షర్మిల పోస్ట్ మారుతుందా!

ఏపీసీసీ చీఫ్‌గా షర్మిలను కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుందా? షర్మిలపై నేతలు ఇచ్చిన ఫిర్యాదును కాంగ్రెస్ పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుంది..

Update: 2024-06-21 13:03 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? పార్టీని అసంతృప్తి జ్వాలలు అతలాకుతలం చేస్తున్నాయా? షర్మిల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందా? ఈ వ్యవహారం పార్టీ పెద్దల దాకా వెళ్లిందా? అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దానికి తోడు తాజాగా పార్టీలో సంభవిస్తున్న పరిణామాల దృష్ట్యా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ షర్మిల పోస్ట్ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షురాలి పోస్ట్‌ నుంచి తొలగించి షర్మిలకు ఏ బాధ్యతలు కట్టబెట్టచ్చు అన్న అంశాలపైన పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వాదనలను తాజాగా షర్మిల నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో షర్మిల తీరు ఏమాత్రం బాగోలేదని వారు వివరించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆమె, ఆమె అనుచరగణం వివక్షను చూపారాని ఆరోపించారు.

పారదర్శకత లేదు

‘‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల ఎంపిక అంశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో ఏమాత్రం పాదర్శకత లేదు. ఈ విషయంలో షర్మిల, ఆమె అనుచరులు క్విడ్ ప్రోకో తరహాలో వ్యవహరించారు. వీరి ఒంటెద్దు పోకడల ప్రభావం ఎన్నికల్లో పార్టీ పర్ఫార్మెన్స్‌పై తీవ్రంగానే పడింది. అందుకే ఒక్క స్థానంలో కూడా గెలవడం తర్వాత ఆధిక్యంలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు’’ అని తమ ఫిర్యాదులో ఆక్రోశం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధుల్లో కూడా భారీగానే గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు.

 

చాలా నమ్మకం పెట్టుకున్నాం

వైఎస్ షర్మిల రెడ్డిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటిస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతం సాధ్యమవుతుందని, ఆ దిశగా పార్టీని నడిపించడంలో షర్మిల నిర్ణయాలు సహాయ పడతాయని ఎంతో నమ్మకం పెట్టుకున్నామని చెప్పారు వారు. కానీ షర్మిల సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడతో పార్టీకి తీవ్ర నష్టం కలిగించారని విమర్శించారు. ఆఖరికి బీఫామ్‌ల విషయంలో కూడా షర్మిల అవినీతి చేశారని, పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి అన్యాయం చేస్తూ తనపై పార్టీ హైకమాండ్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు.

సమర్థులకు నో ఛాన్స్

‘‘సమర్థులైన నేతలకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం జరగడానికి షర్మిల ప్రధాన కారణం. షర్మిల అవగాహన రాహిత్యం పార్టీ కేడర్, నేతలు అందరినీ నిరాశకు గురి చేసింది. షర్మిల అనునాయుల్లో తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలో జోక్యం చేసుకున్నారు. తమకు డబ్బులు ఇచ్చిన వారికే బీఫామ్‌లను కేటాయించేలా పావులు కదిపారు. సమర్థులైనా వారు కోరినంత డబ్బు చెల్లించకుంటే మూల కూర్చోవడమే’’ అని సుంకర పద్మశ్రీ ఆరోపించారు. టికెట్ల ఎంపిక విషయంలో సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్లు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, డీసీసీ ప్రెసిడెంట్ల సూచనలను షర్మిల తుంగలోతొక్కారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు అన్నాచెల్లెలు ఇద్దరూ అన్యాయం చేశారు

కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగింది. అధిష్టానం అభ్యర్థుల కోసం ఇచ్చిన నిధులు దారి మళ్లాయి అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘పార్టీకి షర్మిల నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి ఆమె వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి’’అని వారు డిమాండ్ చేశారు. కష్టకాలంలో కూడా పార్టీ జెండాను భుజాన మోసిన కార్యకర్తలను టికెట్లు ఇవ్వకుండా రోడ్డున పడేశారు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ఆర్ కడుపున పుట్టిన జగన్, షర్మిల ఇద్దరూ తమ వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు పద్మశ్రీ. షర్మిల వ్యవహార శైలితో పార్టీకి ఒరిగిందేమీ లేదని, అంతా నష్టమే జరిగిందని మండిపడ్డారు.

Tags:    

Similar News