ఏపీలో కాంగ్రెస్ సూపర్ స్టార్ల ప్రచారం

ఏపీ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేను కాంగ్రెస్ రంగంలోకి దించుతోంది. వారి ప్రచారం కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెడుతుందా!

Update: 2024-03-04 08:34 GMT
డీకే శివకుమార్, వైఎస్ షర్మిల

సుబ్రహ్మణ్యం, గుంటూరు



వేసవితో పాటే ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికి ప్రతి పార్టీ ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నాయి. అందరి లక్ష్యం గెలుపే. ఓటర్ల నాడి పట్టడమే. వైసీపీ.. తాము అందించిన సంక్షేమాలు, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి ప్రజల చెంతకు వెళ్తుంటే టీడీపీ-జనసేన కూటమి వైసీపీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఓట్లు అడుగుతోంది. ఆంధ్రాలో ప్రత్యేక ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ తెగ తాపత్రయపడుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టింది. ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమైంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతగా షర్మిలతో ఒకవైపు వైఎస్ అభిమానులను ఆకర్షిస్తూ, మరోవైపు జగన్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్ అయింది.
ఎలాగైనా పోయిన పేరు ప్రతిష్టలను సంపాయించాలని తలపెట్టింది. ఇప్పటికిప్పుడు అధికారం అంచుల దాకా పోకపోయినా రాష్ట్ర విభజననాటి గాయాలను మాన్పించి తాను సైతం బరిలో ఉన్నానని నిరూపించుకోవాలనుకుంటోంది. అందుకు తగ్గట్టే పావులు కదుపుతోంది. హిట్ లీడర్లనే ఎన్నికల బరిలోకి దించుతోంది. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన నేతలను ఏదో ఒక కార్యక్రమం పేరిట ఆంధ్రాలోకి తీసుకొస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేశివకుమార్‌ల ఆంధ్రా పర్యటనలను ఖరారు చేసింది. మరికొద్ది రోజుల్లోనే వీరు ఆంధ్రాలో నిర్వహిస్తున్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నారు.


డీకే శివకుమార్ గుంటూరు పర్యటనతో షురూ...

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ ఆంధ్రా పర్యటనను వెల్లడించారు. వీరిలో డీకే శివకుమార్ ముందుగా ఆంధ్రాలో గుంటూరులో పర్యటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి జెట్ బూస్ట్ ఇచ్చేలా గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది కాంగ్రెస్. మార్చి 7న జరిగే ఈ సభలో రాష్ట్ర విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ఇచ్చేలా కీలక ప్రకటన చేయనుంది. వీటిని ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటిస్తారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో విజయం ఒడ్డుకు తీసుకొచ్చిన డీకే చేతుల మీదుగానే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ తమ విజయ యాత్రవైపు పయనాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతోంది.

రేవంత్ పర్యటన విశాఖలో...

కర్ణాటక తర్వాత దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం తెలంగాణ. గతేడాది అక్కడ జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ను కూడా భాగం చేయడానికి కాంగ్రెస్ పూనుకుంది. మార్చి 11న విశాఖలో జరిగే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో రేవంత్ పాల్గొంటారు. అందులో భాగంగానే ఆయన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు మద్దతుగా కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. అందులో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రకటిస్తారని, అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా ఉంటుందని సమాచారం. అయితే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తొలిసారి ఆంధ్రాకు విచ్చేయనున్నారు.

హిమాచల్ సీఎంను ఎందుకు పిలవడం లేదంటే...

ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి ఎంతో పాటుపడిన నేతలను ఏపీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మార్చడానికి కాంగ్రెస్ పూనుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే‌ను ఈనెలలో ఆంధ్రాలో నిర్వహించే ప్రత్యేక సభలకు ముఖ్యఅతిథులుగా ఆహ్వానించింది. దేశం మొత్తంలో కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఏపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ, కర్ణాటక నేతలకు స్థానం కల్పించిన కాంగ్రెస్.. హిమాచల్ ప్రదేశ్ నుంచి మాత్రం ఏ నేతను కూడా ఆంధ్రా ఎన్నికల ప్రచార బరిలోకి తీసుకురావట్లేదు. అందుకు హిమాచల్‌లో బీజేపీ వైఫల్యం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న వాదనలే కారణం.
అందుకే హిమాచల్ నేతలను కాంగ్రెస్ హిట్ లీడర్స్‌గా భావించలేదని, వారిని ఆంధ్రాకు ఆహ్వానించలేదని విశ్లేషకుల అభిప్రాయం. మరికొందరు మాత్రం పొరుగు రాష్ట్రాలకు ఆంధ్రా పరిస్థితులు బాగా తెలుసు కాబట్టే రేవంత్, డీకేను కాంగ్రెస్ ఆహ్వానించిందని, హిమాచల్ నేతలకు ఆంధ్రా పరిస్థితి గురించి అంతగా అవగాహన ఉండదన్న ఉద్దేశ్యంతోనే అక్కడి వారెవరినీ ప్రచారంలో భాగం చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా ఎన్నికల జరుగుతున్నాయంటే అక్కడ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం షరా మామూలే. అన్ని పార్టీలు వీటితో పాటు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక వ్యూహాలను రచించుకుంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ తన హిట్ లీడర్లను తీసుకొస్తోంది. మరి కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Tags:    

Similar News