ధర్మాన ఎందుకు భయపడుతున్నారు!
రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు భయపడుతున్నారు. ఎందుకు? రాజకీయాలంటే ఆయనకు వెగటుగొట్టినట్టుంది. అందుకేనా? ఏమో వేచి చూడాల్సిందే.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-01-24 14:28 GMT
ధర్మాన ప్రసాధరావు సీనియర్ రాజకీయ వేత్త. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలై తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. మంత్రిపదవి దక్కించుకున్నారు. వైఎస్సార్‌సీపీలో కీలక నేతగా ప్రస్తుతం ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబంగా చెప్పొచ్చు. వైఎస్సార్, రోశయ్య లాంటి మహామహుల వద్ద మంత్రిగా పనిచేసిన ధర్మాన మంచి వక్త. తన వాక్చాతుర్యంతో ఎవరికైనా చెమటలు పట్టించగల దిట్ట. అటువంటి ధర్మాన ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు.
ధార్మన భయం వెనుక..
ఏమకిలీ అంటని నాయకుడిగా పేరున్న ధర్మానకు భూ దందా మకిలీ అంటుకుంది. అయినా భయపడలేదు. ధీటుగా ఎదిటి వారికి సమాధానం చెప్పారు. ఈనాడు దినపత్రిక ఇటీవల విశాఖ భూదందాలో మంత్రి ధర్మాన ఉన్నారంటూ మంత్రి ఫొటోతో సహా పత్రికలో ప్రచురించింది. ఆయన ధీటైన సమాధానం ఈనాడుకు ఇచ్చారు. అప్పుడు కూడా భయపడని ధర్మాన ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు. ఇది రాజకీయ నాయకులతో పాటు పలువురు రాజకీయ పరిశీలకుల్లో కూడా చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని భావిస్తున్నట్లున్నారు. అందుకేనేమో ఈ భయం అంటూ పలువురు సీనియర్ పొలిటీషియన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
సీఎంతో ఏమి చెప్పారు
‘ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు. నేను రెస్ట్ తీసుకుంటానని సీఎంకు చెప్పాను. నేను రాజకీయాల్లో విసిగిపోయానన్నాను. తప్పకుండా పోటీ చేయాలని సీఎం చెప్పారు’ ఇవి మంత్రి ధర్మాన ఇటీవల పలు చోట్ల జరిగిన సభల్లో చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల వెనుక ఏమైనా భయం ఉందా? ఆ భయం ఓటమి భయమేనా? అన్నకు వ్యతిరేకంగా చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఆంధ్ర రాజకీయాల్లో ప్రవేశించడం. బయట ఎక్కడ చూసినా ఈ సారి వైఎస్సార్‌సీపీ ఓడిపోతుందనే ప్రచారం జరగటం, కాంగ్రెస్ చీల్చుకునే ఓటు తప్పకుండా ఎక్కువగా వైఎస్సార్‌సీపీదే ఉంటుందనే భయం కూడా నేతల్లో ఉంది. అందుకే ధర్మాన భయపడుతున్నారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.