అంతర్జాతీయ ఇంజనీర్లంటారా... వారికి ఎప్పుడో ఏఫీ ఇంజనీర్ల పనితనం అర్థమైంది. లక్షల్లో జీతం ఇస్తుంటే విదేశీ ఇంజనీర్లు వెంటనే ఈ ప్రాజెక్టును వదిలి పెట్టి ఎందుకు పోతారు. ప్రభుత్వం ఉండాలని చెప్పినన్ని రోజులు ఊంటూ ప్రశాంతంగా జీతం తీసుకొని సూచనలు, సలహాలు ఇస్తూ కాలం గడుపుతారు.

పదేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షల మంది ప్రజలు, వ్యవసాయ దారులు ఎదురు చూస్తున్నారు. నిర్మాణ పనులు ఎప్పుడు మొదలై.. ఎప్పుడు ముగుస్తాయో ఎవ్వరూ చెప్పే పరిస్థితుల్లో లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెవివి ప్రసాద్ పేర్కొనడం విశేషం.

Tags:    

Similar News