సిక్కోలు చిన్నోడికి హ్యాట్రిక్కు దక్కేనా...?
రెండుసార్లు వరుస విజయాలతో శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు మాంచి జోరు మీదున్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో హ్యాట్రిక్ సాధిస్తారా...?
By : The Federal
Update: 2024-03-27 10:13 GMT
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యునిగా గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది జోరు మీరుందున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఈ సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. జిల్లాలో టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించగానే రేగిన అసమ్మతి సెగలు రామ్మోహన్ నాయుడుకు ఇబ్బందికరంగా మారాయి. తమకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్నది కింజరపు కుటుంబమేనని ఆరోపిస్తూ శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు.
అంతేకాకుండా ఎంపీ రామ్మోహన్‌నాయుడును ఓడించి తీరుతామని భీష్మ ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు ఈ పరిస్థితి మింగుడు పడడం లేదు. కొత్త ముఖాలను తెరపైకి తేవడంలో ఎంపీ చేసిన ట్రిక్కు కాస్త బెడిసికొట్టేలా ఉందని ఎంపీ అనుయాయులు బహిరంగానే చెబుతున్నారు.
ఉద్యమాల పురిటి గడ్డ సిక్కోలు...
శ్రీకాకుళం పార్లమెంట్‌లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అపారమైన జలవనరులు ఉండి.. మూడు పంటలు పండే ఛాన్స్ ఉన్నా.. కరువు ప్రాంతంగానే మిగిలిపోయింది. సిక్కోలు జిల్లా నుంచి భారీ ఎత్తున వలసలు కనిపిస్తుంటాయి. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఈ ప్రాంతానికి.. రాజకీయంగా ఎంతో చరిత్ర ఉంది. గౌతు లచ్చన్న, బోడ్డేపల్లి రాజుగోపాలరావు, ఎన్జీ రంగా వంటి మహామహులు ఈ గడ్డ నుంచే చట్టసభలకు వెళ్లారు. ఎందరు వెళ్లినా.. ఎన్ని గళాలు వినిపించినా.. సిక్కోలు జిల్లా అభివృద్ధి మాత్రం అందని ద్రాక్షగానే మారింది. రాజకీయం బాగుపడింది తప్ప.. జనాల తలరాతలు మారలేదు అనే విమర్శ ఉంది. అలాంటి సిక్కోలులో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్‌హాట్‌గానే ఉంటాయి. ఈసారి కూడా అంతకుమించి అనే స్థాయిలో ఉండబోతున్నాయి.
సిక్కోలులో పార్టీల బలమెంత...
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. హస్తం పార్టీ అభ్యర్థులు తొమ్మిది సార్లు గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత సీన్ రివర్స్ అయింది. ఏడుసార్లు సైకిల్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. ఎర్రం నాయుడు నాలుగుసార్లు గెలిచారు. ఎర్రంనాయుడు మరణం తర్వాత.. ఆయన వారసుడు రామ్మోహన్ నాయుడు వరుస విజయాలు సాధిస్తున్నారు. 2014, 2019లో ఎంపీగా గెలిచి.. ఢిల్లీలోనూ, సిక్కోలు గల్లీలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన్నే టీడీపీ అధిష్టానం మళ్లీ బరిలోకి దించింది. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి పరాజయం పాలవగా...ఈసారి వైసీపీ నుంచి పేరాడ తిలక్ బరిలో ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాలు ఉండగా... శ్రీకాకుళం అసెంబ్లీతో పాటు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, ఆముదాలవలస నియోజకవర్గాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు, ధర్మాన సోదరులు, స్పీకర్ సీతారాం, ఫైర్ బ్రాండ్, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు.. ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌కు చెందిన నేతలే.
అసమ్మతి సెగ...
హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్ళూరుతున్న రామ్మోహన్ నాయుడుకు అసమ్మతి సెగ తగిలింది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎంపీకి అత్యధిక మెజార్టీ రాగా.. ఈసారి ఈ నియోజకవర్గాల్లో సీనియర్ నేతలను కాదని కొత్త ముఖాలకు టిడిపి అవకాశం కల్పించింది. దీంతో ఆయా నియోజకవర్గ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంపీపై గుర్రుగా ఉన్నారు. తమకు సీటు దక్కకపోవడానికి కింజరపు కుటుంబమే కారణం అంటూ ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి పోరుతో ఎంపీ సతమత మవుతుంటే వైసీపీ ఎంపీ పేరాడ తిలక్ చాపకింద నీరులా ప్రచారంలో దూసుకుపోతున్నారు.పరిస్థితి చూస్తుంటే కొత్త మొహాలకు టిక్కెట్టు ఇచ్చి ఎంపీ వేసిన ట్రిక్కే ఆయన హాట్రిక్కు కు ప్రతిబంధకంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.