కొండగట్టుపై పవన్‌కు ఎందుకంత గురి

తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయనకు ఆ దేవస్థానమంటే ఎందుకంత గురి.

Update: 2024-06-29 04:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక భద్రత ఎస్పీ అర్జున్‌ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

కొండగట్టు లోని ఆంజనేయ స్వామి వరాలు ఇచ్చే దేవుడని పవన్‌ కళ్యాణ్‌ నమ్ముతారు. ఆంజనేయుడు అంటే అందరికి శక్తిని ఇచ్చే వాడని ఆయన అభిప్రాయం. అందుకే పవన్‌ వివిధ రూపాల్లో ఉన్న కొండగట్టు ఆంజనేయుడి భక్తుడిగా మారాడు.
గుహలు, ఉత్తరాన రాయుని కోట చుట్టూ ఈ ఆలయం ఉత్కంఠ భరితమైన దృశ్యాన్ని అందిస్తుంది. గుహలు, కోట కూడా ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని అందిస్తాయి.
ఆలయానికి జీవం పోసిన సంజీవుడు..
సుమారు 300 సంవత్సరాల క్రితం కొడిమ్యాలలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింతచెట్టు కనిపించింది. సేదతీరడనికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరింద∙పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, ’శ్రీ ఆంజనేయుడు’ కంటపడ్డాడు. సార్థకనాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు ’అంబా’ అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కోరింద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో ఆంజనేయ స్వామి విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ ముఖంతో ఉత్తరాభి ముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నారసింహ, ఆంజనేయ స్వామి ముఖాలతో ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.
Delete Edit
చరిత్రలో కొండగట్టు..
త్రేతాయుగంలో ఈ ప్రాంతంలో రుషులు తపస్సు, యజ్ఞ యాగాదులు చేసుకొంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు, రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది. ఇది ఆగవలసిన సమయం కాదు కదా! శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళి పోయాడు. కొన్నిరోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ రుషుల దైవకార్యాలను ఆటంకపర్చసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది రుషులు గ్రహనాథులకు వైరియైన భూతనాథుడి భేతాళాన్ని ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా, వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు ’ఆంజనేయుడు’ స్వయంభువుగా వెలిసాడు. నాటినుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ, వారి దైవకార్యాలను నిర్విఘ్నంగా చేసుకో సాగారు.
పునరుద్ధరణ
కొండగట్టు దేవాలయ అభివృద్ధికి నాటి తెలంగాణ ప్రభుత్వం 2023–2024 రాష్ట్ర బడ్జెట్‌ లో 100 కోట్లు కేటాయించింది. 2023 ఫిబ్రవరి 15న నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించాడు. అనంతరం అధికారులతో దేవాలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి, దేశంలోనే గొప్ప క్షేత్రంగా రూపుదిద్దడంలో భాగంగా సుమారు 850 ఎకరాల్లో దేవాలయ అభివృద్ధి కోసం మరో 500 కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించాడు.
ఎలా చేరుకోవాలి
కొండగట్టు దేవాలయం కరీంనగర్‌ పట్టణానికి 35 కి.మీ దూరంలో ఉంది రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
Tags:    

Similar News