షర్మిల కొడుకు వైఎస్సార్ వారసుడవుతాడా!

జగన్ చేతిపై బీజేపీ పచ్చబొట్టు పొడిపించుకోవడం మంచిదన్న వైఎస్ షర్మిల;

Update: 2025-09-12 06:08 GMT
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.. వైఎస్ కుటుంబంలో రాజకీయ వారసత్వం ఎవరిదనే దానిపై మబ్బులు వీడుతున్నాయి.. నిన్నటి దాకా వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డే అనుకుంటే ఇప్పుడు ఆయన మేనల్లుడు రాజారెడ్డి కూడా పోటీకి వచ్చారు. వైఎస్ కుమార్తె వైఎస్ షర్మల కుమారుడే ఈ రాజారెడ్డి. వాళ్లమ్మ చెప్పే దానిప్రకారం అతడే వైఎస్సార్ వారసుడు కాబోతున్నారు.

‘వైసీపీ సైతాన్‌ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా నా కొడుకే వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసుడు. ఎంత మంది మొత్తుకున్నా దీన్ని మార్చలేరు’ అని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుండ బద్దలు కొట్టారు. స్పష్టం చేశారు.
‘నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. అప్పుడే వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా? బెదురా అనేది వాళ్లకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుక్కి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా నామకరణం చేశారు. చంద్రబాబు చెప్తే నా కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కష్టపడి ఒక వీడియోను మార్ఫింగ్‌ చేశారు. అది చూసి నవ్వొచ్చింది. ఇంత కష్టం ఎందుకని? చంద్రబాబు చెప్తే నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తే ...మరి ఎవరు చెపితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వాదికి మద్దతిచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలి’ అని షర్మిల చురక వేశారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో గురువారం నిర్వహించిన రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆమె ఈ మాటలన్నారు.
మోదికి జగన్ దత్తపుత్రుడా..
‘వైఎస్‌ఆర్‌ తన మొత్తం జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. ఆయన బతికుంటే జగన్‌ చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునేవారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి ఎందుకు మద్దతివ్వలేదో జగన్‌ సమాధానం చెప్పాలి? మోదీకి జగన్‌ దత్తపుత్రుడు. ఆయన చెప్పినట్లు ఆడుతున్నారు. వైఎస్‌ఆర్‌ మరణం వెనుక రిలయన్స్‌ హస్తం ఉందని చెప్పిన జగన్‌.. అదే రిలయన్స్‌కు చెందిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. మోదీ కోసం అదానీకి గంగవరం పోర్టు కట్టబెట్టారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ బీజేపీ బిల్లులకు మద్దతిచ్చారు. ఆ పార్టీకి తొత్తుగా, తోక పార్టీగా వైసీపీ పని చేస్తోంది’ అని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శించారు.
‘దమ్ముంటే.. వైసీపీ బీజేపీ కి తోక పార్టీ అని జగన్‌ అంగీకరించాలి. ఆ ధైర్యం లేకుంటే చేతి మీద బీజేపీ అని పచ్చబొట్టు వేసుకోండి. పొరుగు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఎవరికీ ఓటు వేయకుండా మౌనంగా ఉంది. వైసీపీకి ఆ మాత్రం ఇంగితం లేదు. వైఎస్‌ఆర్‌ వారసుడై ఉండీ బీజేపీకి ఓటు వేయడం సిగ్గు చేటు. వైఎస్‌ఆర్‌ ఛాతిలో కత్తితో పొడిచిన వాడిలా చరిత్రలో మిగిలిపోతారు’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తల్లి షర్మిలతోపాటు తనయుడు రాజారెడ్డి కర్నూలు పర్యటన చేయడంతో రాజకీయ వర్గాల్లో ఈ చర్చలు మొదలయ్యాయి.
తల్లి షర్మిలతో పాటు ఉన్న రాజారెడ్డి తన అమ్మమ్మ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య వైఎస్ విజయలక్ష్మిని కలసి ఆశీర్వాదాలు తీసుకున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ ఊపందుకుంది.
Tags:    

Similar News