మెజారిటీ తగ్గుతుందా..పెరుగుతుందా
గెలుపు మాట అటుంచితే ఇప్పుడంతా వారికి ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Byline : The Federal
Update: 2024-05-12 10:00 GMT
ఈ సారి 2024 ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ గెలుపు ఓటముల కంటే పులివెందుల, కుప్పం నియోజక వర్గాల్లో వారికి ఎంత మెజారిటీ వస్తుంది, పెరుగుతుందా, తగ్గుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచు కోట. ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులు తిరుగులేదు. ఏళ్ల తరబడి గెలుస్తూ వస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ వారసుడిగా అడుగు పెట్టిన వైఎస్ జగన్ కూడా తిరుగు లేని మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు.
కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కంచు కోట. 1989 నుంచి వరు విజయాలను సొంతం చేసుకొంటూ చరిత్రను సృష్టించారు. ఏడు పర్యాయాలు గెలిచిన చంద్రబాబు భారీగానే మెజారిటీ సాధించారు.
జగన్ మెజారిటీపై చెల్లెళ్ల ప్రభావం
జగన్ చెల్లెళ్లు షర్మిల, సునీతల వైఎస్‌ఆర్‌సీపీకి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వైస్‌ఆర్ తమ్ముడు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, వైఎస్ విజయమ్మ షర్మిల వైపు నిలబడటం, షర్మిలకు ఓట్లేసి గెలిపించాలని కోరడం తదితర అంశాలు 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ మెజారిటీపై పడే చాన్స్ ఉందని స్థానికుల్లో చర్చగా మారింది. షర్మిల, సునీతలు సంధించిన ప్రశ్నలు, గుప్పించిన విమర్శలు ప్రజల్లోకి వెళ్లాయని, దీంతో నియోజక వర్గ ప్రజలు ఆలోచనలో పడ్డారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి పులివెందులలో జగన్‌కు మెజారిటీ తగ్గుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2011 బై ఎలక్షన్‌లో 81,373, 2014లో 75,243, 2019లో 90,110 ఓట్ల మెజారిటీని వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. గతంలో లభించిన మెజారిటీ సగానికి పైగా పడిపోయే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
కుప్పంలో భిన్న పరిస్థితులు
అయితే కుప్పంలో అందుకు భిన్నంగా పరిణామాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఈ సారి మెజారిటీ పెరిగే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 1989 నుంచి వరుస విజయాలతో చంద్రబాబు దూసుకొని పోతున్నారు. 1999లో 65,687 ఓట్ల మెజారిటీ రాగా 2004లో 59,588, 2009లో 46,066 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక 2014లో 47,121, 2019లో30,722 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. గత ఐదేళ్లల్లో చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబుకు ప్లస్‌గా మారే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసిన తీరు. అర్థ రాత్రి చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టడం, కేసులు బనాయించడం, దీంతో గత 45 ఏళ్లల్లో బయటకు రాని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రోడ్లపైకి రావడం, నిజం గెలవాలని టూర్ చేయడం, చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరిని కూడా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు హేళనగా కామెంట్స్ చేయడం, కుప్పంలో భువనేశ్వరి ప్రచారం చేయడం, లోకేష్ కూడా కుప్పంలో ప్రచారం నిర్వహించడం వంటి అంశాలు చంద్రబాబుకు సానుభూతిగా మారే అవకాశం ఉందని, దీంతో చంద్రబాబుకి ఈ సారి భారీగా మెజారిటీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.