ఈ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా చేశారు!

ఏపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేసిన సంతకాల తీరును స్పీకర్ తప్పుపట్టారు. చివరకు వారిని ఆయన దొంగలతో పోల్చారు. ఎందుకు ఇలా జరిగింది?;

Update: 2025-03-21 11:14 GMT

మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (ఎమ్మెల్యే) అంటే ఒక గౌరవం. సుమారు రెండున్నర లక్షల మంది ప్రజలకు ఆయన ప్రతినిధి. చట్ట సభలో ఆ ప్రతినిధికి ఎనలేని గౌరవం ఉంటుంది. అటువంటి ఎమ్మెల్యేలు ఏపీ శాసనసభా పతి నుంచి దొంగలు అనిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. సభకు రాబోమని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నాయకుడిపై ఏ మాత్రం గౌరవం, పార్టీపై విశ్వాసం ఉంటే సభలకు వెళ్ల కూడదు. లేదంటే నాయకుడితో చర్చించి సభలకు హాజరవడం మంచిదనే నిర్ణయానికి వచ్చి సభల్లో పాల్గొనాలి. సభలకు వచ్చేది లేదని చెప్పిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ సమావేశాల రిజిస్టర్ లో సంతకాలు చేసి సమావేశాలకు హాజరు కాకుండా వెళ్లిపోయారు.

సంతకాలు ఎందు కోసం చేశారు?

అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే సభ్యత్వం రద్దవుతుందనే ప్రచారం ఉంది. అది ప్రచారమేనని శాసన సభ నిబంధనలు తెలిసిన వారు చెబుతున్నారు. మొత్తం 60 రోజుల్లో శాసన సభకు ఒక్క రోజు హాజరైనా సరిపోతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రిజిస్టర్లలో సంతకాలు చేసి సమావేశానికి రాకుండా వెళ్లిపోయారనేది చర్చగా మారింది. ప్రభుత్వం మారిన తరువాత జరిగిన సమావేశాలకు మొదటి రోజు హాజరై ఆ తరువాత సమావేశాలను బహిష్కరించారు. దీంతో వారి సభ్యత్వానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఒక వేళ ఏదైనా జరిగితే ముందు పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జరిగిన తరువాతనే మిగిలిన ఎమ్మెల్యేలకు జరుగుతుంది.

నీరు గారిన వైఎస్సార్ సీపీ సభ్యల ఆశలు

మొదటి సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు అసెంబ్లీలో కూర్చోవాలని, చర్చల్లో పాల్గొనాలని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నీరు కార్చారు. సమావేశాల మొదటి రోజు ముఖం చూపించి వచ్చేద్దామని వారికి చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటూ సమస్యలు ప్రస్తావిద్దామని చెప్పారు. మీరు కొత్తగా వచ్చారు. మీకు తెలియదు అంటూ వారి మాటలను జగన్ కొట్టిపారేశారు. దీంతో వారి ఆశలు నీరు గారాయి. అసెంబ్లీలో కూర్చుందామన్న అవకాశం ఉన్నా అధ్యక్షుడు తమకు దక్కకుండా చేశారనే బాధ వారిలో ఉంది.

ప్రశ్న అడిగిన సభ్యుడు రాకుంటే సమాధానం మంత్రులు చెప్పరా?

ప్రశ్నలు అడుగుతున్నారు. సభ్యులు రావడం లేదు. అందువల్ల సమయం వృధా అవుతోంది. వారు లేకుండా ఎందుకు సమాధానం చెప్పాలనే ధోరణిలో ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం శాసన సభలో వ్యాఖ్యానించారు. ప్రశ్నలు అడిగిన సభ్యులు రాకపోయినా పలానా పార్టీ శాసన సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం శాసన సభలో సంబంధిత మంత్రి చెబితే తప్పేమీ లేదు. వారు సభకు రాకపోయినా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నానని వివరాలు వెల్లడిస్తే సభలో మంత్రి పదవికి హుందాదాతనం పెరుగుతుందనే వాదన కూడా ఉంది.

సభ్యులను స్పీకర్ అవమానించడం సరైందేనా?

సభ్యులు తప్పులు చేస్తున్నారు. ఇది తప్పని వారికి చెప్పే హక్కు స్పీకర్ కు ఉంటుంది. లేదా అవసరమైతే మందలించే అవకాశం కూడా శాసనసభ స్పీకర్ కు ఉంది. లేదా సభ నుంచి వారిని సస్పెండ్ చేసే హక్కు కూడా వారికి ఉంది. సమావేశం రిజిస్టర్ లో సంతకాలు చేసి సభకు రాకుండా వెళ్లారని, దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడం ఏమిటని సభలో చేసిన వ్యాఖ్యలు ఒక శాసన సభాపతి అనాల్సినవేనా? అనే చర్చ దేశ వ్యప్తంగా మొదలైంది. అదే సమయంలో సంతకాలు చేసి సభకు రాకుండా పోవడం సభ్యులకు కూడా తగింది కాదనే చర్చ జరుగుతోంది. సమావేశానికి వస్తూ రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించే వరకు స్పీకర్ చైర్ కు హుందాతనం తీసుకొస్తుందనటంలో సందేహం లేదు. ఆయన సంతకం చేసి ఎందుకు సభకు రాకుండా పోయారని ప్రశ్నించి ఉంటే సభను, సభ్యులను గౌరవించిన వారు అయి ఉండే వారు. దొంగలు అనే పదాన్ని సభ్యులపై ఉపయోగించడం వల్ల ఆయనకు పదవితో వచ్చిన హుందాతనం కాస్త తగ్గిందనే చెప్పొచ్చు.

ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఏవిధంగా స్పందిస్తారో?

వైఎస్సార్సీపీ నుంచి వై బాలనాగిరెడ్డి, తాడిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, బి విరూపాక్షి, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, దాసరి సుధ పేర్లను స్పీకర్ సభలో చదివి వినిపించారు. ప్రజలు ఎన్నుకున్నారు. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి దొంగల్లాగా సంతకాలు చేసి వెళుతున్నారు అని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఎందుకు ఈ ఖర్మ, ఎమ్మెల్యేలుగా ఉండి సభకు మొఖం చాటేయడటం అంటూ స్పీకర్ సభలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ తరువాత వేరు వేరు తేదీల్లో సంతకాలు పెట్టారు. దొంగల మాదిరిగా సంతకాలు పెట్టారు. వారు ఎవరూ సభలో కనిపించలేదు. మీకెవరికైనా కనిపించారా? నాకైతే కనిపించలేదు. ఓట్లేసిన ప్రజలకు తలవంపులు తేవొద్దు అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని మేధావుల్లో చర్చకు దారి తీశాయి.

ఈ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు..

వై బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన వయసు 60 సంత్సరాలు. వ్యవసాయంపై ఆదారపడ్డారు. భార్య ఇంటి వ్యవహారాలు చూస్తుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాలు బాగా వంటబట్టిన వ్యక్తిగా చెప్పొచ్చు.

తాడిపర్తి చంద్రశేఖర్ మొదటి సారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కట్ తీసుకుని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వ్యపారాలు చేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నుంచి గెలుపొందటం విశేషం.

రేగం మత్స్యలింగం మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అరకు వ్యాలీ నుంచి ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందరు. ఈయనకు 57 సంవత్సరాలు. టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాలంటరీ రిటైర్డ్ మెంట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచారు. ఈయన సంవత్సర ఆదాయం కూడా రూ. 1,76, 716లు గా ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు. మొదటి సారి రాజకీయాల్లోకి వచ్చారు. గిరిజనుడు కావడం, రాజకీయాల గురించి తెలిసినా గతంలో ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన లేదు. అసెంబ్లీలో మాట్లాడాలనే కోరిక ఎక్కువగా ఉండేది.

బి విరూపాక్షి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన వయస్సు 55 సంవత్సరాలు. తొమ్మిదవ తరగతి మాత్రమే పాస్ అయ్యారు. గతంలో ఈయన కాంట్రాక్టర్ గా పనిచేసే వారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. విరూపాక్షి కూడా రాజకీయాలు వంట బట్టించుకున్నవారే. అయితే జగన్ వీరికి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వలేదు.

మత్స్యరాస విశ్వేశ్వర రాజు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం జరిగిన పరిణామాలతో 2019 ఎన్నికలకు ముందు సమన్వయకర్త పదవి నుంచి అధిష్ఠానం తప్పించింది. ఆ తరువాత వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పని చేశాడు. పాడేరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2024 సాధారణ ఎన్నికల్లో విశ్వేశ్వరరాజు గెలుపొందారు. గతంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తరపున 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మత్స్యరాస విశ్వేశ్వరరాజు 2024 సెప్టెంబర్ 26న అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు . ఆయన తెలుగు దేశం పార్టీకి చెందిన కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డిని 12,342 ఓట్ల తేడాతో నాడు ఓడించారు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్ పై పోటీ చేసి ఆ స్థానాన్ని నిలుపుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన మల్లికార్జున రెడ్డి చేతిలో 11,617 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట స్థానాన్ని తిరిగి పొందారు. ఆయన 92,609 ఓట్లు సాధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాల సుబ్రహ్మణ్యం సుగవాసిని 7,016 ఓట్ల తేడాతో ఓడించారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలలో ఈయన ఒకరు.

దాసరి సుధ 2014 ఎన్నికల్లో తన భర్త దివంగత ఎమ్మెల్యే డా గుంతోటి వెంకటసుబ్బయ్యతో పాటు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేసింది. వెంకటసుబ్బయ్య 2021 మార్చి 28న మరణించడంతో బద్వేలు నియంజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సుధను సెప్టెంబరు 28న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె 2021 అక్టోబరు 30లో జరిగిన ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి పి సురేశ్‌పై 90,533 ఓట్ల తేడాతో 2021 నవంబరు 2న ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాసరి సుధ 2024 ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అసెంబ్లీకి వెళ్లకుండా రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన వారు కాగా ముగ్గురు ఎమ్మెల్యేలు సీనియర్లు. రాజకీయాలపై అందరికీ అవగాహన ఉంది.

పార్టీ మారే అవకాశం ఉందనే చర్చ

అసెంబ్లీ సమావేశాలకు రాకుండా సమావేశపు రిజిస్టర్ లో సంతకాలు పెట్టడం చర్చకు దారితీసింది. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ మొదలైంది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వద్దని చెప్పినా వినకుండా వెళ్లి రిజిస్టర్ లో సంతకాలు చేశారంటే దీని వెనుక ఏదో రాజకీయం ఉందనే చర్చ జరుగుతోంది. మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని, వారికి సర్థి చెప్పి వైఎస్సార్ సీపీ వారు అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా ప్రజల్లో ఉంది.

Tags:    

Similar News