అమర్‌కి చందు 'సెగ', నాగిరెడ్డి 'పొగ'

ఎలాగోలా సీటు దక్కించుకున్నారు.. అసంతృప్తుల నడుమ గాజువాక నుంచి పోటీకి సిద్ధమైన మంత్రి అమర్నాథ్‌కు అసమ్మతి నేతలు సహకరిస్తారా...?

Update: 2024-03-18 13:45 GMT
Source: Twitter

(తంగేటి నానాజీ)


విశాఖపట్నం: రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో ఆయన నిర్వహించిన తొలి సమావేశానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఇటీవల సమన్వయకర్తగా తొలగించిన ఉరుకూటి చందుతో సహా పలువురు కీలక నేతలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. అమర్‌నాథ్ నిర్వహించిన సమావేశానికి వీరు హాజరు కాకపోవడానికి అసంతృప్తే కారణంగా సమాచారం.


భగ్గుమన్న విభేదాలు...


గాజువాక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డిని సమన్వయకర్తగా తొలగించిన నాటి నుండి పార్టీలో నేతల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉరుకూటి చందును వైసీపీ అధిష్టానం దేవన్ రెడ్డి స్థానంలో సమన్వయకర్తగా నియమించి పార్టీ టికెట్ అతనిదేనంటూ ప్రచారం చేసింది. ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చందును తప్పించి గుడివాడ అమర్నాథ్‌ను ఆ స్థానంలో పోటీకి నిలబెట్టనున్నట్లు పార్టీ అధిష్టానం వెల్లడించింది. నియోజకవర్గంలో తన మాట చెల్లలేదన్న అసంతృప్తితో ఎమ్మెల్యే నాగిరెడ్డి, తనకు ఆశ చూపి సీటు అమర్‌కు కేటాయించారన్న మనస్థాపంతో ఉరుకుటి చందు.. అమర్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. ఆయన అనుచరులు కూడా చాలామంది ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. సమావేశానికి అందర్నీ ప్రత్యేకంగా హ్వానించినప్పటికీ హాజరు కాకపోవడంతో వారిని ప్రత్యేకంగా కలిసి మద్దతు కోరాలని మంత్రి అమర్ నిర్ణయించుకున్నారు.


అసమ్మతి నేతలు సహకరిస్తారా?


గాజువాక నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాల నేపథ్యంలో అనూహ్యంగా మంత్రి అమర్‌కు సీటు దక్కింది.. గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆయన్ను ఆ నియోజకవర్గ నేతల అసంతృప్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో నిర్వహించిన తొలి సమావేశానికి హాజరుకాని నేతల వ్యవహారం అధిష్టానం దృష్టికి చేరింది. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.. గాజువాక నియోజకవర్గంలోని కీలక నేతలతో మాట్లాడుతున్నారు. విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పాటుపడాలని ఆయన సూచిస్తున్నారు. అమర్ గెలుపుకు సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో అమర్‌కు అసంతృప్తి నేతలు ఎంతవరకు సహకరిస్తారనేదే ప్రశ్నగా మారింది.



Tags:    

Similar News