పురందేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షురాలు అవుతారా?
బీజేపీ దేశ అధ్యక్ష పదవి రేసులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఉన్నారు. ఆమె పేరు బీజేపీ పెద్దల పరిశీలనకు వచ్చింది.;
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మంచి మాటకారి. కేంద్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తో విభేదించిన పురందేశ్వరి బీజేపీలో చేరారు. బీజేపీ వారు కూడా ఆమెకు మంచి ప్రయారిటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమె పర్యటించారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషలపై ఆమెకు మంచి పట్టు ఉంది. తన మాటలతో ఎదుటి వారిని ఆకర్షించే శక్తి ఆమెకు ఉంది. అలాగే సరదా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. ఎంటర్టైన్ మెంట్ కార్యక్రమాలకు కూడా హాజరవుతుంటారు. ఎన్నికల సమయాల్లో, పార్టీ నిర్మాణ పరమైన అంశాల్లో బీజేపీ వారు పురందేశ్వరి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
దేశ అధ్యక్ష పదవికి ఆమె పేరు ఎందుకు పరిశీలనకు వచ్చింది?
వెంకయ్య నాయుడు తరువాత ఆ స్థాయిలో దక్షిణ భారత దేశం నుంచి రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన బీజేపీ నాయకులు కేంద్రంలో ప్రస్తుతం లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే దగ్గుబాటి పురందేశ్వరి అన్ని విధాల తగిన నాయకురాలుగా ఎదిగారు. పార్టీ పదవుల్లో ఆమె చేసిన పనితీరు బాగుందనే ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉంది. ఈ సారి దేశాధ్యక్ష పదవి మహిళకు ఇవ్వాలనే ఆలోచనకు బీజేపీ వారు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సౌత్ ఇండియాలో మహిళకు అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బీజేపీ వారు చేస్తున్నారు. పురుషుల్లో అయితే తెలంగాణ వారికి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మహిళ అయితే పురందేశ్వరి పదవికి తగిన నాయకురాలు అవుతారనే చర్చ బీజేపీ పెద్దల్లో జరిగింది. పార్టీలో పలు హోదాల్లో ఇప్పటికే పనిచేశారు.
ఏపీలో బీజేపీకి ప్రాణం పోశారు
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వేళ్లూనుకుంటోందనే చర్చ బీజేపీ వారిలో ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలువగలిగారు. అందుకే మంత్రి పదవులు కూడా ఏపీకి దక్కాయి. బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి తన మరిది అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో రాజకీయంగా మంచి సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఆమెకు ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నా పార్టీలో సీనియర్ గా ఉన్న శ్రీనివాస వర్మకు ఇవ్వక తప్పలేదు.
ఎన్టీఆర్ వారసురాలుగా పేరు తెచ్చుకున్నారు
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో ప్రథమ స్థానంలో పురందేశ్వరి ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఎన్టీ రామారావు కుమార్తెగానే ఆమెకు ఎక్కువ విలువ ఉంది. ఆ కుటుంబంలో ఎన్టీ రామారావు తరువాత హరికృష్ణ, బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చినా కేవలం రాష్ట్రానికే పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు వద్ద శిక్షణ తీసుకునే వారిగానే ఉన్నారు తప్ప వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎదగలేక పోయారనే చర్చ రాజకీయ పరిశీలకుల్లో ఉంది. పురందేశ్వరి అలా కాకుండా అడుగులు ముందుకు వేశారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు కూడా సీనియర్ రాజకీయ నాయకులు. రాజకీయాల్లో అవినీతి మచ్చ అంటని నాయకుడు. అదే కోవలో పురందేశ్వరి కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో పురందేశ్వరి కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలోనూ ఆమెపై అవినీతి ఆరోపణలు కూడా రాలేదు. భర్త ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో పురందేశ్వరి రాణించ గలుగుతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా సక్సెస్
ఏపీలో బీజేపీ అధ్యక్షురాలుగా సక్సెస్ అయ్యారనే సంతృప్తిలో బీజేపీ పెద్దలు ఉన్నారు. దేశ ప్రథమ పౌరు రాలుగా ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును నిలిపిన ఘనత బీజేపీ వారికే దక్కిందనే చర్చ కూడా రాజకీయాల్లో ఉంది. అలాగే దేశాధ్యక్ష పదవి కూడా ఒక మహిళకు ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు పార్టీ పదవుల్లో సమాన హోదా ఇస్తున్నారని పేరు తెచ్చుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎంపీగా గెలవగానే కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుందని భావించినా వచ్చినట్లే వచ్చి పార్టీలో సీనియర్ కు మంత్రి పదవి దక్కింది. అందువల్ల అధ్యక్ష పదవి చర్చ వరకే పరిమితం అవుతుందా? దక్కుతుందా? అనేది రాబోయే రాజకీయ ఎత్తుగడల్లో మార్పులపై ఆధారపడి ఉంటుంది.