ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు ఆలస్యం..

మెగా డీఎస్సీ వెంటనే ప్రకటిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంత వరకు ఎందుకు అమలు కాలేదు. ఆచరణలోకి ఎందుకు రాలేదు.

Update: 2024-11-19 07:16 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకాలు చేసిన తొలి ఫైళ్లలో డీఎస్పీ ఫైల్‌ ప్రధానమైంది. నిరుద్యోగులు ఎదురు చూడకూడదని, విద్యార్థులు చదువులు చెప్పే గురువులు లేక ఇబ్బందులు పడకూడదని, ప్రభుత్వం భావించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌ చాలా సభల్లో డీఎస్సీ విషయం ప్రస్తావిస్తూ టెట్‌ కూడా నిర్వహించారు.

టెట్‌ పరీక్షల సమయంలోనే డీఎస్సీ పరీక్ష కూడా నిర్వహిస్తున్నట్లు ముందుగా ప్రకటించిన ప్రభుత్వం ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ప్రస్తుతానికి టెట్‌ వరకు నిర్వహిస్తున్నామని, గతంలో టెట్‌ రాసి క్వాలిఫై అయిన వారు కూడా డీఎస్సీకి అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏ క్షణంలో అయినా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని, నిరుద్యోగులు పట్టుదలతో చదివారు. టెట్‌ పరీక్ష చాలా కఠినంగా ఉందని, అటువంటిది డీఎస్సీ కూడా అంతకంటే ఎక్కువ కఠినంగా ఉంటుందనే భయం కూడా నిరుద్యోగుల్లో ఉంది.
వేలల్లో ఖర్చు
ఎలాగైనా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టు సాధించాలని పట్టుదలతో చదివారు. దీని కోసం కొందరు నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లను కూడా ఆశ్రయించారు. వేలకు వేలు ఫీజులు చెల్లించారు. తీరా డీఎస్సీ ఇప్పట్లో లేదని నేరుగా విద్యా శాఖ మంత్రే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం గమనార్హం. వేరే పనుల్లో ఉన్న చాలా మంది ఆ పనులు మానుకొని కేవలం డీఎస్సీ పరీక్షలపైనే కసరత్తు చేసినా చివరకు వారి కసరత్తుకు అర్థం లేకుండా పోయింది. భవిష్యత్‌ ఆశలు ఆవిరయ్యాయి. తిరిగి ప్రైవేటు పాఠశాలలు, ప్లే స్కూళ్లు వంటి చోట్ల టీచర్లుగా పని చేసేందుకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఎందుకు డీఎస్సీ ఆలస్యం
డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆలస్యానికి ఎస్సీ వర్గీకరణ ఒక కారణంగా పలువురు భావిస్తున్నారు. ఇటీవల వర్గీకరణ అమలు చేయడం కోసం ఏక సభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. అరవై రోజుల వ్యవధిలో నివేదిక సమర్పించాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్‌ ఎప్పటి నుంచి బాధ్యతలను స్వీకరిస్తుందో.. అప్పటి నుంచి అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలనేది ప్రభుత్వ ఆదేశాలు. ఈ కమిషన్‌కు కావలసిన కార్యాలయ సముదాయాన్ని చూడాల్సిన బాధ్యతను సాంఘీక సంక్షేమ శాఖకు అప్పగించారు. ఆ శాఖ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్త లేదు. ఈ నెల ముగుస్తోంది. డిసెంబరు నెలలోనైనా కార్యాలయం ఏర్పాటు అవుతుందా లేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. కమిషన్‌ సిఫార్సులు అందిన తర్వాత ప్రభుత్వం పరిశీలించడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ సిఫార్సులు అమలు చేసేందుకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. అంటే వచ్చే విద్యా సంవత్సరానికైనా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
మరి కొందరిలో ఉన్న అనుమానాలు ఏమిటంటే.. ప్రభుత్వం హామీలిచ్చినంత సులువుగా వాటిని అమలు చేసే పరిస్థితులు లేవని, పలువురు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనా అందరికీ చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. అప్పు దొరికితే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కేవలం అప్పులతో ఎంత కాలం జీతాలిస్తారనేది కూడా చాలా మందిలో ఉంది. అప్పుల్లేని రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడవాలంటే కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆలోచించి, అడుగు వేయాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉందనే చర్చ కూడా జరుగుతోంది. డిఎస్సీ ద్వారా సుమారు 16వేల మందికి ఉద్యోగాలిస్తే నెలకు సుమారు రూ. 40 కోట్ల వరకు జీతాల కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని కొంత కాలం తగ్గించుకోవడం కూడా ప్రభుత్వానికి అవసరమనే ఆలోచన కూడా పాలకులు చేసినట్లు తెలిసింది.
Tags:    

Similar News