జగన్, షర్మిల మధ్య గొడవ ఎక్కడ మొదలైంది?
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఏమి జరుగుతోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ఎందుకు భగ్గుమంటోంది.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-01-05 08:19 GMT
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ఏమి జరుగుతోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ఎందుకు భగ్గుమంటోంది. ఇరువురూ రాజకీయంగా ఎందుకు బద్ద శత్రువులయ్యారు. కుటుంబంలో సుహృద్భావ వాతావరణం ఎందుకు కరువైంది? ఈ విషయాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
మొదట అన్నకు తోడుగా...
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో జగన్‌కు తిరుగులేకుండా పోయింది. ఇంత భారీ మెజారిటీ రావడానికి చెల్లెలు వైఎస్ షర్మిల కూడా కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే అన్న జైలుకు వెళ్లిన సమయంలో చెల్లెలు పాదయాత్ర కొనసాగించి పలువురి మన్ననలు పొందింది. ఎన్నికల్లో నేనూ కష్టపడి పనిచేశాననే భావన ఆమెలో ఉంటంతో ప్రభుత్వంలో పదవిని ఆశించారు. అయితే జగన్ తిరస్కరించడంతో కొంత మనస్తాపానికి గురైంది. నిదానంగా షర్మిల భర్త అనిల్, షర్మిలను కూడా దూరంగా ఉంచుతూ రావడాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోయారు.
తెలంగాణకు మకాం మార్పు
ఏపీలో ఉండటం కంటే తెలంగాణలో ఉండటం మంచిదని భావించి అక్కడికి వెళ్లిన తరువాత వైఎస్‌ఆర్‌టీపీని స్థాపించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని రాష్ట్రంలో కేసీఆర్‌పై పోరాటం చేశారు. చివరకు స్వతంత్రంగా రాజకీయాల్లో రాణించలేమని భావించారో ఏమో కాని వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె కాంగ్రెస్‌లోకి రావడాన్ని కాంగ్రెస్ పెద్దలు స్వాగతించారు. ఏపీలో పూర్తి స్థాయిలో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా కాంగ్రెస్‌లోకి రావడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ వారు భావిస్తున్నారు.
ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వార్
అన్న జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరటం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడంతో రాజకీయంగా అన్నా చెల్లెళ్ల మధ్య వార్ మొదలైందని చెప్పవచ్చు. ఈ వార్ ఇంట్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చోటు చేసుకోవడం ప్రజల్లో ఆసక్తిగా మారింది. షర్మిల తన కుమారుని వివాహానికి అన్నా వదినలను ఆహ్వానించేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఇరువురి మధ్య పెద్దగా మాటలు కూడా జరగలేదని సమాచారం. పెళ్లి పత్రిక అందజేసి వెళుతున్నానన్నా అంటూ షర్మిల బయలుదేరినట్లు సమాచారం. ఇంట్లో పెళ్లి పత్రిక అందించే ఫొటోలు కూడా బయటకు విడుదల చేయలేదు.
అన్నా చెల్లెళ్ల మధ్య స్పర్థలకు ప్రధాన కారణాలు
1. ప్రభుత్వంలో తనకు కూడా పదవి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌ను వైఎస్ షర్మిల కోరారు. తనకు కడప ఎంపీగా కానీ, రాజ్యసభ కానీ ఇవ్వాలని కోరగా అందుకు తల్లి విజయమ్మ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పింది. ఈ విషయంలో జగన్ డిఫర్ అయ్యారు. కుటుంబంలో ఒకరు సీఎం స్థానంలో ఉన్నందున ఇంకొకరికి ప్రభుత్వ పదవి ఇవ్వడం మంచిది కాదని తిరస్కరించారు.
2. న్నాన కోరిక మేరకు నాకు ఆస్తిలో వాటా ఇవ్వాలని షర్మిల జగన్‌ను కోరారు. అందుకు జగన్ పూర్తి స్థాయిలో అంగీకరించలేదు. కొంతవరకు ఇస్తానని చెప్పారు. నాకు సగభాగం ఇవ్వాలని షర్మిల పట్టుపట్టడంతో ఏమీ చెప్పకుండా దాట వేశారు. ఈ విషయంలో విజయ్మ కూడా జగన్‌తో విభేదించింది. అయితే షర్మిల సంపాదనపై కూడా ఇంట్లో చర్చ సాగినట్లు సమాచారం.
3. చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య విషయంలో చొరవ తీసుకోకుండా వదిలేయటాన్ని కూడా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. సమగ్రమైన దర్యాప్తు ఎందుకు జరిపించడం లేదని షర్మిల అన్నను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు.
4. వైఎస్ జగన్ భార్య భారతీరెడ్డి అత్త విజయమ్మకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆడపడుచు షర్మిలకు పదవులు దక్కకుండా అడ్డుకోవడం, ప్రభుత్వంలో వైఎస్ భారతి జోక్యం పెరగటం.
5. జగన్ సీఎం అయ్యాక షర్మిల, విజయమ్మలకు భారతిరెడ్డి ప్రాధాన్యత లేకుండా చేయటం.
5. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తూ రావడం.
6. మొదటి సారి ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో భారతిరెడ్డి అనుచరులుగా కొందరు మంత్రులు మారటం.
ఇది ఇంటింటి రామాయణం
ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. ఇంటింటి రామాయణాన్ని ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ పదవులు వద్దనుకుంటే ఇప్పుడున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బందువు కాదా? కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనా«ద్‌రెడ్డి బంధువు కాదా? వాళ్లందరికీ లేనిది షర్మిలకే ఆంక్షలు ఎందుకు. వారికి పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించవచ్చుకదా?
– డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
తెలివైన నిర్ణయం
వైఎస్ షర్మిల రాజకీయంగా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అన్న వద్ద ఉండి రాజకీయంగా ఎదగాలంటే జరిగేపని కాదని ఆమె తెలుసుకున్నారు. ప్రస్తుతం షర్మిల తీసుకున్న నిర్ణయం ఆమె ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వారిద్దరి మధ్య స్పర్థలు అనేవి వారి వ్యక్తిగతం. వాటి గురంచి నేను మాట్లాడలేను. రాజకీయంగా ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల రావడం వల్ల రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే వార్‌లో ఏమవుతుందోనని సామాన్యుల మనసుల్లో ఉంది. షర్మిల చేసింది మంచి పని.
– డాక్టర్ చింతా మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి.