జగన్‌మోహన్‌రావుకు టిక్కెట్‌ దక్కుతుందా?

నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావుకు టిక్కెట్‌ దక్కుతుందా? జగన్‌మోహన్‌రావుకు టిక్కెట్‌ ఇవ్వకూడదనే వేరేవారి పేరును సీఎం పరిశీలించినట్లున్నారు.

Update: 2024-03-12 12:43 GMT
సీఎం జగన్ తో మొండితోక జగన్ మోహన్ రావు

జి. విజయ కుమార్ 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తరచూ అభ్యర్థులను మారుస్తుండటం ఆ పార్టీ సమన్వయ కర్తలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఇక మార్పులు ఉండవు. ఇప్పటి వరకు ఉన్న వాళ్లే సమన్వయ కర్తలుగా కొనసాగుతారు అని ప్రకటించిన అనంతరం కూడా మార్పులతో కూడిన జాబితాలను విడుదల చేస్తుండటంతో ఎమ్మెల్యేలు కలవర పడుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తొలుత జనరల్‌.. తర్వాత ఎస్సీ రిజర్వుడు స్థానం మార్పు
నందిగామ అసెంబ్లీ నియోజక వర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు స్థానం. గతంలో ఇది జనరల్‌ స్థానం. మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, దేవినేని వెంకట రమణ, దేవినేని ఉమా వంటి వాళ్లు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 వరకు కూడా ఇది జనరల్‌ సీటు గానే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సయమంలో చేపట్టిన డీలిమిటేషన్‌లో నందిగామ అసెంబ్లీ నియోజక వర్గం రిజర్వుడు కేటగిరీ కిందకు మారింది. 2009 నుంచి ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొండితోక జగన్‌మోహన్‌రావు ప్రస్తుతం సిట్టింగ్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే. ఆయన ప్రముఖ డాక్టర్‌. వైఎస్‌సీపీ అభ్యర్థిగా 2014లో పోటీ చేసి ఓడి పోయిన జగన్‌మోహన్‌రావు 2019లో గెలుపొందారు.
రెండు పదవులు ఉన్నాయని
సిట్టింగ్‌ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు సోదరుడు మొండితోక అరుణ్‌కుమార్‌. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021 నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఒకే కుటుంబంలో రెండు పదవులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉంటే అలాంటి వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని జరగన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొండితోక జగన్‌మోహన్‌రావుకు ఈ సారి టికెట్‌ కష్టమే అని చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది.
సిఎం కోర్‌ గ్రూపులో అరుణ్‌ ఒకరు
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత అంతర్గత కోర్‌ గ్రూపులో ఒకరు. సిఎం వద్ద పలుకుబడి ఉన్న నేతల్లో అరుణ్‌ కూడా ఒకరు. సిఎం వద్ద అంతర్గతంగా జరిగే చర్చల్లో ఆయన కూడా ఉంటారని ఆ పార్టీలో ప్రచారంలో సాగుతోంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో సోదరుడు జగన్‌మోహన్‌రావుకు కాకుండా అరుణ్‌కుమార్‌కే నందిగామ స్థానం దక్కొచ్చని టాక్‌ నడుస్తోంది. నందిగామలో అరుణ్‌కుమార్‌ కంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావుకే మంచి పేరుందని, స్వతహాగా డాక్టర్‌ కావడంతో ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని ఈ సారి కూడా ఆయనకే టికెట్‌ ఖరారు అయ్యే చాన్స్‌ ఉందని మరొక టాక్‌ నడుస్తోంది.
కీలక అధికారి మహిళా బందువు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భద్రతా సిబ్బందిలో ఒక కీలక అధికారికి బందువు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో మహిళా నేతను బరిలోకి దింపాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. సంబంధిత అధికారితో పాటు ఆయన బందువును కూడా పిలిపించి సిఎం మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో ఖర్చు గురించి చర్చించినప్పుడు అంత పెట్టుకోలేమని సదరు వ్యక్తులు చెప్పడంతో కాస్తా పక్కన పెట్టినట్లు చర్చ జరుగుతోంది.
టీడీపీ అభ్యర్థిగా సౌమ్య
నందిగామ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకే ఈ సారి కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు టికెట్‌ ఖరారు చేశారు. దీంతో ఆమె ప్రచారంలో దూసుకొని పోతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


Tags:    

Similar News