అరకు గీత భవిష్యత్తుపై గిరిజనం అడ్డ ‘గీత’

కొత్తపల్లి గీతకు కొత్త కష్టాలు వచ్చాయి. గతంలో గెలిపించిన గిరిజనులే...ఈమె మాకొద్దు అంటున్నారు.

Update: 2024-03-19 12:56 GMT
Source: Twitter


(తంగేటి నానాజీ )


విశాఖపట్నం: అరకు ఎంపీ సీటు కేటాయింపు బీజేపీకి తలనొప్పిగా మారింది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న కొత్తపల్లి గీతకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆ ప్రాంత గిరిజనులే డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ.. గీతాపై ఫిర్యాదు లేఖలను బీజేపీ అధిష్టానానికి పంపింది. 'గిరిజన మహిళను భారత రాష్ట్రపతిని చేసిన బీజేపీ గిరిజన నేతయిన గీతకు అరకు ఎంపీ టికెట్ కేటాయిస్తే బీజేపీ ఓటమి తప్పదు' అని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ అల్లూరి జిల్లా కన్వీనర్ రామారావు దొర హెచ్చరించారు. దీంతో గతంలో అరకు ఎంపీగా చేసిన కొత్తపల్లి గీత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

అరకు టు అరకు...

అరకు ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించిన కొత్తపల్లి గీత తిరిగి ఇప్పుడు అరకు నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె ఇప్పుడు అరకు టికెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా వైసీపీ తరఫున విజయం సాధించిన ఈమె కొంతకాలానికే పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత జన జాగృతి పార్టీ స్థాపించి 2019 ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోని కొత్తపల్లి గీత పార్టీని బీజేపీలో విలీనం చేసి బీజేపీ నేతగామారారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ తరఫున అరకు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే స్థానిక గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయింపుపై బీజేపీ పునరాలోచనలో పడింది.

ఆది నుంచి వివాదాస్పదమే....

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆది నుంచి వివాదాల చుట్టూ తిరుగుతున్నారు.  కుల వివాదం ఆమెను ఓ కుదుపు కుదిపేసింది. అరకు ఎంపీగా ఉన్న సమయంలోనే కొత్తపల్లి గీత గిరిజనురాలు కాదనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడంతో విచారణ జరిపిన ప్రభుత్వం గిరిజనురాలు కాదని తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతిలాల్ దండే జీవో నెంబర్-2ను విడుదల చేసి ఆమె సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. అయితే ఆమె ఈ వివాదంపై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది.

తెరపైకి డాక్టర్ హేమా నాయక్...

అరకు పార్లమెంటు స్థానం బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీలోనే పలువురు ఆ స్థానానికి పోటీ పడుతున్నారు. కొత్తపల్లి గీతాను గిరిజనులు వ్యతిరేకిస్తుండడంతో స్థానికంగా ఉండే డాక్టర్ హేమ నాయక్ తెరపైకి వచ్చారు. హేమ నాయక్ ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడం.. స్ధానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు చేస్తుండటంతో ఆయనకే బీజేపీ అరకు పార్లమెంటు స్థానం కేటాయించాలని స్థానిక గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

గీతకు టికెట్ లేనట్టేనా...?

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కొత్తపల్లి గీతాకు బీజేపీ నుంచి అరకు పార్లమెంటు టికెట్ దక్కనట్టే కనిపిస్తోంది. అరకు పార్లమెంటు పరిధిలో ఓవైపు బీజేపీలోని అసమ్మతి వర్గం.... మరోవైపు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు. గీతపై అధిష్టానానికి పలువురి లేఖాస్త్రాలు... నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ పెద్దలు పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News